జీవో 97 రద్దు చేయాలని పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళనలు నిర్వహిస్తుండటం ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. సీఎం రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన ‘శక్తి’స్కీంను వ్యతిరేకిస్తున్న పాలిటెక్నిక్ విద్యార్థులు..కొత్తగా తెచ్చిన జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రద్దు చేసేంతవరకు తమ నిరసనలు కొనసాగుతాయని ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. ఈ క్రమంలోనే పాలిటెక్నిక్ విద్యార్థులకు మద్దతుగా వరంగల్ వెళ్లేందుకు సిద్ధమైన మాజీ మంత్రి హరీశ్ రావును పోలీసులు హౌస్ అరెస్టు చేశారు.
వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు తమ సమస్యల పరిష్కారం కోసం నిరసన కార్యక్రమానికి పిలుపునివ్వగా.. దానికి మద్దతు తెలిపేందుకు హరీశ్‌రావు వరంగల్ వెళ్లాలని నిర్ణయించుకున్నారు.ఈ క్రమంలోనే హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి చేరుకున్న పోలీసులు ఆయన బయటకు రాకుండా అడ్డుకున్నారు. మాజీ మంత్రి పర్యటనకు అనుమతి లేదంటూ గృహనిర్బంధంలో ఉంచారు. ఎవరూ బయటకు వెళ్లకుండా ఇంటి పరిసర ప్రాంతాల్లో భారీగా బలగాలను మోహరించినట్టు సమాచారం.
తమ సమస్యలను పరిష్కరించాలని విద్యార్థులు శాంతియుతంగా చేస్తున్న నిరసనలకు మద్దతు పలికేందుకు వెళ్తున్న మాజీ మంత్రి హరీశ్ రావును అడ్డుకోవడం సమంజసం కాదని బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. హరీశ్‌రావు హౌస్ అరెస్ట్ విషయం తెలియడంతో పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు ఆయన నివాసానికి పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నట్టు సమాచారం.ఈ క్రమంలోనే ఆయన ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రేవంత్ సర్కార్ నిరంకుశంగా వ్యవహరిస్తూ ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందని బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు.
పాలిటెక్నిక్ కాలేజీల భూములపై కన్ను వేసిన రేవంత్ రెడ్డి అందుకే స్కిల్ వర్సిటీ పేరిట డ్రామాలు ఆడుతున్నారని, రూ.వేల కోట్ల భూములను అమ్ముకోవాలని చూస్తున్నారని బీఆర్ఎస్ నేతలు సంచలన ఆరోపణలు చేస్తున్నారు. విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, బీఆర్ఎస్ నేతలపై ప్రతీకార చర్యలకు పాల్పడటం మానుకోవాలని హితవు పలికారు.












