భారతీయ బ్యాంకులకు వేల కోట్ల రూపాయల రుణాలు చెల్లించకుండా లండన్‌లో పరారీలో ఉన్న ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ మాల్యా మరోసారి సామాజిక మాధ్యమాల ద్వారా కేంద్ర ప్రభుత్వంపై, బ్యాంకింగ్ వ్యవస్థపై విమర్శలు గుప్పించారు. బ్యాంకులకు తాను చెల్లించాల్సిన మూల రుణం కంటే చాలా ఎక్కువ మొత్తాన్ని రికవరీ చేసుకున్నప్పటికీ, తనకు చట్టపరంగా లభించాల్సిన సరైన ప్రాధాన్యత లేదా న్యాయం దక్కడం లేదని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన తన 'ఎక్స్' (ట్విట్టర్) ఖాతాలో సుదీర్ఘ పోస్ట్ చేశారు.
మీడియా రంగ ప్రముఖుడు సుభాష్ చంద్ర ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్ (IBC) ద్వారా అత్యంత తక్కువ మొత్తానికి భారీ రుణ క్లెయిమ్‌లను ముగించుకుంటున్నారనే వార్తలను ప్రస్తావిస్తూ మాల్యా ఈ వ్యాఖ్యలు చేశారు. సుభాష్ చంద్ర కేవలం రూ. 6.5 కోట్లు మాత్రమే చెల్లించి, ఏకంగా రూ.22,006కోట్ల విలువైన రుణ వివాదాలను పరిష్కరించుకుంటున్నారనే వార్త నిజమైతే అది అభినందనీయమేనని అన్నారు. అయితే తన విషయంలో మాత్రం రూ.6,203కోట్ల అప్పుకు గాను ప్రభుత్వం మరియు బ్యాంకులు ఏకంగా రూ.14,100కోట్లు రికవరీ చేసినట్లు ఒప్పుకున్నాయని, ఇది భారత రుణ పరిష్కార చట్టాలలోని అసమానతలకు నిదర్శనమని ఆయన దుయ్యబట్టారు.
రికవరీ అయిన సొమ్ముకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో చెప్పిన వివరాలకు, బ్యాంకులు కోర్టులలో చూపుతున్న లెక్కలకు మధ్య ఎంతమాత్రం పొంతన లేదని మాల్యా గతంలోనూ ఆరోపించారు. ప్రభుత్వం రూ.14,100కోట్లు రికవరీ అయిందని ప్రకటిస్తే, బ్యాంకులు మాత్రం తమకు లభించింది రూ.10,000కోట్లు మాత్రమేనని చెబుతున్నాయని, ఈ రెండింటి మధ్య ఉన్న భారీ తేడాపై స్పష్టత రావాల్సి ఉందన్నారు. ఈ వ్యత్యాసాలను నిష్పాక్షికంగా తేల్చడానికి ఒక రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వంలో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.
అయితే, బ్యాంకింగ్ అధికారులు, ప్రభుత్వ నివేదికల ప్రకారం.. దేశంలో పరారీలో ఉన్న ఆర్థిక నేరగాళ్ల జాబితాలో మాల్యా ఒక ముఖ్య పాత్రధారిగా ఉన్నారు. మాల్యా నుంచి ప్రిన్సిపల్ అమౌంట్ (అసలు సొమ్ము) రికవరీ అయిన మాట నిజమే అయినప్పటికీ, సంవత్సరాలుగా పేరుకుపోయిన వడ్డీలు, జరిమానాలు, ఆయనపై నమోదైన క్రిమినల్ కేసులు చట్ట ప్రకారం కొనసాగుతూనే ఉంటాయని అధికారులు స్పష్టం చేస్తున్నారు.












