నేపాల్-టిబెట్ సరిహద్దు ప్రాంతంలో సంభవించిన ఆకస్మిక వరదలు తీవ్ర విషాదాన్ని నింపాయి. టిబెట్‌లోని గ్యిరాంగ్ ప్రాంతంలో వచ్చిన భారీ వరదల్లో చిక్కుకుని గల్లంతైన కైలాష్ మానస సరోవర్ యాత్రికుల ఆచూకీపై ఆధ్యాత్మిక గురువు, ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీ వాసుదేవ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. బాధితులను కాపాడుకోవడానికి, గాలింపు చర్యల్లో చైనా అధికారులకు తమ వంతు సహకారం అందించడానికి గానూ గ్యిరాంగ్ వెళ్లేందుకు ప్రత్యేక అనుమతి ఇవ్వాలని ఆయన చైనా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ఇషా ఫౌండేషన్ నిర్వహించిన కైలాష్ యాత్రలో తమ బృందానికి చెందిన 80మంది ఆచూకీ ప్రస్తుతం తెలియడం లేదని సద్గురు వెల్లడించారు. వీటిలో 77మంది యాత్రికులు గ్యిరాంగ్‌లోని ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద వేచి ఉన్న సమయంలో ఊహించని రీతిలో వరదలు ముంచెత్తడంతో వారితో అన్ని రకాల సంబంధాలు తెగిపోయాయని వాపోయారు. ప్రస్తుతం తాను సాగా ప్రాంతంలో అందుబాటులో ఉన్నానని, చైనా యంత్రాంగం అనుమతినిస్తే తక్షణమే వెళ్లి రెస్క్యూ ప్రక్రియలో భాగస్వాములవుతామని స్పష్టం చేశారు.
స్థానిక రెస్క్యూ సిబ్బంది చేపడుతున్న సహాయక చర్యలకు తమ వల్ల ఎలాంటి ఆటంకం కలగదని, కేవలం బాధితుల కుటుంబాలకు కచ్చితమైన సమాచారం అందించడానికి, గాలింపు పనుల్లో సహాయపడటానికే అనుమతి కోరుతున్నట్లు ఆయన తెలిపారు. చైనా ప్రభుత్వం సానుకూలంగా స్పందించి తమను ప్రభావిత ప్రాంతానికి వెళ్లనిస్తుందని ఆశిస్తున్నట్లు సద్గురు పేర్కొన్నారు.
ఈ ఏడాది ఇషా ఫౌండేషన్ తరఫున మొత్తం 21బృందాలుగా కైలాష్ యాత్రకు వెళ్లగా, వారిలో 495మంది యాత్రికులు ఇప్పటికే సురక్షితంగా తిరిగొచ్చారు. ఇంకా 743మంది టిబెట్ భూభాగంలో, 148 మంది నేపాల్ సరిహద్దుల్లోనే చిక్కుకుపోయారు. ప్రమాదంలో ఉన్న వారిని సురక్షితంగా రప్పించేందుకు అన్ని మార్గాల్లో ప్రయత్నాలు జరుగుతున్నాయని ఫౌండేషన్ వర్గాలు తెలిపాయి.












