రాజకీయాలు

Congress : కొండాకు పదవీ గండం.. నేడు పీసీసీ చీఫ్‌తో కొండా మురళి భేటీ?

రచన: Kumar4 నిమిషాల పఠనం

అధికార కాంగ్రెస్ పార్టీలో రాజకీయం హీటెక్కింది.పార్టీకి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారికి క్రమశిక్షణా కమిటీ నోటీసులు జారీ చేస్తున్నది. ఇప్పటికే మంత్రి కొండా సురేఖ, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డికి వ్యతిరేకంగా క్రమశిక్షణా కమిటీ నిర్ణయం తీసుకుంది.

అధికార కాంగ్రెస్ పార్టీలో రాజకీయం హీటెక్కింది.పార్టీకి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారికి క్రమశిక్షణా కమిటీ నోటీసులు జారీ చేస్తున్నది. ఇప్పటికే మంత్రి కొండా సురేఖ, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డికి వ్యతిరేకంగా క్రమశిక్షణా కమిటీ నిర్ణయం తీసుకుంది.వీరిద్దరి పదవులు తొలగించాలని ఏఐసీసీకి రిపోర్టు పంపించింది. ప్రస్తుతం కేసీ వేణుగోపాల్ విదేశీ పర్యటనలో ఉన్నందున యాక్షన్ ఆలస్యం అయ్యింది. ఆయన రాగానే మంత్రి కొండా సురేఖ, చిన్నారెడ్డి పదవులు పోతాయని ప్రచారం జరుగుతోంది..

ఈ క్రమంలోనే కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తప్పించవద్దని ఆమె భర్త కొండా మురళి నిన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసి విన్నవించారు. అయితే, తన వద్ద ఏమీ లేదని..నిర్ణయం అధిష్టానం చేతుల్లో ఉందని ఆయన కుండబద్దలు గొట్టినట్టు సమాచారం. క్రమశిక్షణా కమిటీ విచారణలో భాగంగా కొండా సురేఖ.. క్షమాపణలు చెప్పి ఉంటే ఇంతవరకు వచ్చేది కాదని.. తన కూతురు సుస్మిత వ్యాఖ్యలను కూడా ఖండించలేదని.. ఈ విషయంలో పార్టీ చాలా సీరియస్‌గా ఉందని భట్టి..కొండా మురళికి చెప్పగా.. ఆయన నిరాశగా వెనుదిరిగినట్టు తెలిసింది.

తాజాగా మంత్రి కొండా సురేఖ అంశంపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. మీడియాతో మాట్లాడిన ఆయన.. క్రమశిక్షణా కమిటీ కూలంకషంగా పరిశీలించి నివేదిక ఇచ్చిందని, దానిని ఏఐసీసీ వ్యవహరాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌కు పంపించామన్నారు. ఆమె పరిశీలించాక అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు. క్రమశిక్షణ కమిటీ నివేదికపై ఏఐసీసీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటామని పీసీసీ చీఫ్ తెలిపారు.

అదే విధంగా కొండా మురళితో భేటీ కాబోతున్నట్లు జరుగుతున్న ప్రచారంపైనా మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. పార్టీ పరంగా, సమస్యలపైనా ఎవరు వచ్చి తనను కలిసినా మాట్లాడుతానని తెలిపారు. ప్రస్తుతం తాను హైదరాబాద్‍లో లేనందునవల్ల హైదరాబాద్ వచ్చాక మాట్లాడుతానన్నారు. బీసీ మంత్రిపై చర్యలు తీసుకుంటే జరగబోయే పరిణామాలపై పార్టీ ఆలోచనలో పడిందా? అని ప్రశ్నించగా బీసీలకు కాంగ్రెస్ ఇచ్చినంత ప్రాధాన్యత ఏ పార్టీ ఇవ్వలేదని తెలిపారు. కొండా సురేఖ అంశం బీసీలకు సంబంధించినది కాదని, పార్టీ క్రమశిక్షణకు సంబంధించినది అన్నారు.కాగా, సెప్టెంబర్ మొదటివారంలో కొండా సురేఖ పదవీ పోతుందని జోరుగా ప్రచారం జరుగుతోంది.

#konda sureka#konda murali#tpcc cheif mahesh kumar goud#cabinet post#congress
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి