Official: విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న పీరియాడికల్ మూవీ రణబాలి. ఈ సినిమాకి టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నాడు. రష్మిక మందన్న హీరోయిన్. పెళ్లి తర్వాత విజయ్-రష్మిక కలిసి నటిస్తున్న మొదటి సినిమా ఇది. ఇక, తాజాగా ఈ సినిమా విడుదల తేదీని అధికారికంగా కన్‌ఫర్మ్ చేస్తూ మేకర్స్ కొత్త పోస్టర్‌ని వదిలారు. అక్టోబర్ 16న రణబాలి విడుదలకి సిద్ధమవుతోంది.
మైత్రీ మూవీ మేకర్స్, టీ-సిరీస్ కలిసి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ పీరియాడికల్ మూవీలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల మేకోవర్ చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి. వాస్తవానికి ముందు అనుకున్నట్టుగా గనక సెప్టెంబర్ 11న రిలీజ్ అయితే, ఈ పాటికి ప్రమోషన్స్‌లో జోరుగా ఉండేది. కానీ, మైసా షూటింగ్ సమయంలో రష్మిక నడుముకి గాయం అయిన కారణంగా ఆమెపై సీన్స్ షూట్ చేయలేకపోయారు.

దీంతో, సెప్టెంబర్ నుంచి అక్టోబర్ కి పోస్ట్ పోన్ అయింది రణబాలి. నిన్నామొన్నటి వరకూ మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సోషియో ఫాంటసీ మూవీ విశ్వంభర రిలీజ్ ఉంటుందనుకున్నారు. అందుకే, కొత్త రిలీజ్ డేట్‌ని ప్రకటించడానికి మైత్రీ వారు ఆలోచించారు. అయితే, తాజా సమాచారం మేరకు దసరా పండుగకి కూడా విశ్వంభర వచ్చేది కష్టమని ఇన్‌సైడ్ టాక్. దీంతో, ఆ సమయాన్ని మైత్రీ వారు ఉపయోగించుకున్నారు.
అక్టోబర్ 16న రణబాలి రిలీజ్ చేయబోతున్నట్టుగా కొత్త పోస్టర్‌తో అఫీషియల్ కన్‌ఫర్మేషన్ ఇచ్చేశారు. మొత్తానికి, విజయ దశమి పండుగ సందర్భంగా కొత్త దంపతులు కలిసి నటించిన చిత్రంతో సందడి చేయడానికి సిద్ధం కాబోతున్నారు. ఇక, త్వరలో బ్యాలెన్స్ షూట్ కోసం రష్మిక డేట్స్ ఇచ్చింది. మిగిలిన పోర్షన్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్..ప్రమోషన్స్ తో బిజీ కానున్నారు.












