అమెరికాలోని అలాస్కా రాష్ట్రంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఒక చిన్నపాటి విమానం నియంత్రణ కోల్పోయి నీటిలో కుప్పకూలిన ఘటనలో అందులో ఉన్న నలుగురు ప్రాణాలు కోల్పోయారు. యాంకరేజ్ నగరం నుంచి బయలుదేరి సెల్డోవియా ప్రాంతానికి వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించినట్లు స్థానిక అధికారులు అధికారికంగా ధృవీకరించారు. ప్రమాదానికి గురైన పైపర్ పీఏ-24 (Piper PA-24) రకానికి చెందిన ఈ చిన్న విమానం యాంకరేజ్‌లోని మెరిల్ ఫీల్డ్ విమానాశ్రయం నుంచి తన ప్రయాణాన్ని ప్రారంభించింది.
గమ్యస్థానమైన సెల్డోవియా ఎయిర్‌పోర్టుకు చేరుకోవడానికి కొద్ది నిమిషాల ముందు, సాంకేతిక లోపంతో అదుపు తప్పి 'సెల్డోవియా స్లఫ్' జలభాగంలో కూలిపోయింది. ప్రమాద తీవ్రతకు విమానం దాదాపు 15 అడుగుల లోతు నీటిలో మునిగిపోయినట్లు నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ (NTSB) ప్రతినిధులు వెల్లడించారు. సముద్రపు నీటిమట్టంలో మార్పులు మరియు ఆటుపోట్ల తీవ్రత కారణంగా ఘటనా స్థలానికి చేరుకోవడం రెస్క్యూ సిబ్బందికి పెద్ద సవాలుగా మారింది.
సుదీర్ఘ శ్రమ అనంతరం అతి కష్టం మీద సహాయక బృందాలు మునిగిపోయిన విమానం వద్దకు చేరుకుని, అందులోని నలుగురు ప్రయాణికుల మృతదేహాలను బయటకు తీశారు. మృతులంతా వయోధికులని తెలిపిన అధికారులు, వారి భౌతిక కాయాలను తదనంతర పరీక్షల కోసం స్టేట్ మెడికల్ ఎగ్జామినర్ కార్యాలయానికి తరలించారు. ఈ ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా వెల్లడి కాలేదని, వాతావరణ వైపరీత్యమా లేక సాంకేతిక సమస్యల వల్ల ఇది జరిగిందా అనే కోణంలో నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ లోతుగా దర్యాప్తు ప్రారంభించిందని అధికారులు స్పష్టం చేశారు.
అలాస్కాలో వార వ్యవధిలోనే ఇది రెండో విమాన ప్రమాదం. దీంతో స్థానికంగా తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. వారాని క్రితమే దట్టమైన పొగమంచు కారణంగా విజిబిలిటీ లోపించి ఓ చార్టర్ విమానం సైనిక ప్రాంగణంలో కూలిపోయిన ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘోర దుర్ఘటన మరవకముందే ఇప్పుడు పైపర్ పీఏ-24 విమానం ప్రమాదానికి గురై నలుగురు మృతి చెందడం అమెరికా ఏవియేషన్ వర్గాల్లో కలకలం రేపింది.












