క్రైమ్

బస్సులో దొంగల హల్‌చల్.. మత్తు మందు చల్లి రూ.40లక్షల బంగారం అపహరణ!

రచన: Mamatha puppala4 నిమిషాల పఠనం

ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో ప్రయాణిస్తున్న ఓ మహిళకు మత్తు మందు స్ప్రే చేసి భారీ మొత్తంలో బంగారు ఆభరణాలను దోచుకెళ్లిన ఘటన కలకలం రేపింది. బెంగళూరు నుంచి విజయవాడకు వేమూరి కావేరి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో వెళ్తున్న వేంపాటి రాధ అనే మహిళకు సంబంధించిన రూ.40లక్షల విలువైన 300 గ్రాముల బంగారు నగలు అపహరణకు గురయ్యాయి.

ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో ప్రయాణిస్తున్న ఓ మహిళకు మత్తు మందు స్ప్రే చేసి భారీ మొత్తంలో బంగారు ఆభరణాలను దోచుకెళ్లిన ఘటన కలకలం రేపింది. బెంగళూరు నుంచి విజయవాడకు వేమూరి కావేరి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో వెళ్తున్న వేంపాటి రాధ అనే మహిళకు సంబంధించిన రూ.40లక్షల విలువైన 300 గ్రాముల బంగారు నగలు అపహరణకు గురయ్యాయి. గురువారం తెల్లవారుజామున బస్సు ఆగగానే బ్యాగు తనిఖీ చేసుకోగా, ఖాళీ బ్యాగు డోరు వద్ద లభించడంతో బాధితురాలు ఆందోళనకు గురై వెంటనే బస్సు సిబ్బందిని హెచ్చరించింది.

 ఈ దోపిడీ నెల్లూరు-ప్రకాశం జిల్లాల సరిహద్దు ప్రాంతంలో చోటుచేసుకుంది. విజయవాడలో జరగనున్న శుభకార్యానికి హాజరయ్యేందుకు నగలు తీసుకెళ్తుండగా ఉలవపాడు మండలం కోవూరు సమీపంలో ఈ చోరీ జరిగింది. బాధితురాలి విజ్ఞప్తి మేరకు బస్సును ప్రకాశం జిల్లా టంగుటూరు పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లగా, పోలీసులు వెంటనే ప్రయాణికులను, బస్సును నిశితంగా తనిఖీ చేశారు. అర్ధరాత్రి తమపై మత్తు స్ప్రే చల్లడం వల్లే ప్రయాణికులంతా గాఢ నిద్రలోకి జారుకున్నారని, ఆ సమయంలోనే ఈ చోరీకి పాల్పడి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

 టికెట్ రిజర్వేషన్ లేకుండా బస్సులో ఎక్కిన ఒక అపరిచిత యువకుడిపై బాధితురాలు ప్రధానంగా అనుమానం వ్యక్తం చేసింది. ఎలాంటి అధికారిక ఆధారాలు లేకుండా కేవలం డబ్బులు తీసుకుని అతడిని బస్సులో కూర్చోబెట్టినట్లు ఆమె ఆరోపించింది. సీసీ కెమెరాలు లేకపోవడం నిందితుడిని గుర్తించడంలో ఇబ్బందిగా మారిందని, ప్రయాణికుల భద్రతను పక్కనబెట్టిన బస్సు యాజమాన్య తీరుపై బాధితురాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

 ఈ ఘటనపై కేసు నమోదు చేసిన టంగుటూరు పోలీసులు అన్ని కోణాల్లో సమగ్ర విచారణ చేపట్టారు. రిజర్వేషన్ లేకుండా ప్రయాణికుడిని ఎక్కించుకున్న బస్సు సిబ్బంది ప్రమేయంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ వారిని విచారిస్తున్నారు. హైవేలోని సిసిటివి ఫుటేజీలను పరిశీలిస్తూ నిందితుడి కోసం గాలింపు చర్యలను వేగవంతం చేశారు.

#GoldJewelleryTheft#PrivateBusRobbery#PrakasamPolice#CrimeNews#Tanguturu#BusTheft#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి