తెలంగాణ

హనుమకొండలో తీవ్ర ఉద్రిక్తత.. మాజీ మంత్రి హరీశ్‌ రావు అరెస్ట్.. కాలినడకన పీఎస్‌కు తరలింపు!

రచన: Mamatha puppala4 నిమిషాల పఠనం

హనుమకొండ కలెక్టరేట్ ప్రాంగణం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలపై నిరసన తెలుపుతున్న టిఎన్‌జిఓ (TNGO) ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి, బిఆర్ఎస్ (BRS) సీనియర్ నాయకుడు హరీష్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు.

హనుమకొండ కలెక్టరేట్ ప్రాంగణం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలపై నిరసన తెలుపుతున్న టిఎన్‌జీవో(TNGO) ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి, బీఆర్ఎస్ (BRS) సీనియర్ నాయకుడు హరీశ్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం సమస్యలు ఎదుర్కొంటున్న పాలిటెక్నిక్ విద్యార్థులను కలిసేందుకు వెళ్తున్న ఆయనను మార్గమధ్యంలోనే పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు.

ఈ అరెస్ట్ సమయంలో పోలీసులు అత్యంత దురుసుగా ప్రవర్తించారని బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. కనీసం వాహనంలో కూడా ఎక్కించకుండా, హనుమకొండ కలెక్టరేట్ నుంచి సుబేదారి పోలీస్ స్టేషన్ వరకు హరీష్ రావును కాలినడకన తీసుకెళ్లడం పట్ల పార్టీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల తీరుకు నిరసనగా కలెక్టరేట్ పరిసర ప్రాంతాల్లో బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్దఎత్తున ఆందోళనకు దిగడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. "ఏడో గ్యారెంటీగా ప్రజాస్వామ్యం అని గొప్పలు చెప్పిన రేవంత్ రెడ్డి పాలనలో ఇప్పుడు జరుగుతున్నది ఇదేనా?" అని ప్రశ్నించారు. ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు మద్దతుగా నిలిస్తే అరెస్టులు చేయడమేంటని మండిపడ్డారు. ప్రతిపక్షాల గొంతు నొక్కడం, ప్రజల ప్రాథమిక హక్కులను కాలరాయడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని విమర్శించారు.

పోలీసుల నిర్బంధాలను అడ్డుపెట్టుకుని ప్రజా ఉద్యమాలను ఆపలేరని, అరెస్టులతో తమ గొంతును నొక్కడం సాధ్యం కాదని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ అణచివేత ధోరణిని ప్రజలు గమనిస్తున్నారని, ప్రజా ఉద్యమాల ముందు ఈ నిర్బంధాలు నిలబడవని స్పష్టం చేశారు. ఈ ఘటనతో హనుమకొండలో రాజకీయ వేడి ఒక్కసారిగా రాజుకుంది.

#HarishRaoArrest#HanamkondaUnrest#BRSProtest#RevanthReddy#SubedariPoliceStation#TNGODharna#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి