క్రైమ్

Nagar Kurnool: మాదక ద్రవ్యాల మత్తులో యువత.. తండ్రి నీతులు.. కొడుకు బూతులు!

రచన: Venu••6 నిమిషాల పఠనం

ఎందరో విద్యార్థులను సన్మార్గంలో నడిపిస్తూ వారికి మార్గదర్శిగా ఉండవలసిన ఆ కాలేజీ ప్రిన్సిపాల్ తన సొంత కొడుకుని పెంచడంలో మాత్రం దారుణంగా విఫలమయ్యాడని స్థానికులు మండిపడుతున్నారు. అయితే కొడుకు భవిష్యత్తును దారిలో పెట్టని అతను.. ఇక విద్యార్థుల భవిష్యత్తుకు ఏం న్యాయం చేస్తాడని ప్రశ్నిస్తున్నారు.

సమాజంలో బాధ్యతగా ప్రవర్తించవలసిన యువత మాదక ద్రవ్యాల మత్తులో తమ జీవితాలను చీకటిమయం చేసుకుంటున్నారు. మొదట సరదాగా మొదలైన ఈ అలవాటు... చివరికి కుటుంబానికి దూరం చేసి, ఆరోగ్యాన్ని నాశనం చేసి, భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తోంది. ఒక్కసారి ఆ మత్తుకు బానిసైతే బయటపడటం ఎంతో కష్టం. తల్లిదండ్రుల ఆశలు, చదువు, ఉద్యోగం, ప్రేమించే వారి నమ్మకం... అన్నీ కళ్లముందే కరిగిపోతాయి.

మత్తు ఇచ్చే ఆనందం కొన్ని క్షణాలే... కానీ అది చేసే నష్టం జీవితాంతం వెంటాడుతుందనే ఆలోచన లోపించడం వల్ల ఇలాంటి వారు సమాజానికి చీడ పురుగుగా మారుతున్నారు. విచక్షణ కోల్పోయి ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి సంఘటనలు నిత్యం ఎక్కడో ఒకచోట బయటపడటం కనిపిస్తుంది. ఇక మూడు రోజుల క్రితం నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం గుడ్ల నర్వ గ్రామంలో గంజాయి మత్తులో పట్టపగలే ఓ యువకుడిని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించిన సంఘటన అందరికి తెలిసిందే.

గతంలో నెలకొన్న గొడవల కారణంగా గ్రామంలో సెంట్రింగ్ పని చేస్తున్న బేగిని రాజు ను అదే మండలానికి చెందిన ముగ్గురు యువకులు స్కార్పియో వాహనంలో వెళ్లి పట్టపగలు గ్రామస్తులు చూస్తుండగానే కిడ్నాప్ కు ప్రయత్నించారు. అయితే ఆ ముగ్గురు యువకులు అప్పటికే మాదక ద్రవ్యాల మత్తులో ఉండటం స్థానికులు గమనించి వారించినా వినకుండా నోటికి వచ్చిన బూతులు తిడుతూ బిగ్గరగా అరుస్తూ నానా హంగామా సృష్టించారు.

చివరికి గ్రామస్తులు ఆ ముగ్గురు యువకులను మందలించి అక్కడినుంచి పంపించేశారు. ఈ సంఘటన పై బిజినపల్లి పోలీసులు ఆ యువకుల పై ఎఫ్ఐఆర్ నెం.222/2026 కేసు నమోదు చేశారు.. ఈ క్రమంలో కేసుకు సంబంధించి ఎంక్వైరీ చేయడానికి వెళ్లిన పోలీసులకు విస్తుపోయే అనుభవం ఎదురైంది. ఒక యువకుడి ఇంటికి పోలీసులు వెళ్లగా, అతడు ఇంట్లో లేకపోవడంతో విషయాన్ని తండ్రికి వివరించారు.

అయితే ఆ తండ్రి తన కొడుకు చాలా మంచోడని, ఎలాంటి తప్పుడు పనులు చేయడని పోలీసులతో వాదించాడు. నిజం నిరూపించేందుకు పోలీసుల ముందే స్పీకర్ ఆన్ చేసి కొడుక్కి ఫోన్ చేయగా.. డాడీ డోంట్ వర్రీ, పోలీసులు ఏం పీకలేరు అంటూ ఆ యువకుడు ఫోన్లోనే బూతు పురాణం అందుకున్నాడు. ఇది విని పోలీసులు అవాక్కయ్యారు. ఇక ఆ యువకుడి తండ్రి ఒక ప్రభుత్వ జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ అని సమాచారం..

ఎందరో విద్యార్థులను సన్మార్గంలో నడిపిస్తూ వారికి మార్గదర్శిగా ఉండవలసిన ఆ కాలేజీ ప్రిన్సిపాల్ తన సొంత కొడుకుని పెంచడంలో మాత్రం దారుణంగా విఫలమయ్యాడని స్థానికులు మండిపడుతున్నారు. అయితే కొడుకు భవిష్యత్తును దారిలో పెట్టని అతను.. ఇక విద్యార్థుల భవిష్యత్తుకు ఏం న్యాయం చేస్తాడని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు బిజినపల్లి ప్రాంతంలో కొందరు యువకులు మద్యం, గంజాయి మత్తులో విచక్షణ మరిచి ప్రవర్తిస్తున్నారు.

ప్రతినిత్యం ఎక్కడో ఒకచోట గొడవలకు దిగుతూ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారు. పోలీసుల పట్ల కనీస గౌరవం లేకుండా ప్రవర్తిస్తున్న ఈ గంజాయి బ్యాచ్‌లపై పోలీసులు సైతం తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ తరహా ముఠాలపై ప్రత్యేక నిఘా పెట్టి, వారి ఆగడాలకు చెక్ పెట్టాలని స్థానికులు కోరుతున్నారు. ఇక పిల్లలకు సమాజంలో ఎలా నడుచుకోవాలో నేర్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే...

వారు మందికి నీతులు చెబుతూ.. వాళ్ళ పిల్లలు దారి తప్పుతున్నప్పుడు వెనకేసుకొస్తే.. అది వారి భవిష్యత్తునే కాక సమాజానికి కూడా నష్టం కలిగిస్తుంది. అందుకే పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు నిఘా ఉంచి, వారిని బాధ్యతాయుత పౌరులుగా తీర్చిదిద్దడమే అసలైన పెంపకానికి నిర్వచనం.

#Nagar Kurnool#Bijinepally#Gudla Narva#intoxication#father#son#spewing profanities
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి