RTI నివేదికలో బయటపడిన నిజాలు!
మంత్రుల బంగ్లాల కోసం రూ.92 కోట్లు
12 ఏళ్లలో రూ.547 కోట్లు
ఒక్కో మంత్రి ఇంటికి సగటున రూ.1.2 కోట్లు
ప్రజాధనం ఇలా ఖర్చు చేయాల్సిందేనా?
ప్రభుత్వ ఖజానా నింపుకోవడానికి సామాన్య ప్రజల వద్ద నుండి ముక్కు పిండి పన్ను వసూలు చేసే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. ప్రతి సంవత్సరం వృధాగా పెడుతున్న ఖర్చు చూస్తే.. హార్ట్ బీట్ పెరగడం ఖాయం.. నిత్యం పెరుగుతున్న ధరలతో.. ప్రభుత్వాలు ఉచితాల పేరుతో చేస్తున్న ఖర్చుల భారం మోస్తూ.. వాటిని మౌనంగా భరిస్తూ.. దేశ రాష్ట్ర ప్రజలు అనుభవిస్తున్న వేదన వర్ణాతీతం..
ఈ నేపథ్యంలో ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా దాఖలు చేసిన ఆర్టీఐ పిటిషన్ కు సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ ఇచ్చిన సమాధానంలో వెల్లడైన గణాంకాలు చూస్తే.. రూపాయి కూడా ఆలోచించి ఖర్చుపెట్టే మధ్యతరగతి జనం కళ్ళు బైర్లు కమ్మడం ఖాయమనిపిస్తుంది. ఢిల్లీలోని లూటియెన్స్ బంగ్లా జోన్‌లో నివసించే కేంద్ర మంత్రుల అధికారిక నివాసాల మరమ్మతులు, పునరుద్ధరణ, ఫర్నీషింగ్ కోసం 2025-26 ఆర్థిక ఏడాదిలో రికార్డు స్థాయిలో రూ.92.35 కోట్లు ఖర్చు చేసినట్లు ఆర్టీఐ నివేదిక ద్వారా వెల్లడైంది.
ఇక 2014-15లో ఖర్చు చేసిన రూ.27.47 కోట్లతో పోలిస్తే ఇది మూడింతలు పెరిగింది. కేంద్ర మంత్రుల అధికారిక నివాసాల నిర్వహణపై ఖర్చవుతున్న ప్రజాధనం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. 2014-15 నుంచి 2025-26 వరకు కేంద్ర మంత్రుల అధికారిక నివాసాల నిర్వహణకు ప్రభుత్వం చేసిన ఖర్చు మొత్తం రూ.547.68 కోట్లు. వందేళ్లకు చేరువైన భవనాల్లో సీపేజ్, చెదలు, పాత వైరింగ్, ప్లంబింగ్, డ్రైనేజీ వంటి సమస్యలు సరిచేయడానికి ఇంత మొత్తంలో ఖర్చు చేసినట్టు అధికారులు చెబుతున్నారు.
అయితే ప్రజల సొమ్ముతో నిర్వహిస్తున్న ఈ భవనాలపై ఖర్చుకు పరిమితి లేదా అనే ప్రశ్న ఈ విషయం తెలిసిన ప్రతివారిలో మెదులుతుంది.. అలాగే 2025-26లో రూ.92.35 కోట్లను సుమారు 70 నుంచి 72 మంది మంత్రుల నివాసాలకు ఖర్చు చేస్తే.. ఒక్క నివాసానికి సగటున దాదాపు రూ.1.2 కోట్ల వ్యయం అవుతుంది. ఇది కేవలం ఒక ఏడాది నిర్వహణ ఖర్చు.. దీన్ని బట్టి చూస్తే ప్రజలకోసం పనిచేసే మంత్రుల విలాసాల కారణంగా వృధా అవుతున్న జనం ధనం కట్టడి చేయవలసిన అవసరం ఉందనే విషయం అర్థం అవుతుంది.
మరోవైపు దేశంలో సామాన్యుడు పన్నులు కడుతున్నాడు. రైతు అప్పులతో పోరాడుతున్నాడు. యువత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తోంది. ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రులు మౌలిక వసతుల కోసం ఎదురుచూస్తున్నాయి. అలాంటి సమయంలో ప్రజలు ఇచ్చే ప్రతి రూపాయి కూడా అత్యంత జాగ్రత్తగా ఖర్చు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై లేదా? అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.. కేంద్ర ఖర్చు తో రాష్ట్రాలు పెట్టె ఖర్చులు కలిపితే ఎన్ని లక్షల వేల కోట్ల ధనం వృద్ధా పోతుందో?.. ఆలోచించవలసిన అవసరం ఉందని అంటున్నారు.
ఇక ఇలా జనం ధనం వృధా చేసే బదులు.. వాటిని జనం కోసమే ఖర్చుచేసేలా ఆలోచించే నేతలుంటే.. దేశంలో యువతకు ఆర్థికంగా.. వసతుల పరంగా ఏలోటు ఉండేది కాదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.. అదేవిధంగా మౌలిక వసతులు, విద్య, వైద్యం, ఉపాధి వంటి రంగాలకు దక్కాల్సిన అవకాశాలు కూడా పెరుగుతాయి..
మరోవైపు దేశంలో ప్రభుత్వ యంత్రాంగంలో అవసరం లేని ఆస్తులకు అద్దెలు, ఉపయోగించని భవనాలకు నిర్వహణ, ఆలస్యాల వల్ల పెరిగే ప్రాజెక్టు వ్యయాలు, పనికిరాని మౌలిక వసతులపై ఖర్చులు వంటి అంశాలను కాగ్ నివేదికలు తరచూ ప్రస్తావిస్తున్నాయి.
ఉదాహరణకు, కాగ్ తాజా నివేదికలో ఉపయోగంలో లేని ముంబై గోదాముకు అద్దె, భద్రతా సిబ్బంది ఖర్చుల రూపంలో రూ.1.64 కోట్ల వృథా వ్యయం గుర్తించింది. అంటే సమస్య ఒక్క మంత్రుల బంగ్లాలతో ముగిసిపోదు. ప్రభుత్వ డబ్బు ఖర్చయ్యే ప్రతి చోట పారదర్శక విధానంతో ముందుకు వెళ్ళే రాజకీయ నాయకులు కావాలనే అంశాన్ని ఇక్కడ గమనించవచ్చు.. ఎందుకంటే అది మంత్రుల సొమ్ము కాదు.. అధికారుల సొమ్ము కాదు.. రాజకీయ పార్టీల సొమ్ము కాదు..అది ప్రజల సొమ్ము.
ప్రజలు పన్నులు చెల్లిస్తారు.. ప్రభుత్వం బడ్జెట్ రూపొందిస్తుంది.. అధికారులు ఖర్చు చేస్తారు. కానీ ఆ ఖర్చుకు చివరి యజమాని మాత్రం ప్రజలే.. అందుకే కేంద్రంలో గానీ రాష్ట్రంలో గానీ ఏ పార్టీ అధికారంలో ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించడం పైనే దృష్టి సారిస్తే భారతదేశ వైభవం ప్రపంచవ్యాప్తం అవుతుంది.
అన్నీ దేశాలను వెనక్కి నెట్టేలా అభివృద్ది పథం వైపు పయనిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక ప్రజల డబ్బుతో పాలకులకు సౌకర్యాలు కల్పించడం తప్పు కాదు.. కానీ ప్రజల అవసరాల కంటే పాలకుల సౌకర్యాలకు ప్రాధాన్యం పెరిగితే మాత్రం అది ఖచ్చితంగా రాబోయే తరాలకు శాపంగా మారుతుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు..


