వ్యాపారం

యూపీఐకి పదేళ్లు.. రికార్డు స్థాయి లావాదేవీలు!

రచన: Mamatha puppala••5 నిమిషాల పఠనం

పదేళ్ల కిందట ఏ వస్తువు కొనడానికి అయినా నగదు రూపంలో కానీ, క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డుల రూపంలో చెల్లింపులు జరిగేవి. ఆ తర్వాత యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్) రాకతో ప్రపంచ ఆర్థిక స్థితిగతులే మారిపోయి భారత్ డిజిటల్ ఇండియాగా అవతరించింది. భారత డిజిటల్ చెల్లింపుల విప్లవానికి ప్రతీకగా నిలుస్తున్న యూపీఐ తన ప్రస్థానంలో విజయవంతంగా పదేళ్లు పూర్తి చేసుకుంది.

పదేళ్ల కిందట ఏ వస్తువు కొనడానికి అయినా నగదు రూపంలో కానీ, క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డుల రూపంలో చెల్లింపులు జరిగేవి. ఆ తర్వాత యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్) రాకతో ప్రపంచ ఆర్థిక స్థితిగతులే మారిపోయి భారత్ డిజిటల్ ఇండియాగా అవతరించింది. భారత డిజిటల్ చెల్లింపుల విప్లవానికి ప్రతీకగా నిలుస్తున్న యూపీఐ తన ప్రస్థానంలో విజయవంతంగా పదేళ్లు పూర్తి చేసుకుంది. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ యూపీఐకి సంబంధించిన కీలక వివరాలను వెల్లడించింది.

 ప్రస్తుతం దేశీయ డిజిటల్ చెల్లింపుల్లో ఏకంగా 84 శాతం వాటాను కలిగి ఉన్న యూపీఐ.. దేశ సరిహద్దులు దాటి అంతర్జాతీయంగానూ తన సేవలను విస్తరిస్తోంది. 2016 ఆగస్టు 25న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) సహకారంతో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) యూపీఐని ప్రారంభించింది. అప్పట్లో కేవలం 21 బ్యాంకులతో అత్యంత సాధారణంగా ప్రారంభమైన ఈ విప్లవాత్మక వ్యవస్థలో, నేడు ఏకంగా 741 బ్యాంకులు భాగస్వామ్యం కావడం విశేషం.

పదేళ్ల క్రితం ప్రారంభమైన ఈ సేవలు నేడు అసాధారణ వృద్ధిని సాధించాయి. 2016-17 ఆర్థిక సంవత్సరంలో కేవలం రూ.0.07లక్షల కోట్లుగా ఉన్న లావాదేవీల విలువ, 2025-26 నాటికి అసాధారణ రీతిలో రూ. 314 లక్షల కోట్లకు దూసుకెళ్లింది.  పదేళ్ల కాలంలో లావాదేవీల పరిమాణంలో దాదాపు 13వేల రెట్లు, విలువలో 4వేల రెట్లకు పైగా భారీ వృద్ధి నమోదైంది. తాజాగా ఈ ఏడాది జులై నెలలో యూపీఐ సరికొత్త రికార్డులను సృష్టించింది. ఒక్క నెలలోనే రికార్డు స్థాయిలో రూ.29.88లక్షల కోట్ల విలువైన లావాదేవీలు జరిగాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.

జులై 2026లో అత్యధికంగా 2,366 కోట్ల లావాదేవీలు జరగగా, సగటున ప్రతిరోజూ దాదాపు 66 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) నివేదిక ప్రకారం.. 2025లో ప్రపంచ వ్యాప్తంగా జరిగిన మొత్తం రియల్-టైమ్ చెల్లింపుల లావాదేవీలలో దాదాపు 49 శాతం ఒక్క యూపీఐ ద్వారానే జరగడం భారత్ సాంకేతిక సత్తాకు నిదర్శనంగా నిలిచింది. దేశీయంగానే కాకుండా గ్లోబల్ మార్కెట్‌లోనూ యూపీఐ తన సేవలను వేగంగా విస్తరిస్తోంది. ప్రస్తుతం ఫ్రాన్స్, యూఏఈ, భూటాన్, శ్రీలంక, నేపాల్, సింగపూర్, మారిషస్, ఖతార్, గ్రీస్, మాల్దీవులు, కంబోడియా సహా మొత్తం 11 దేశాల్లో యూపీఐ చెల్లింపులు అధికారికంగా అందుబాటులో ఉన్నాయి.

ఈ అంతర్జాతీయ విస్తరణ వల్ల భారతీయ పర్యాటకులు, ప్రవాస భారతీయులు (ఎన్‌ఆర్‌ఐలు) విదేశీ గడ్డపై కూడా ఎంతో సులభంగా, వేగంగా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా డిజిటల్ చెల్లింపులు చేసేందుకు అద్భుతమైన అవకాశం లభించింది. ఇప్పుడు విజయవంతంగా రెండో దశాబ్దంలోకి అడుగుపెట్టిన యూపీఐ సేవలను రాబోయే రోజుల్లో మరిన్ని దేశాలకు విస్తరించేందుకు ప్రభుత్వం, ఎన్‌పీసీఐ ముమ్మరంగా సన్నాహాలు చేస్తున్నాయి. డిజిటల్ ఇండియా సాధించిన ఈ చరిత్రాత్మక విజయం ప్రపంచ దేశాల ప్రశంసలను అందుకుంటోంది.

#UPI Completes 10 Years#UPI Transactions July 2026#National Payments Corporation Of India#Digital Payments India Global Expansion Telugu News#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి