International

మక్కా నుంచి కొత్త ప్రపంచం..! ముస్లిం దేశాలన్నీ ఒక్కటవుతున్నాయా?

రచన: Kashi••11 నిమిషాల పఠనం

మిడిల్ ఈస్ట్‌లో పాత రాజకీయ మ్యాప్ మారుతోంది. పాత శత్రుత్వాలు కొత్త భాగస్వామ్యాలుగా మారుతున్నాయి. పశ్చిమాసియాలో ఇకపై అమెరికా చెప్పే భద్రతా లెక్కలే నడుస్తాయా? లేక మక్కా నుంచి కొత్త పవర్ సెంటర్ పుట్టుకొస్తుందా అన్న‌దే ఆస‌క్తిక‌రం.

మిడిల్ ఈస్ట్‌లో కొత్త గేమ్

ఒక్క తాటిపైకి ముస్లిం దేశాలు

మ‌క్కా అగ్రిమెంట్‌తో ప్ర‌కంప‌న‌లు

ఇరాన్‌కూ వెల్‌క‌మ్ చెప్పిన 3 దేశాలు

పశ్చిమాసియాలో యుద్ధాలు, ఉద్రిక్తతలు, అమెరికా–ఇజ్రాయెల్ దాడులు, ఇరాన్‌తో పెరుగుతున్న ఘర్షణల మధ్య ప్రపంచ రాజకీయాల్లో ఊహించని మార్పులు కనిపిస్తున్నాయి. నిన్నటి వరకు విడివిడిగా ఉన్న ముస్లిం దేశాలు.. ఇప్పుడు భద్రత, రక్షణ, వ్యూహాత్మక ప్రయోజనాల విషయంలో ఒకే వేదికపైకి వచ్చే ప్రయత్నం చేస్తున్నాయా? మక్కాలో కుదిరిన రక్షణ ఒప్పందం.. దానికి ఇతర దేశాల ఆసక్తి.. ఇప్పుడు ఇరాన్‌కు కూడా ఆహ్వానం అందిందన్న వార్తలు.. ఇవన్నీ కలిపి చూస్తే పశ్చిమాసియా కొత్త రాజకీయ అధ్యాయానికి తెరతీస్తోందా అనే అనుమానాలు బ‌ల‌ప‌డుతున్నాయి.

ఆగస్టు 7న సౌదీ అరేబియా, పాకిస్థాన్, తుర్కియే దేశాలు క‌లిసి మక్కాలో కీలకమైన సంయుక్త రక్షణ ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం మూడు దేశాల్లో ఏ ఒక్కదానిపై సాయుధ దాడి జరిగినా.. అది మిగిలిన దేశాలపై జరిగిన దాడిగా పరిగణించే విధానం ఉంది. అంటే ఇది సాధారణ రక్షణ సహకార ఒప్పందం కాదు. ఒకరిపై దాడి జరిగితే మిగిలినవాళ్లు కూడా స్పందించాలనే సామూహిక నిరోధక శక్తిని తయారు చేసుకోవాలన్న ఆలోచన. అంటే ఒక చిన్న‌పాటి నాటో ఒప్పందం లాగా అన్న‌మాట‌.

3 దేశాల గేమ్‌ప్లాన్

అయితే అసలు ఆసక్తి ఇక్కడ మొదలవుతోంది. పాకిస్థాన్‌ వద్ద అణ్వస్త్ర సామర్థ్యం ఉంది. తుర్కియే నాటోలో కీలక సభ్యదేశం. సౌదీ అరేబియా ఆర్థిక, చమురు శక్తిగా ఉంది. ఈ మూడు దేశాలు ఒకే రక్షణ ఫ్రేమ్‌వర్క్‌లోకి రావడం అంటే.. ముస్లిం ప్రపంచంలో ఒక కొత్త వ్యూహాత్మక శక్తి కేంద్రం ఏర్పడుతున్నట్టేనా? అందుకే కొందరు దీనిని “ఇస్లామిక్ నాటో”గా అభివర్ణిస్తున్నారు.

ఇంతలో మరో పరిణామం తెరపైకి వచ్చింది. ఇరాన్‌ను కూడా మక్కా రక్షణ ఒప్పందంలోకి ఆహ్వానించారన్న వార్తలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. ఈ విషయాన్ని ఇరాన్‌కు చెందిన ఒక కీలక మీడియా అధికారి ప్రస్తావించినట్లు కథనాలు వచ్చాయి. అయితే ఇరాన్ విదేశాంగ శాఖ దీనిని అధికారికంగా ధ్రువీకరించలేదు. అందువల్ల ప్రస్తుతానికి ఇది నిర్ధారిత ఒప్పందం కాదు.. ఒక కీలకమైన రాజకీయ సంకేతం మాత్రమే.

కానీ ఒక్కసారి ఆలోచించండి. సౌదీ అరేబియా, ఇరాన్ మధ్య గతంలో తీవ్ర శత్రుత్వం ఉంది. యెమెన్‌లో ఇరాన్ అనుబంధ హూతీలతో సౌదీకి ఘర్షణలు ఉన్నాయి. అలాంటి ఇరాన్‌కే ఇప్పుడు ఈ కొత్త భద్రతా వ్యవస్థలోకి రావాలని పిలుపు వెళ్తోందన్న వార్త బయటకు రావడం సాధారణ పరిణామమా? నిన్నటి శత్రువులను రేపటి భాగస్వాములుగా మార్చే కొత్త రాజకీయాలు మొదలయ్యాయా?

ఇదే సమయంలో మరో విషయం కూడా గమనించాలి. ఈ ఒప్పందం ఇరాన్‌కు వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన కూటమి కాదని తుర్కియే స్పష్టంగా చెప్పింది. ఏ దేశాన్నీ ఉమ్మడి శత్రువుగా ప్రకటించలేదని తుర్కీ విదేశాంగ మంత్రి హకాన్ ఫిదాన్ తెలిపారు. అంటే మక్కా ఒప్పందం వెనుక ఉన్న అసలు ఆలోచన.. ఒక దేశాన్ని టార్గెట్ చేయడం కంటే, ప్రాంతీయ దేశాలే తమ భద్రతకు కొత్త వ్యవస్థను నిర్మించుకోవడమా? అనే ప్రశ్న తలెత్తుతోంది.

అమెరికా పాత్ర‌పై ఆస‌క్తి

అదే జరిగితే అమెరికా పాత్ర ఏంటి? దశాబ్దాలుగా గల్ఫ్ ప్రాంత భద్రతలో అమెరికా కీలక పాత్ర పోషిస్తోంది. కానీ ఇప్పుడు పశ్చిమాసియాలోని దేశాలు మన భద్రత కోసం మనమే కొత్త వ్యవస్థను నిర్మించుకోవాలి అని భావిస్తున్నాయి. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు.. గల్ఫ్ ప్రాంతంలో పెరిగిన భద్రతా ఆందోళనలు.. హోర్ముజ్ జలసంధి చుట్టూ ఉద్రిక్తతలు.. ఇవన్నీ కలిపి ప్రాంతీయ దేశాల ఆలోచనను మార్చేశాయి. ఒక్క మాట‌లో చెప్పాలంటే.. అమెరికా భద్రతా హామీలపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలనే ప్రయత్నం ఈ కొత్త సమీకరణంలో ఒక కారణంగా కనిపిస్తోంది.

ఇక్కడ మరో ఆసక్తికరమైన అంశం ఉంది. ఈ కూటమి కేవలం మూడు దేశాలతో ఆగిపోవాలని తుర్కియే కోరుకోవడం లేదు. మరిన్ని దేశాలను ఈ రక్షణ వ్యవస్థలోకి తీసుకురావాలన్న ఆలోచనను ట‌ర్కీ విదేశాంగ మంత్రి వెల్లడించారు. ముఖ్యంగా ఈజిప్ట్‌ను సహజ భాగస్వామిగా పేర్కొన్నారు. ఈజిప్ట్ చేరితే కూటమి రాజకీయ, సైనిక ప్రాధాన్యం మరింత పెరుగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇక బంగ్లాదేశ్‌ కూడా మక్కా ఒప్పందంలో చేరే అవకాశంపై సానుకూలంగా స్పందించినట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. అంటే మక్కాలో మొదలైన ఈ రక్షణ ఫార్ములాపై ఇతర ముస్లిం దేశాలు కూడా ఆసక్తి చూపుతున్నాయా? ఒకవైపు సౌదీ.. మరోవైపు తుర్కియే.. దక్షిణాసియా నుంచి పాకిస్థాన్, బంగ్లాదేశ్.. మిడిల్ ఈస్ట్ నుంచి ఇరాన్, ఈజిప్ట్ పేర్లు వినిపిస్తున్నాయి. ఇది కేవలం రక్షణ ఒప్పందమా? లేక ముస్లిం ప్రపంచంలో కొత్త వ్యూహాత్మక సమీకరణానికి ప్రారంభమా?

ముస్లిం ప్రపంచంలోనే దేశాల మధ్య ప్రయోజనాలు, భౌగోళిక రాజకీయ విభేదాలు ఉన్నాయి. ఇరాన్, సున్నీ అరబ్ దేశాల మధ్య పాత విభేదాలు, అమెరికాతో సంబంధాలు, ఇజ్రాయెల్‌పై విధానాల్లో తేడాలు ఉన్నాయి. కాబట్టి దీన్ని ఒకే జెండా కింద అందరూ చేరే కూటమి కంటే.. తమ తమ ప్రయోజనాల కోసం ఒకే భద్రతా వేదికపైకి వచ్చే కొత్త ప్రయత్నంగా చూడాల్సి ఉంటుంది.

ఇరాన్.. గేమ్ చేంజ‌ర్!

ఇరాన్ నిజంగా ఈ కూటమిలో చేరితే మాత్రం పరిస్థితి పూర్తిగా మారిపోవచ్చు. ఎందుకంటే ఇరాన్ చేరికతో సున్నీ–షియా విభజనలపై ఆధారపడిన పాత రాజకీయ లెక్కలు కదిలే అవకాశం ఉంది. సౌదీ–ఇరాన్ మధ్య సంబంధాలు కొత్త దశలోకి వెళ్లే అవకాశం ఉంటుంది. పాకిస్థాన్‌కు మధ్యవర్తిత్వ పాత్ర మరింత పెరగవచ్చు. తుర్కియే తన ప్రాంతీయ ప్రభావాన్ని మరింత విస్తరించుకోవచ్చు. అమెరికా, ఇజ్రాయెల్ కూడా ఈ కొత్త సమీకరణాన్ని ఎలా చూస్తాయన్నది అంతర్జాతీయ రాజకీయాల్లో మరో కీలక ప్రశ్నగా మారుతుంది.

ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఒకప్పుడు పశ్చిమాసియాలో భద్రత కోసం అమెరికా వైపు చూసిన దేశాలే.. ఇప్పుడు తమ మధ్య రక్షణ వ్యవస్థను నిర్మించుకోవాలని చూస్తున్నాయి. ఒకప్పుడు పరస్పరం అనుమానంతో చూసుకున్న దేశాలు.. ఇప్పుడు ఒకే టేబుల్ వద్ద కూర్చుంటున్నాయి. అంటే పశ్చిమాసియాలో ప‌వ‌ర్ గేమ్.. అమెరికా కేంద్రం నుంచి ప్రాంతీయ దేశాల చేతుల్లోకి మారుతోంది.

అందుకే మక్కా ఒప్పందాన్ని కేవలం మూడు దేశాల రక్షణ ఒప్పందంగా చూడలేం. ఇది యుద్ధాలతో కుదేలైన ప్రాంతంలో మా భద్రత.. మా నిర్ణయం అనే కొత్త ఆలోచనకు సంకేతంగా చూడాల్సిందే. ఇందులో ఇరాన్ చేరుతుందా? ఈజిప్ట్ చేరుతుందా? బంగ్లాదేశ్ అడుగు ముందుకు వేస్తుందా? మరిన్ని ముస్లిం దేశాలు ఈ వేదికపైకి వస్తాయా? అన్నది ఇప్పుడే చెప్పలేం.

కానీ ఒక్క విషయం మాత్రం సుస్పష్టం. మిడిల్ ఈస్ట్‌లో పాత రాజకీయ మ్యాప్ మారుతోంది. పాత శత్రుత్వాలు కొత్త భాగస్వామ్యాలుగా మారుతున్నాయి. అమెరికా ఆధారిత భద్రతా వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా ప్రాంతీయ భద్రతా నిర్మాణం రూపుదిద్దుకుంటోంది.

అందుకే.. ముస్లిం దేశాలన్నీ ఒక్కటవుతున్నాయా? అనేది మాత్రమే కాదు. పశ్చిమాసియాలో ఇకపై అమెరికా చెప్పే భద్రతా లెక్కలే నడుస్తాయా? లేక మక్కా నుంచి కొత్త పవర్ సెంటర్ పుట్టుకొస్తుందా అన్న‌దే ఆస‌క్తిక‌రం.

#Muslim Countries#Middle East#Mecca Defense Agreement#Saudi Arabia#Iran#Pakistan#Türkiye#Middle East Politics#Islamic World#Geopolitics#Defense Pact#Global Politics#Iran Saudi Relations#US Middle East Policy
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి