వంద వ్యూస్ కూడా లేని వార్తకు అంత భయమా కృష్ణారెడ్డి?
నాయకులు మాట్లాడితే లేని లీగల్ వ్యవహారం మా వార్తతోనే వచ్చిందా?
పరువు నష్టం దావాకింద మీరు వేసిన రూ.వంద కోట్లు.. పది జన్మలు ఎత్తినా తీర్చలేను?
సుప్రీంకోర్టు మాజీ సెక్రెటరీ పేరుతో నోటీస్ అంటే దేవేందర్ రెడ్డి చింతకుంట్ల గతంలో రాసిన పరిశోధనాత్మక కథనాలు గుర్తుకొచ్చాయా?
నేషనల్ సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు చేసేంతగా ఎన్ని కోట్ల ప్రజల సొమ్మును కొల్లగొట్టాను సార్?
సందర్భం వచ్చినప్పుడు కార్పొరేట్ వ్యవస్థల స్కాములపై ఇన్వెస్టిగేషన్ కథనాలకు అవకాశాలుగా ఇవ్వండి
లేదంటే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసినట్లే
దేవేందర్ రెడ్డి చింతకుంట్ల
స్వేచ్ఛ న్యూస్ ఛైర్మన్
9848070809
పురిట్లోనే అడ్డుకునే ప్రయత్నం
ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ దేవేందర్ రెడ్డి చింతకుంట్ల యజమానిగా స్వేచ్ఛ న్యూస్ పురుడు పోసుకుని రెండు నెలలు కూడా కాలేదు. వేలు దాటి లక్షల వ్యూస్‌కు ఇంకా చేరలేదు. ఎక్స్ అకౌంట్‌లో మీ వార్త చదివింది 76 మందే. ఆ చిన్న న్యూస్‌కే దేశంలోనే అత్యంత సంపద కలిగిన పవర్ ఫుల్ కంపెనీ, 20 దేశాలకు పైగా కాంట్రాక్ట్ పనులు చేస్తున్న ఎంఈఐఎల్ సంస్థ లీగల్ నోటీస్‌కు సిద్ధమైంది.
అన్నింటికి సిద్ధమై సత్యాలే వార్తలుగా డేర్ అండ్ డ్యాషింగ్‌తో ఇన్వెస్టిగేటివ్ కథనాలను ప్రజల ముందు ఉంచుతున్నాం. అయితే, ఈ చిన్న వార్తకు సుప్రీంకోర్టు మాజీ సెక్రెటరీ పేరుతో నోటీసులు రావడం వెనుక భవిష్యత్‌పై భయం అయినా అయి ఉండాలి. లేదా గత ఐదేండ్లలో మేఘాపై ఇన్వెస్టిగేషన్ కథనాలతో పొలిటికల్ లీడర్స్‌కు, అధికారులకు ఎలా తెలియజేశామో గుర్తుకు వచ్చి ఉండాలి.
బీఆర్ఎస్ ప్రభుత్వం చివరిలో కాళేశ్వరం కహానీలు, ఇంజినీర్ల ఇంటికి డబ్బులు, మన ఊరు మన బడి, నాగారం మున్సిపాలిటీ చెరువులో ఐకామ్ కంపెనీ, గొల్డ్ స్టోన్ ప్రసాద్‌తో కలిసి ఈవీ వ్యాపారం, లిటిగేషన్ భూముల్లో రియల్ ఎస్టేట్‌లోకి అడుగు పెట్టడం లాంటి వార్తలు ఫోర్త్ ఎస్టేట్‌గా ప్రజల ముందు ఉంచాం.
కాంగ్రెస్ ప్రభుత్వంలో కలిసిపోయిన తీరు ఇంకా ప్రారంభించనే లేదు. అయినా కూడా రాజకీయ నాయకులకు నోట్ల కట్టలు ఇచ్చి నోర్లు మూయించినట్లు, ఆదిలోనే స్వేచ్చకు లీగల్ నోటీస్, పరువు నష్టం అంటూ అడ్డుతగలడం సరైన పని కాదు సార్.
ప్రజల కోసం ఫైట్ చేసే ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టులకు వార్తలు రాసి సంతోషించే అవకాశం ఇవ్వండి. ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభానికి విలువ ఉంచండి. అందరి నోళ్లు మూయించినట్లే స్వేచ్ఛను అడ్డుకోవడం కష్టం అనుకుని లీగల్ నోటీసులు రెడీ చేశారా?..
పది జన్మలు ఎత్తినా మీకు రూ.వంద కోట్లు ఇవ్వలేను కృష్ణారెడ్డి?
తక్కువ మంది చూసిన ఈ వార్త వల్ల మీ పరవుకు అస్సలు భంగం కలగదు. ఈ వార్తపై ప్రభుత్వం ఎంక్వైరీ చేసి నివేదికలు ఇవ్వదు. మీ కంపెనీని అసలు బ్లాక్ లిస్ట్‌లో పెట్టరు. మీకు ఎలాంటి నష్టం లేదు. కానీ, మాలాంటి వారిపై రూ.వంద కోట్ల నష్టపరిహారం వేస్తే, న్యాయంగా నేను ఒంటరిగా ఫైట్ చేసేందుకు రెడీగా ఉన్నాను. కానీ, మీరు వేసిన రూ.వంద కోట్ల దావా నేను పది జన్మలు ఎత్తినా తీర్చలేను. చట్టాలపై నమ్మకం, వ్యవస్థలపై సదాభిప్రాయంతోనే వార్తలు ఉంటాయి.
వ్యక్తిగతంగా మీకు మాకు ఎలాంటి విభేదాలు లేవు. మీతో కానీ, మీ అనుబంధ కంపెనీలతోకానీ, మరెలాంటి సంబంధాలు మన మధ్యలో లేవు. నిక్కచ్చిగా ఇన్వెస్టిగేషన్ జర్నలిజంతో కార్పొరేట్ కంపెనీల గుట్టు విప్పి ప్రజలకు కొంతైనా తెలియజేయాలనే ఉద్దేశమే తప్ప పొలిటికల్ లీడర్స్‌కు ఉన్నట్లు మాకు మరో దురుద్దేశం లేదు. ఆ అవసరం కూడా రాదు.
మీపై ఆరోపణలు చేసిన వారికి మొదటగా లీగల్ నోటీస్ పంపండి.. వారి వ్యూస్‌ను సోషల్ మీడియాలో చూసి, వాళ్ల వల్ల మీ పరువుకు నష్టం లేదని మీరు భావిస్తే... కేవలం 76 మంది చూసిన మా వార్త వల్ల మీ పరువుకు ఎలా నష్టం జరిగిందో ప్రజలకు తెలియవలసిన అవసరం ఏర్పడింది.

మీరు స్వేచ్ఛ న్యూస్‌ను ఒక పెద్ద వ్యవస్థగా మార్చాలనుకుంటే... నేను కూడా ప్రతిరోజూ ఆధారాలతో వార్తలు రాయడానికి సిద్ధంగా ఉన్నాను. కోర్టులు, కేసుల పేరుతో చేసే ఎలాంటి కుట్రలకూ నేను భయపడను. మీరు నోటీసుకు సిద్ధమైతే... నేను కూడా చట్టపరంగా సమాధానం ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నాను.
వందల కోట్లు కొట్టేస్తున్న సైబర్ నేరగాళ్లపై చర్యలు తీసుకోవడంలో ఇబ్బందులు ఉన్న ఈ రోజుల్లో... సోషల్ మీడియా వేదికగా వెయ్యి ఆధారాలను బయటపెట్టే ధైర్యం ఉన్న ఇన్వెస్టిగేషన్ జర్నలిస్టుపై, వంద మంది కూడా చూడని వార్త విషయంలో నేషనల్ సైబర్ బ్యూరోకు ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయడం అంటే మీరు ఎలా కుట్రలు పన్నుతున్నారో అర్థమవుతోంది.


