International

చైనాకు మళ్లీ దగ్గరవుతున్న భారత్‌? జిన్‌పింగ్‌ రాక వెనుక అసలు లెక్కేంటి?

రచన: Kashi••7 నిమిషాల పఠనం

భారత్‌, చైనా రెండూ ప్రస్తుతం మారుతున్న అంతర్జాతీయ రాజకీయ పరిస్థితులను స‌మ‌ర్థంగా ఎదుర్కొంటున్నాయి. అమెరికా వాణిజ్య విధానాలు, ప్రపంచ ఆర్థిక పరిణామాలు, ఇండో-పసిఫిక్‌లో వ్యూహాత్మక పోటీ వంటి అంశాలు ఇరు దేశాలపై ప్రభావం చూపుతున్నాయి. దీంతో ఒకరితో ఒకరు పోటీ పడుతూనే.. కొన్ని అంతర్జాతీయ అంశాల్లో కలిసి పనిచేయాల్సిన అవసరం కూడా ఏర్పడుతోంది.

భార‌త్- చైనా బంధంలో కొత్త మ‌లుపు

ఏడేళ్ల త‌ర్వాత భార‌త్‌కు జిన్‌పింగ్

గల్వాన్‌ ఘర్షణలతో దూరమైన ఇరు దేశాలు

అమెరికాకు చెక్ పెట్టే వ్యూహ‌మా..?

భారత్‌–చైనా సంబంధాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకోబోతోందా? కొన్నేళ్లుగా సరిహద్దు వివాదాలు, గల్వాన్‌ ఘర్షణలతో దూరమైన ఇరు దేశాలు ఇప్పుడు మళ్లీ దౌత్యపరంగా దగ్గరవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయా..? అవును.. ముఖ్యంగా సెప్టెంబర్‌లో ఢిల్లీలో జరగనున్న బ్రిక్స్‌ సదస్సుకు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ హాజరయ్యే అవకాశం ఉందన్న వార్తలు ఆసక్తిని పెంచుతున్నాయి. అదే జరిగితే.. ఏడేళ్ల తర్వాత జిన్‌పింగ్‌ భారత్‌లో అడుగుపెట్టినట్టవుతుంది.

భారత్‌ ఈ ఏడాది బ్రిక్స్‌ సదస్సుకు ఆతిథ్యం ఇస్తోంది. సెప్టెంబర్‌ 12, 13 తేదీల్లో ఢిల్లీలో ఈ సమావేశం జరగనుంది. జిన్‌పింగ్‌ వస్తే.. ఇది కేవలం బ్రిక్స్‌ సమావేశంగా కాకుండా భారత్‌–చైనా సంబంధాల దృష్టిలో కూడా అత్యంత కీలకమైన పరిణామంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే 2020లో సరిహద్దుల్లో జరిగిన ఘర్షణల తర్వాత ఇరు దేశాల మధ్య నమ్మకం భారీగా దెబ్బతింది. ఆ తర్వాత సైనిక, దౌత్య స్థాయిలో అనేక చర్చలు జరిగినా.. సంబంధాలు పూర్తిగా సాధారణ స్థితికి చేరలేదు.

2024లో కీల‌క ఒప్పందం

2024లో సరిహద్దు ప్రాంతాల్లో పెట్రోలింగ్‌, డిస్‌ఎంగేజ్‌మెంట్‌ విషయంలో ఒక ఒప్పందం కుదరడంతో పరిస్థితిలో కొంత మార్పు కనిపించింది. ఆ తర్వాత ఇరు దేశాల మధ్య ఉన్నతస్థాయి దౌత్య సంబంధాలు మళ్లీ కదలడం మొదలయ్యాయి. తాజాగా భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ కూడా చైనాలో పర్యటిస్తున్నారు. భారత్‌–చైనా సరిహద్దు సమస్యపై ప్రత్యేక ప్రతినిధుల చర్చల్లో భాగంగా ఆయన చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యీతో సమావేశం కానున్నారు.

మ‌రోవైపు ఇరు దేశాల మ‌ధ్య సరిహద్దు సమస్య ఇంకా పరిష్కారం కాలేదు. అరుణాచల్‌ ప్రదేశ్‌ విషయంలోనూ తాజాగా వివాదాలు తెరపైకి వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇరు దేశాలు ఒకవైపు సరిహద్దు సమస్యను ప‌రిష్క‌రించుకుంటూనే.. మరోవైపు వాణిజ్యం, ప్రాంతీయ భద్రత, అంతర్జాతీయ వేదికలపై పరస్పర ప్రయోజనాల కోసం పనిచేసే ప్రయత్నం చేస్తున్నాయి.

భారత్‌, చైనా రెండూ ప్రస్తుతం మారుతున్న అంతర్జాతీయ రాజకీయ పరిస్థితులను స‌మ‌ర్థంగా ఎదుర్కొంటున్నాయి. అమెరికా వాణిజ్య విధానాలు, ప్రపంచ ఆర్థిక పరిణామాలు, ఇండో-పసిఫిక్‌లో వ్యూహాత్మక పోటీ వంటి అంశాలు ఇరు దేశాలపై ప్రభావం చూపుతున్నాయి. దీంతో ఒకరితో ఒకరు పోటీ పడుతూనే.. కొన్ని అంతర్జాతీయ అంశాల్లో కలిసి పనిచేయాల్సిన అవసరం కూడా ఏర్పడుతోంది.

మోదీ-జిన్‌పింగ్ భేటీ కీల‌కం

ఇలాంటి సమయంలో జిన్‌పింగ్‌ ఢిల్లీకి వస్తే.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఆయన భేటీపై ప్రపంచ దేశాల దృష్టి ఉంటుంది. సరిహద్దు పరిస్థితి, ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులు, బ్రిక్స్‌ భవిష్యత్‌ పాత్ర వంటి అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే సరిహద్దు సమస్యపై ఏదైనా పెద్ద పురోగతి కనిపిస్తుందా? అనేది మాత్రం ఇప్పుడే చెప్పలేం.

అందుకే జిన్‌పింగ్‌ పర్యటనను కేవలం ఒక విదేశీ నేత పర్యటనగా చూడటం కంటే.. భారత్‌–చైనా సంబంధాలను మరోసారి రీసెట్‌ చేసే ప్రయత్నానికి సంకేతమా? అన్న కోణంలో చూడాల్సి ఉంటుంది.

ఒకప్పుడు గల్వాన్‌ తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు అత్యంత క్లిష్ట దశకు చేరుకున్నాయి. ఇప్పుడు అదే దేశాల అధినేతలు ఢిల్లీలో ఒకే వేదికపై కనిపించే పరిస్థితి వస్తోంది. సరిహద్దులో పోటీ.. దౌత్యంలో చర్చలు.. అంతర్జాతీయ వేదికపై సహకారం, భారత్‌-చైనా సంబంధాలకు ఇదే కొత్త ఫార్ములా కాబోతుందా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

అమెరికా ఆస‌క్తి

అంతేకాదు ఢిల్లీలో జ‌ర‌గ‌బోయే బ్రిక్స్ స‌మావేశాన్ని అమెరికా ఆస‌క్తిగా గ‌మ‌నిస్తోంది. ప్ర‌ధానంగా జిన్‌పింగ్- మోదీ మీటింగ్ త‌ర్వాత ఎలాంటి ప్ర‌క‌ట‌న‌లు వ‌స్తాయా అని ఎదురుచూస్తోంది. ఎందుకంటే.. అమెరికాకు ప్ర‌త్యామ్నాయంగా ఎదుగుతున్న దేశాలు భార‌త్, చైనా. అందుకే ఈ దేశాధినేత‌లు స‌మావేశ‌మ‌వుతున్నారంటేనే.. అగ్ర‌రాజ్యానికి చెమ‌ట‌లు ప‌డుతున్నాయి.

మొత్తానికి జిన్‌పింగ్‌ ఢిల్లీ వ‌స్తే.. 2026లో భారత్‌ విదేశాంగానికి ఇదొక కీలక పరీక్షగా మారే అవకాశం ఉంది.

#India China relations#Xi Jinping India visit#Narendra Modi#Xi Jinping#India China ties#BRICS Summit 2026#Galwan clash#India China border#China India diplomacy#Modi Xi meeting#BRICS#India foreign policy#China strategy#global geopolitics#US China tensions
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి