Spirituality

Spirituality: మరణించిన పితృ దేవతలకు తర్పణాలు ఎందుకు!..

రచన: Venu•••4 నిమిషాల పఠనం

సనాతన ధర్మంలో తల్లిదండ్రులకు, పూర్వీకులకు అత్యున్నతమైన స్థానం ఉంది. అందుకే మాతృదేవోభవ, పితృదేవోభవ అని చెప్పడమే కాకుండా, వారు భౌతిక దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా వారితో మనకున్న అనుబంధం తెగిపోదని మన శాస్త్రాలు చెబుతున్నాయి.

మన సనాతన ధర్మంలో ఎన్నో ఆచారాలు ఉన్నాయి.. వాటిని మన పూర్వీకులు ఊరికే సృష్టించలేదని.. అందులో ఎంతో లోతైన అర్థాలున్నాయని మన పండితులు కూడా చెబుతున్నారు.. ఇలా అనాదిగా వస్తున్న ఆచారాలను నేటి యువత మూఢ నమ్మకాలుగా భావించడం తెలిసిందే.. ఇక మనకు జన్మనిచ్చి, ఈ సమాజంలో ఒక ఉత్తమ స్థానాన్ని కల్పించినవారు మన పితృ దేవతలు...

సనాతన ధర్మంలో తల్లిదండ్రులకు, పూర్వీకులకు అత్యున్నతమైన స్థానం ఉంది. అందుకే మాతృదేవోభవ, పితృదేవోభవ అని చెప్పడమే కాకుండా, వారు భౌతిక దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా వారితో మనకున్న అనుబంధం తెగిపోదని మన శాస్త్రాలు చెబుతున్నాయి. అదే పితృ తర్పణాల విశిష్టత..

తర్పణం అంటే తృప్తిపరచడం. మన రక్తసంబంధీకులు, మన వంశకర్తలు పితృలోకంలో ఉన్నప్పుడు, వారికి నీరు, నువ్వులతో అర్పించే అంజలినే తర్పణం అంటాం. ఆధ్యాత్మిక కోణంలో చూస్తే... మనిషి శరీరం నశిస్తుంది కానీ ఆత్మ అమరం. శరీరాన్ని వదిలిన ఆత్మ తన పూర్వ కర్మల ఆధారంగా ముందుకు సాగుతుంది. ఆ ప్రయాణంలో వారికి కావలసిన సూక్ష్మ శక్తినీ, శాంతినీ మన భక్తిపూర్వకమైన తర్పణాలు అందిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి..

నువ్వులను శ్రీమహావిష్ణువు స్వేదం నుండి ఉద్భవించినవిగా భావిస్తారు. అలాగే జలం పవిత్రతకు, ఆప్యాయతకు సంకేతం. ఈ రెండింటిని మంత్రోచ్ఛారణతో, భక్తితో అర్పిస్తూ దర్భల ద్వారా వదిలినప్పుడు, ఆ శక్తి పితృ దేవతలకు నేరుగా చేరుతుంది. మన పితృ దేవతలు తృప్తి చెందితే, ఆ వంశంలో శాంతి, సౌభాగ్యం, ఆయురారోగ్యాలు స్థిరపడతాయని మన పురాణాలు స్పష్టం చేస్తున్నాయి.

పితృ ఋణం అనేది ప్రతి ఒక్కరిపై ఉంటుంది. దేవ ఋణం, ఋషి ఋణం తీర్చుకున్నట్లే.. పితృ ఋణాన్ని తీర్చుకోవడం మన కర్తవ్యం. మహాలయ పక్షాలు, అమావాస్య, లేదా వారి పుణ్య తిథులలో తర్పణాలు ఇవ్వడం ద్వారా వారి ఆత్మలకు సద్గతులు లభిస్తాయనే నమ్మకం హైందవ ధర్మంలో ఉంది.. మరోవైపు మనం ఇచ్చే చిన్న తర్పణంలో ఎంతో కృతజ్ఞతా భావం ఉంది. నన్ను ఈ లోకంలోకి తెచ్చి, పోషించినందుకు మీకు ధన్యవాదాలు. మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ మాపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకునే పవిత్ర ఘట్టమే ఈ తర్పణం. అలాగే పితృ దేవతల ఆశీస్సులు ఉంటే సకల విఘ్నాలు తొలగిపోతాయని నమ్మడం కూడా మన ఆచారాలలో కనిపిస్తుంది..

గమనిక: ఇక్కడ అందించిన వివరాలు కేవలం సాంప్రదాయ పురాణ విశ్వాసాలు మరియు ఆధ్యాత్మిక భావనల ఆధారంగా ఇవ్వబడ్డాయి. వీటిని కేవలం మతపరమైన విశ్వాసాల కోణంలోనే చూడాలి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత రంగ నిపుణులను సంప్రదించడం మంచిది.

#Spirituality#Indian Culture#Deceased ancestors#parents#Tarpanas
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి