ధ్యానం చేస్తున్నప్పుడు మనసులో ఏవో ఒక ఆలోచనలు రావడం చాలా సహజం. అలా ఆలోచనలు వచ్చిన ప్రతిసారీ అయ్యో! నా ధ్యానం పాడైపోయింది అని ఆందోళన చెందాల్సిన అవసరం ఎంత మాత్రమూ లేదు. అసలు ధ్యానం అంటే ఆలోచనలను బలవంతంగా ఆపేయడం కాదు. మనస్సు అనేది ఒక పరికరం మాత్రమే. అది ఇన్నాళ్లూ తనకిష్టమొచ్చినట్లు పరిగెత్తి అలవాటు పడింది..
పతంజలి మహర్షి యోగసూత్రాలలో యోగానికి ఇచ్చిన నిర్వచనం చిత్తవృత్తి నిరోధం.. అంటే మన చిత్తం అడుగు పొరల్లో, ఎన్నో జన్మల సంస్కారాలు దాగి ఉంటాయి. మన సైకాలజీ చెప్పే సబ్‌కాన్షస్ మైండ్ లాంటిదే ఈ చిత్తం. సరస్సు అడుగున ఏర్పడిన బుడగలు పైకి ఉబికి వచ్చినట్లుగా.. ఆ సంస్కారాల నుంచే ఆలోచనలు పుట్టుకొస్తూ ఉంటాయి. ఆ ఆలోచనల్లో పడి కొట్టుకుపోకుండా ఉండటమే మనం చేయాల్సిన మొదటి పని.
ధ్యానం సాధన మొదట్లో ఉన్నప్పుడు లోపలి ఆధ్యాత్మిక ప్రపంచాన్ని, బయటి లౌకిక ప్రపంచాన్ని సమతుల్యం చేసుకోవడం కాస్త కష్టంగానే ఉంటుంది. అందుకే కొత్తగా ధ్యానం మొదలుపెట్టిన వారు బయట విషయాల్లో కొంత తడబడవచ్చు. కానీ సాధన పెరిగే కొద్దీ ఆ బాధ తొలగిపోతుంది. రోజువారీ పనులన్నీ చేసుకుంటూనే.. మనస్సులో నిరంతరం ధ్యాన స్థితిలో ఉండటం సాధ్యమవుతుందంటారు..
దీనికి పెద్ద పెద్ద అర్హతలేమీ అక్కర్లేదు. కులం, మతం, వయస్సు, హోదా వంటివేవీ ధ్యానానికి కొలమానాలు కావు. దైవాన్ని చేరాలి, సత్యాన్ని తెలుసుకోవాలి అనే ఆర్తి, బలమైన తపన మాత్రమే అసలైన అర్హతలు. అసలు ఈ జీవితం ఏమిటి? నేను ఎవరు? అని గుండెల్లోంచి ప్రశ్నలు రగిలినప్పుడు, ఆ తపనే ఒక వేదనగా మారినప్పుడు భగవంతుని కరుణతో సమర్థుడైన గురువు లభిస్తారని చెబుతారు..
ఇక ఆధ్యాత్మిక ప్రయాణం అనేది అత్యంత రహస్యమైనది. పుస్తకాలలో లభించేది కేవలం సమాచారం మాత్రమే. అసలైన మార్గం గురువు ద్వారా శిష్యునికి ప్రసారమవుతుంది. ఆ ప్రయాణంలో మనస్సు మిమ్మల్ని అనేక రకాలుగా పక్కదారి పటించాలని చూస్తుంది. ఆలోచనలు, తీరని కోరికలు సాధనకు అడ్డుపడతాయి. అయినా సరే, పడిపోవడం తప్పు కాదు... కానీ తెలివి తెచ్చుకుని మళ్ళీ లేచి నుంచోవడమే సాధన.
కాబట్టి, ధ్యానంలో ఆలోచనలు వచ్చాయని ఆగిపోకండి. అనవసరమైన ఆలోచనల్లో కొట్టుకుపోతున్నామని తెలిసిన మరుక్షణమే... తిరిగి మిమ్మల్ని మీరు గమనిస్తూ ధ్యానాన్ని కొనసాగించండి. సడలని పట్టుదలతో, గురువు చూపిన బాటలో నడుస్తూ ఉంటే, కాలక్రమేణా ఆ మనస్సే నీకు వశమై పరమశాంతిని అందిస్తుందని చెబుతున్నారు..
గమనిక: ఇక్కడ అందించిన వివరాలు కేవలం సాంప్రదాయ పురాణ విశ్వాసాలు మరియు ఆధ్యాత్మిక భావనల ఆధారంగా ఇవ్వబడ్డాయి. వీటిని కేవలం మతపరమైన విశ్వాసాల కోణంలోనే చూడాలి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత రంగ నిపుణులను సంప్రదించడం మంచిది.


