Murali Akunuri: మియాపూర్ భూముల వివాదంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై మాజీ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి స్పందించారు. ఎక్స్ వేదికగా రేవంత్ సర్కార్ కు కీలక సూచన చేశారాయన. ముఖ్యమంత్రి రేవంత్ కు ఒక గొప్ప అవకాశం వచ్చిందన్నారు ఆకునూరి మురళి. మియాపూర్ భూములను నిజాయితీగా, పారదర్శకంగా అమ్మి వచ్చిన డబ్బును (30వేల కోట్లు లేక 60వేల కోట్లు) ఆర్థిక శాఖ బయట పటిష్టమైన పారదర్శకమైన విధానంతో విద్యానిధిలో జమ చేద్దామని సూచించారు.
ఆ బాధ్యతలు నాకివ్వండి
రేవంత్ సర్కార్ కి ఇంకా రెండేళ్ల సమయం ఉందన్న ఆయన.. 1200 తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు, 1200 తెలంగాణ ఫౌండేషన్ స్కూళ్లు ఆరుట్ల మోడల్ లో అభివృద్ధి చేద్దామని పిలుపునిచ్చారు. 150 డిగ్రీ కాలేజీలు, 17 యూనివర్సిటీలు అభివృద్ధి చేసి రాష్ట్రంలో విద్యను యూరోపియన్ స్థాయికి తీసుకువెళ్దామన్నారు. అందుకు తనకు బాధ్యతలు ఇవ్వాలని ఎక్స్ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ ను కోరారు ఆకునూరి మురళి.
ఒక్క రూపాయి జీతం చాలు
''ఒక్క రూపాయి జీతం తీసుకుంటాను, నాకు కార్ కూడా వద్దు. నా సొంత కారు మాత్రమే వాడతాను. నేను సెలెక్ట్ చేసుకున్న ఇద్దరు IAS ఆఫీసర్లను (కమిషనర్, సెక్రటరీ) ఇవ్వండి. ఇప్పుడున్న సెక్రటరీ ఎడ్యుకేషన్ ను మార్చండి. నేను చెప్పిన ఇద్దరు సీనియర్ ఇంజనీర్లను ఇవ్వండి. నేను చెప్పిన ఒక సీనియర్ ఫైనాన్స్ ఆఫీసర్ ను ఇవ్వండి. మిగతా అంతా ప్రభుత్వ యంత్రాంగాన్నే ఉపయోగించుకుందాం. అడ్మినిస్ట్రేషన్ సాంక్షన్ పవర్స్ ఇవ్వండి. మీరు 15 రోజులకొకసారి రివ్యూకి టైమ్ ఇవ్వండి. విద్యావ్యవస్థను మార్చి మీకు చూపిస్తాను.
చరిత్రలో మీ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది
ప్రస్తుతం పని చేస్తున్న టీచర్లకు, లెక్చరర్లకు, ఫాకల్టీకి వాళ్ల సర్వీస్ రూల్స్ వాళ్ల జీతభత్యాలు మార్చాల్సిన అవసరం లేదు. ఇది చేస్తే వచ్చే ఎన్నికల్లో మీరు గెలుస్తారు. తెలంగాణలో బ్రహ్మాండమైన విద్యావ్యవస్థ ఇచ్చిన వాళ్ళము అవుతాము. చరిత్రలో మీ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది'' అంటూ ఎక్స్ వేదికగా తన మనసులోని మాటను తెలియజేశారు ఆకునూరి మురళి.
వ్యక్తిగత ప్రయోజనం కోసమేనా?
గతంలో విద్యాశాఖ కమిషన్ ఛైర్మన్ గా పనిచేసిన మురళి.. తాజాగా పెట్టిన పోస్టు చర్చనీయాంశంగా మారింది. మియాపూర్ భూములు అమ్మేద్దాం, ఇప్పుడున్న సెక్రటరీ ఎడ్యుకేషన్ ను మార్చేయాలి అంటూ ఆకునూరి మురళి చెప్పడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఆయన తీరును తప్పుపడుతున్నారు. ఇప్పుడున్న సెక్రటరీ ఎడ్యుకేషన్ ను మార్చేయాలని మురళి సూచించడం పట్ల అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇక మియాపూర్ భూములను అమ్మేద్దాం అని సూచించడం ఏంటి? అని ప్రశ్నిస్తున్నారు. ఈ పోస్టు వెనుక ఆయన వ్యక్తిగత ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా? అనే అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి.


