తెలంగాణ

కూరలో బల్లి, షాక్‌లో స్టూడెంట్స్.. జేఎన్టీయూ హాస్టల్‌లో కలకలం

రచన: NK•••6 నిమిషాల పఠనం

JNTUH: హైదరాబాద్ నగరంలోని జేఎన్‌టీయూ క్యాంపస్‌లోని హాస్టల్ మెస్‌లో తీవ్ర కలకలం చెలరేగింది. మంజీరా బాలుర హాస్టల్‌లో గురువారం రాత్రి విద్యార్థులకు వడ్డించిన కర్రీలో బల్లి కనిపించడం సంచలనం రేపింది.

JNTUH: హైదరాబాద్ నగరంలోని జేఎన్‌టీయూ క్యాంపస్‌లోని హాస్టల్ మెస్‌లో తీవ్ర కలకలం చెలరేగింది. మంజీరా బాలుర హాస్టల్‌లో గురువారం రాత్రి విద్యార్థులకు వడ్డించిన కూరలో బల్లి కనిపించడం సంచలనం రేపింది. కర్రీ ఉంచిన పెద్ద పాత్రలో సజీవంగా ఉన్న బల్లిని కళ్లారా చూసిన విద్యార్థులు షాక్ కి గురయ్యారు. అసలే ఆహార నాణ్యతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ సమయంలో ఈ తరహా ఘటన వారిలో మరింత ఆందోళన పెంచేసింది.

విద్యార్థులకు వండించిన కూరలో బల్లి

రాత్రి డిన్నర్ చేసేందుకు విద్యార్థులు హాస్టల్ మెస్‌కు వెళ్లారు. ఆ సమయంలో వారికి ఊహించని దృశ్యం ఎదురైంది. కర్రీ ఉంచిన పెద్ద పాత్రలో బల్లిని గమనించి విస్తుపోయారు. వెంటనే దాన్ని ఫోన్లలో వీడియో తీశారు. అనంతరం సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

మెస్ నిర్వాహకుల తీరుపై ఆగ్రహం

తినే ఆహారంలో బల్లి ప్రత్యక్షమవడం పట్ల విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భోజనం నాణ్యత, పరిశుభ్రత విషయంలో మెస్ నిర్వాహకులు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. హాస్టల్‌లో రూమ్ అద్దెలు, మెస్ ఛార్జీలు క్రమం తప్పకుండా వసూలు చేస్తున్న అధికారులు.. విద్యార్థులకు పెట్టే భోజనంలో నాణ్యతను గాలికొదిలేశారని మండిపడ్డారు. ఆహార నాణ్యతలో నిర్లక్ష్యం పట్ల గతంలోనూ పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందన్నారు.

పిల్లల ప్రాణాలతో చెలగాటం

కర్రీలో బల్లిని చూసి తట్టుకోలేకపోయిన విద్యార్థులు.. మెస్ ప్రాంగణంలో ఆందోళనకు దిగారు. మా ప్రాణాలతో చెలగాటం ఆడుతారా? అంటూ మండిపడ్డారు. ఈ ఘటనకు బాధ్యులను చేస్తూ మెస్ కాంట్రాక్టర్, నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హాస్టల్ ఫుడ్ క్వాలిటీపై అధికారులు తక్షణమే విచారణ చేపట్టాలన్నారు. వంటగది, డైనింగ్ ఏరియాల్లో పరిశుభ్రతను పాటించేలా.. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేలా చర్యలు చేపట్టాలని యూనివర్సిటీ యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు.

వార్డెన్, డిప్యూటీ వార్డెన్ ఏం చేస్తున్నారు?

''ఈ ఘటన జరిగిన సమయంలో కేర్‌టేకర్ మాత్రమే అక్కడ ఉన్నారు. హాస్టల్ వార్డెన్, డిప్యూటీ వార్డెన్ హాస్టల్ కార్యాలయంలో అందుబాటులో లేరు. వార్డెన్లు, డిప్యూటీ వార్డెన్లు హాస్టళ్లలోనే ఉండాలి. కానీ, వారు హాస్టల్స్ లో ఉండటం లేదు. దీంతో ఆహార నాణ్యత, హాస్టల్ పర్యవేక్షణపై తీవ్రమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి'' అని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.

నాణ్యమైన విద్య దేవుడెరుగు..నాణ్యమైన ఆహారమూ దొరకదు

ఈ ఘటనలో ప్రభుత్వ వైఖరి పట్ల నెటిజన్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పిల్లలకు నాణ్యమైన విద్య అందించడం దేవుడెరుగు.. కనీసం నాణ్యమైన ఆహారం కూడా దొరకని పరిస్థితి మన రాష్ట్ర విశ్వ విద్యాలయాల్లో ఉందని వాపోతున్నారు. ఏదో ఏజెన్సీ ఏరియాలోని వసతి గృహంలో కాదు.. సాక్షాత్తు హైదరాబాద్ మహానగరం నడిబొడ్డున గల, రాష్ట్రంలోనే ప్రముఖ సాంకేతిక విశ్వవిద్యాలయంలో ఈ దుస్థితి దాపురించడం బాధాకరం అంటున్నారు.

మొద్దు నిద్రలో అధికార యంత్రాంగం

తినే ఆహారంలో బల్లి పడి తిరుగుతున్నా చూడలేనంత మొద్దు నిద్రలో అధికారులు ఉన్నారా? వార్డెన్లు, డిప్యూటీ వార్డెన్లు ఎక్కడికి వెళ్లారు? అని ప్రశ్నిస్తున్నారు. కాగా, అధికారులు తరచుగా వసతి గృహాలకు వెళ్లి విద్యార్థులకు పెట్టే భోజనం నాణ్యతను పరిశీలించడంతో పాటు అక్కడే భోజనం చేస్తే.. ఇటువంటి దారుణాలు జరగవనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పేద విద్యార్థులు బల్లి పడ్డ ఆహారం తినాలా? పస్తు ఉండాలా? లేకపోతే అప్పు చేసి బయట తినాలా? అన్నది ప్రభుత్వమే నిర్ణయించాలన్నారు. విద్యా శాఖ అధికారులు, ముఖ్యమంత్రి కార్యాలయం ఈ విషయంపై వెంటనే స్పందించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

#JNTUH#Hyderabad#JNTU#Curry#Lizard#Food#Swechaa News#Manjeera Boys Hostle
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి