TG: హైదరాబాద్ మహానగరంలో ఒక్క గజం భూమి ధర ఆకాశాన్ని తాకుతున్న వేళ.. వేల ఎకరాల ప్రభుత్వ భూములను కాపాడటం అంటే ఏకంగా అధికార పీఠంతోనే ఢీకొట్టడం. మియాపూర్ భూముల వ్యవహారంలో ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు రాగానే మొత్తం ఘనత అంతా తమ ఖాతాలోనే వేసుకునేందుకు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి సిద్ధపడవచ్చు. కానీ, చరిత్రను ఒక్కసారి తిరగేస్తే అసలు సత్యం కళ్లముందు కదలాడుతుంది. నాడు అధికార బలంతో వ్యవస్థలన్నింటినీ గుప్పిట్లో పెట్టుకున్న బీఆర్ఎస్ హయాంలో.. ప్రాణాలకు తెగించి ఆ భారీ కుంభకోణాన్ని బట్టబయలు చేసింది అప్పటి మీడియా, ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టులు మాత్రమే.
అధికార పీఠాన్ని వణికించిన మీడియా ఇన్వెస్టిగేషన్
నాడు కేసీఆర్ పాలనలో మియాపూర్ భూముల వ్యవహారం గుట్టుచప్పుడు కాకుండా సాగిపోతున్న సమయంలో.. వేల కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తులు ప్రైవేటు వ్యక్తుల పరం అవుతున్నాయని సాక్ష్యాధారాలతో వరుస కథనాలు రాసింది జర్నలిస్టులే. అప్పటి ముఖ్యమంత్రి అనుచరులు, ఆయన అల్లుడికి సంబంధించిన లింకులు బయటకు రావడంతో రాజకీయం ఒక్కసారిగా భగ్గుమంది. జర్నలిస్టు కేకేతో పాటు పలువురు సీనియర్ రిపోర్టర్లు బయటపెట్టిన సంచలన నిజాలు అప్పటి ప్రభుత్వాన్ని డిఫెన్స్‌లోకి నెట్టాయి. ప్రజల్లో, మీడియాలో వచ్చిన తీవ్ర ఆగ్రహం వల్లే నాటి ప్రభుత్వం వెనక్కి తగ్గక తప్పలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాసరావును, గోల్డ్ స్టోన్ ప్రసాద్ సోదరుడు పార్థసారథిని అరెస్ట్ చేయించడం, సేల్ డీడ్స్ రద్దుపై ఏసీబీ ద్వారా చర్యలు తీసుకోవడం అన్నీ మీడియా సృష్టించిన ఒత్తిడి ఫలితమే తప్ప ప్రభుత్వానికి ప్రజల ఆస్తులపై ఉన్న ప్రేమతో కాదు.
గోల్డ్ స్టోన్ ప్రసాద్ నీడలు.. కాంగ్రెస్ నేతల పాత్రపై ప్రశ్నలు
ఈ కుంభకోణంలో ప్రధాన సూత్రధారిగా పేరుపడ్డ గోల్డ్ స్టోన్ ప్రసాద్ చుట్టూ ఉన్న అనేక ముడులు ఇప్పటికీ విప్పాల్సి ఉంది. ఈ వ్యవహారంపై నాడు మీడియా గొంతు విప్పిన సమయంలో హైకోర్టును ఆశ్రయించిన ప్రస్తుత ఎంపీ రఘునాథన్ రావు.. గోల్డ్ స్టోన్ ప్రసాద్ నుంచి కోట్ల రూపాయల ఖరీదైన లగ్జరీ కార్లను బహుమతిగా పొందారన్న ఆరోపణలు అప్పట్లో గుప్పుమన్నాయి. ఆ అంశంపై నేడు పారదర్శకత గురించి మాట్లాడే రేవంత్ రెడ్డి ఎందుకు స్పష్టత ఇవ్వడం లేదు? అంతేకాదు, మియాపూర్ భూముల్లో కొందరు కాంగ్రెస్ నాయకులు కూడా గతంలో ఒప్పందాలు చేసుకున్నారనే బలమైన ప్రచారం ఉంది. ఆ జాబితాను సీఎం రేవంత్ రెడ్డి అధికారికంగా బయటపెట్టగలరా? అగ్రిమెంట్లు చేసుకున్న ఆ నాయకులు ఎవరు? వారి వల్ల ప్రభుత్వానికి ఎంత నష్టం జరిగింది? అనే అంశాలను ప్రభుత్వం ప్రజల ముందుంచాల్సి ఉంది.
60 ఏళ్ల నాటి రికార్డులు.. నిపుణుల లీగల్ పోరాటం
మియాపూర్ వివాదానికి ముగింపు పలకడం అంత ఆషామాషీగా జరగలేదు. 60 ఏళ్ల నాటి పాత రికార్డులను తిరగేసి, టెక్నికల్ అంశాలను అధ్యయనం చేసి, న్యాయస్థానాల్లో పోరాటం నడపడానికి జర్నలిస్టుల విశ్లేషణలు, వారు సేకరించిన డాక్యుమెంట్లు ఎంతో కీలకంగా మారాయి. మాజీ జర్నలిస్టు, ప్రస్తుత సుప్రీంకోర్టు న్యాయవాది శ్రవణ్ అందించిన న్యాయపరమైన సలహాలు, కోర్టులో సమర్థవంతంగా వినిపించిన వాదనలే అంతిమంగా ప్రభుత్వ భూమిని కాపాడటంలో కీలక పాత్ర పోషించాయి. తీర్పు రాగానే ఒక ప్రకటన ఇచ్చేసి, మొత్తం క్రెడిట్ అంతా తమదే అని చాటుకోవడం రాజకీయ నాయకులకు సులభమే కావచ్చు. కానీ వ్యవస్థలన్నింటినీ ధిక్కరించి, కేసు పునాదులను పటిష్టం చేసింది మీడియా అలుపెరగని పోరాటం.
రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అసలైన సవాల్
రూ.1.50 లక్షల కోట్ల విలువైన భూములను కాపాడామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి అసలైన పరీక్ష ఇప్పుడే మొదలైంది. హైదరాబాద్ చుట్టూ, తెలంగాణ వ్యాప్తంగా ఇంకా ఎన్నో వేల ఎకరాల విలువైన భూములు ఆక్రమణదారుల చేతుల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో అక్రమాలను నిలదీసినట్లే.. ఇప్పుడు కూడా ఆక్రమణలకు గురవుతున్న ప్రతి భూమిని బయటపెట్టేందుకు జర్నలిస్టులు సిద్ధంగా ఉన్నారు. ఆ భూముల వివరాలు చూపిస్తే, అధికారంలో ఉన్న తమ సొంత పార్టీ నేతల ప్రయోజనాలను పక్కనపెట్టి ఆ భూములను రక్షించే దమ్ము రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఉందా? ప్రభుత్వాలు మారొచ్చు, పాలకులు మారొచ్చు.. కానీ ప్రజాధనాన్ని కాపాడే క్రమంలో నాడు కేసీఆర్ సర్కార్‌ను ప్రశ్నించిన కలాలే, నేడు రేవంత్ సర్కార్‌ను కూడా నిలదీస్తాయి. మియాపూర్ భూముల రక్షణ వెనుక ఉన్నది జర్నలిస్టుల పోరాటమే తప్ప రాజకీయ నేతల ఖాతాలోకి వెళ్లే విజయం కానే కాదు.
బై
దేవేందర్ రెడ్డి చింతకుంట్ల
ల్యాండ్ ఎక్స్పర్ట్, జర్నలిస్ట్


