National

Ramlila Maidan Protest: నవంబర్ 1న మోడీ సర్కార్‌పై విపక్షాల మహా దండయాత్ర.. సక్సెస్ అవుతుందా?

రచన: Mahesh••4 నిమిషాల పఠనం

Ramlila Maidan Protest: కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్ రాజీనామా డిమాండ్‌తో నవంబర్ 1న ఢిల్లీలోని రామలీలా మైదానంలో విపక్ష ‘ఇండియా’ కూటమి తలపెట్టిన మహా ప్రదర్శన దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది.

Ramlila Maidan Protest: కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్ రాజీనామా డిమాండ్‌తో నవంబర్ 1న ఢిల్లీలోని రామలీలా మైదానంలో విపక్ష ‘ఇండియా’ కూటమి తలపెట్టిన మహా ప్రదర్శన దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. ఏకంగా 10 లక్షల మందితో దేశ రాజధానిని ముంచెత్తాలని విపక్షాలు ప్లాన్ చేస్తుండగా, ఈ భారీ నిరసన కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ సర్కార్‌ను డిఫెన్స్‌లో పడేస్తుందా లేదా అన్నది ఇప్పుడు అతిపెద్ద పొలిటికల్ క్వశ్చన్‌గా మారింది.

10 లక్షల మంది టార్గెట్..

కాంగ్రెస్ నేతృత్వంలో జరుగుతున్న ఈ ర్యాలీ కోసం దేశం నలుమూలల నుంచి విద్యార్థి సంఘాలు, కూటమి పార్టీల శ్రేణులను తరలిస్తున్నారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ స్వయంగా ఈ పోరును లీడ్ చేయనున్నారు. అయితే, నిర్వాహకులు చెబుతున్నట్లు 10 లక్షల మంది ఒకేసారి ఢిల్లీకి తరలివస్తే అసలు రామలీలా మైదానంలో ఆ స్థాయి జనసందోహం సరిపోతుందా? అంతమందిని రాజధానిలోకి అనుమతించడం సాధ్యమేనా? అన్నది మొదటి సవాల్.

పోలీసుల చక్రవ్యూహం.. నిరసనలపై ఉక్కుపాదం

ఢిల్లీ పోలీసుల వ్యూహం విపక్షాల దూకుడుకు పెద్ద బ్రేక్ వేసేలా ఉంది. ఇప్పటికే దాదాపు 3 వేల మంది ఢిల్లీ పోలీసులు, 10 వేల మంది పారామిలిటరీ బలగాలు రంగంలోకి దిగాయి. 150 ఏఐ ఆధారిత సీసీటీవీ కెమెరాలతో మైదానం చుట్టూ ఏర్పాటు చేశారు. నిరసనకారులు జంతర్ మంతర్ లేదా ఇతర పార్లమెంట్, కీలక కార్యాలయాల వైపు చొచ్చుకెళ్లకుండా రోడ్లన్నీ బారికేడ్లతో మూసివేశారు. గతంలో విద్యార్థుల ఆందోళనలతో ఓ కేంద్ర మంత్రి రాజీనామా చేయాల్సి వచ్చిన చేదు అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని, ఈసారి నిరసనను కేవలం రామలీలా గ్రౌండ్‌కే పరిమితం చేయాలని పోలీసులు ఫిక్స్ అయ్యారు. ప్రవేశ ద్వారాల వద్ద కఠిన తనిఖీలు, మెటల్ డిటెక్టర్లతో ప్రతి ఒక్కరినీ స్క్రీనింగ్ చేస్తుండటంతో జనం మైదానంలోకి చేరుకోవడమే పెద్ద టాస్క్‌గా మారనుంది.

కేంద్రం తలొగ్గుతుందా?

సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలన్న విపక్షాల ప్రధాన డిమాండ్‌ను కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకునే పరిస్థితి కనిపించడం లేదు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న సీఈసీపై విపక్షాలు చేస్తున్న ఈ ఆందోళనలు రాజకీయ లబ్ధి కోసమేనని అధికార వర్గాలు కొట్టిపారేస్తున్నాయి. అటు పోలీసులు విధించిన కఠిన ఆంక్షలు, బారికేడ్ల మధ్య విపక్ష కూటమి ఈ ర్యాలీని ఎంతవరకు ఉధృతంగా ముందుకు తీసుకెళ్లగలదు? జనం అంచనాలకు తగ్గట్టుగా తరలివచ్చి కేంద్రంపై ఒత్తిడి పెంచగలరా? లేక పోలీసుల నిఘా వలయంలో ఇది సాధారణ నిరసనగానే ముగుస్తుందా? అన్నది నవంబర్ 1 సాయంత్రానికి తేలనుంది.

#Ramlila Maidan Protest#INDIA Bloc#Modi Government#Rahul Gandhi#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి