తెలంగాణ

ప్రభుత్వ భూముల పరిరక్షణలో రాజీలేని పోరాటం- మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

రచన: NK•••7 నిమిషాల పఠనం

Govt Lands: ప్రభుత్వ భూముల పరిరక్షణలో సీఎం రేవంత్ నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం రాజీలేని వైఖరితో ముందుకు సాగుతోందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.

* కంచె గచ్చిబౌలి నుంచి మియాపూర్ వరకు.. సుప్రీంకోర్టులో ప్రభుత్వానికి వరుస విజయాలు

* రెవెన్యూ యంత్రాంగానికి ప్రత్యేక అభినందనలు

* ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక పర్యవేక్షణలో ప్రభుత్వ భూముల పరిరక్షణకు పటిష్ట చర్యలు

* మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

Govt Lands: ప్రభుత్వ భూముల పరిరక్షణలో సీఎం రేవంత్ నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం రాజీలేని వైఖరితో ముందుకు సాగుతోందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా ఒకవైపు కఠిన చర్యలు తీసుకుంటూనే, మరోవైపు దశాబ్దాలుగా న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్న భూవివాదాలను పరిష్కరించేందుకు సమర్థవంతమైన న్యాయపోరాటం చేస్తోందని తెలిపారు.

ప్రభుత్వ భూముల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత

సీఎం రేవంత్ నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ భూముల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. విలువైన ప్రభుత్వ భూములపై కొనసాగుతున్న న్యాయ వివాదాలను త్వరితగతిన పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించారని వెల్లడించారు. రెవెన్యూ అధికారులు, న్యాయశాఖ, ప్రభుత్వ న్యాయవాదుల మధ్య సమన్వయాన్ని పెంచి సుప్రీంకోర్టు సహా వివిధ న్యాయస్థానాల్లో ప్రభుత్వ వాదనలను బలంగా వినిపించేందుకు అవసరమైన చర్యలు చేపట్టారని మంత్రి పొంగులేటి వివరించారు.

విలువైన భూముల పరిరక్షణకు ప్రత్యేక కార్యాచరణ

గతంలో సరైన పర్యవేక్షణ, సమన్వయం కొరవడటంతో అనేక విలువైన ప్రభుత్వ భూములకు సంబంధించి దశాబ్దాల తరబడి న్యాయవివాదాలు కొనసాగాయని మంత్రి పేర్కొన్నారు. ఈ పరిస్థితిని మార్చేందుకు ప్రజా ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతోందన్నారు. ప్రభుత్వ భూములకు సంబంధించిన పాత రికార్డులు, రెవెన్యూ ఆధారాలు, న్యాయపరమైన అంశాలను సమగ్రంగా పరిశీలించి, ప్రభుత్వ హక్కులను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటోందని తెలిపారు.

ప్రజా ప్రభుత్వం న్యాయపోరాటానికి నిదర్శనం

ఈ క్రమంలో కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాల విలువైన భూమికి సంబంధించి సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు రావడం ప్రభుత్వ భూముల పరిరక్షణలో కీలక విజయమని మంత్రి గుర్తుచేశారు. తాజాగా మియాపూర్ భూములకు సంబంధించి కూడా సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇవ్వడం ప్రజా ప్రభుత్వం చేపట్టిన న్యాయపోరాటానికి మరో బలమైన నిదర్శనమన్నారు. ఈ రెండు ఉదంతాలు ప్రభుత్వ భూముల పరిరక్షణ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ ప్రత్యేక చొరవను, రెవెన్యూ శాఖ సమర్థవంతమైన కార్యాచరణను ప్రతిబింబిస్తున్నాయని తెలిపారు.

రెవెన్యూ అధికారులు, న్యాయనిపుణులకు ప్రత్యేక అభినందనలు

గత రెండు దశాబ్దాలుగా వివాదాల్లో చిక్కుకున్న అత్యంత విలువైన భూములను న్యాయపోరాటం ద్వారా ప్రభుత్వానికి చెందేలా అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇవ్వడం సాధారణ విషయం కాదని, దీని వెనుక ప్రభుత్వ చిత్తశుద్ధి, అధికారుల సమన్వయం, న్యాయపరమైన కృషి ఉన్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం న్యాయస్థానాల్లో సమర్థవంతంగా ప్రభుత్వ వాదనలు వినిపించి ఆ భూములు ప్రభుత్వానికి దక్కడంలో కీలక పాత్ర పోషించిన రెవెన్యూ అధికారులు, న్యాయ నిపుణులు, ప్రభుత్వ న్యాయవాదులను మంత్రి పొంగులేటి ప్రత్యేకంగా అభినందించారు.

భూ ఆక్రమణలకు పాల్పడితే ఊరుకునేది లేదు

ప్రభుత్వ భూమి అంటే అది ఏ ఒక్క వ్యక్తికో, సంస్థకో చెందిన ఆస్తి కాదని, అది రాష్ట్ర ప్రజలందరి ఉమ్మడి ఆస్తి అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. నేటి తరంతో పాటు భవిష్యత్ తరాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ భూములను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఆక్రమణలకు పాల్పడినా, అక్రమంగా హక్కులు పొందేందుకు ప్రయత్నించినా ఉపేక్షించబోమని హెచ్చరించారు.

ప్రజల ఆస్తులను కాపాడే విషయంలో రాజీలేదు

''ప్రభుత్వ భూములను కాపాడటం అంటే ప్రజల సంపదను కాపాడటమే. ఆక్రమణలను అడ్డుకోవడం మాత్రమే కాకుండా, న్యాయస్థానాల్లోనూ ప్రభుత్వ హక్కులను సమర్థవంతంగా నిలబెట్టడమే మా ప్రభుత్వ లక్ష్యం. కంచె గచ్చిబౌలి, మియాపూర్ భూముల విషయంలో సాధించిన విజయాలు ఈ దిశగా మా ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనాలు. ముఖ్యమంత్రి రేవంత్ నాయకత్వంలో ప్రభుత్వ భూముల పరిరక్షణకు మరింత పటిష్టమైన చర్యలు కొనసాగిస్తాం. ప్రజల ఆస్తులను కాపాడే విషయంలో ఎలాంటి రాజీ ఉండదు'' అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తేల్చి చెప్పారు.

#Govt Lands#Telangana Govt#Ponguleti Srinivas Reddy#Miyapur Lands#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి