BRS: తెలంగాణ రాజకీయాల్లో మరో బిగ్ ఫైట్‌కు తెరలేచింది. వచ్చే మార్చిలో జరగబోయే రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సెమీఫైనల్స్‌గా భావిస్తున్న ప్రతిపక్ష బీఆర్ఎస్.. ఊహించని రీతిలో భారీ వ్యూహాన్ని తెరపైకి తెచ్చింది. పేరుకు ఇవి రెండే సీట్లు అయినా.. ఏకంగా 6 ఉమ్మడి జిల్లాలు, దాదాపు 70 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధి వీటి కిందకు వస్తాయి. దీంతో ఈ రెండు స్థానాల్లో గులాబీ జెండా ఎగరేసి, అధికార కాంగ్రెస్‌ను డిఫెన్స్‌లో పడేసేందుకు పార్టీలోని ఇద్దరు కీలక పిల్లర్లు కేటీఆర్, హరీష్ రావు చెరో సీటును పంచుకున్నారనే వార్త ఇప్పుడు తెలంగాణ భవన్లో హాట్ టాపిక్‌గా మారింది.
నీకా సీటు.. నాకీ సీటు
రాష్ట్రంలోని మెజారిటీ నియోజకవర్గాల్లో విద్యావంతులైన ఓటర్లు తీర్పు ఇచ్చే ఈ ఎన్నికల్లో గెలిచి కేడర్‌లో నూతనోత్సాహం నింపాలని గులాబీ దళపతి కేసీఆర్ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారు. ఇందులో భాగంగానే హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ గ్రాడ్యుయేట్ స్థానాన్ని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు, వరంగల్-ఖమ్మం-నల్గొండ స్థానాన్ని ట్రబుల్ షూటర్ హరీష్ రావుకు అప్పగించారని పార్టీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. టాప్ లీడర్లే నేరుగా రంగంలోకి దిగితే కింది స్థాయి నాయకుల్లో అలసత్వం పోయి మొత్తం వ్యవస్థ గాడిన పడుతుందన్నది హైకమాండ్ లెక్క.
కేటీఆర్‌కు హైదరాబాద్ ఎడ్జ్.. హరీష్‌కు క్షేత్రస్థాయి గ్రిప్
గతంలో మున్సిపల్ శాఖ మంత్రిగా సుదీర్ఘకాలం పనిచేసిన కేటీఆర్‌కు హైదరాబాద్, రంగారెడ్డి పరిధిలోని విద్యావంతులు, ఉద్యోగులు, యువతలో మంచి క్రేజ్ ఉంది. రాజధాని నుంచి పాలమూరు వరకు ఆయన ప్రభావం గట్టిగా ఉంటుందనే ఉద్దేశంతోనే ఆ స్థానానికి కేటీఆర్‌ను ఇన్‌ఛార్జ్‌గా దించుతున్నట్లు సమాచారం. మరోవైపు, గతంలో నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల స్థానానికి విజయవంతంగా ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరించిన ట్రాక్ రికార్డ్ హరీష్ రావు సొంతం. ఇప్పటికే ఆ జిల్లాల్లో గ్రౌండ్ లెవల్లో ఆయనకు బలమైన నెట్వర్క్ ఉంది. పైగా పలుమార్లు క్షేత్రస్థాయి పర్యటనలు కూడా చేశారు.
కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో జోరు పెంచగా.. బీఆర్ఎస్ మాత్రం నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జులను పెట్టి పక్కాగా ఓటర్ల నమోదు చేయిస్తోంది. ప్రస్తుతం కొనసాగుతున్న ఓటర్ల నమోదు ప్రక్రియ ముగియగానే.. కేటీఆర్, హరీష్ రావు నేరుగా రంగంలోకి దిగి ఆరు ఉమ్మడి జిల్లాల్లో సుడిగాలి పర్యటనలు చేయడానికి రూట్ మ్యాప్ సిద్ధం చేసుకుంటున్నారు. మాజీ మంత్రుల నుంచి క్షేత్రస్థాయి కార్యకర్తల దాకా అందరినీ ఒక్క తాటిపైకి తెచ్చి కాంగ్రెస్‌ను కట్టడి చేయాలన్న బావా బావమర్దుల ఈ జాయింట్ స్ట్రాటజీ ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.


