TRAI Report: భారత టెలికాం రంగాన్ని శాసిస్తున్న రిలయన్స్ జియో దూకుడు ముందు దేశంలోనే రెండో అతిపెద్ద నెట్‌వర్క్ అయిన భారతీ ఎయిర్‌టెల్ నిలబడలేకపోతోంది. కొత్త యూజర్స్‌ని ఆకర్షించడంలో జియో సునామీ సృష్టిస్తుంటే.. ఎయిర్‌టెల్ మాత్రం ఊహించని రీతిలో చతికిలపడింది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) తాజాగా విడుదల చేసిన గణాంకాలు మార్కెట్‌లో ఎయిర్‌టెల్ బలహీనపడుతున్న తీరును స్పష్టంగా తేటతెల్లం చేశాయి.
జియోకు 19 లక్షలు.. ఎయిర్‌టెల్ కేవలం 2 లక్షలే
ట్రాయ్ లెక్కల ప్రకారం సెప్టెంబర్ నెలలో దేశవ్యాప్తంగా దాదాపు 22 లక్షల మంది కొత్త మొబైల్ యూజర్లు మార్కెట్‌లోకి రాగా, అందులో ఏకంగా 19 లక్షల మంది జియో నెట్‌వర్క్‌నే ఎంచుకున్నారు. ఇదే సమయంలో భారీ అంచనాలు పెట్టుకున్న ఎయిర్‌టెల్ ఖాతాలోకి కేవలం 2 లక్షల మంది కొత్త కస్టమర్లు మాత్రమే వచ్చారు. అంటే కొత్త యూజర్లను రాబట్టుకోవడంలో జియో దరిదాపుల్లో కూడా ఎయిర్‌టెల్ కనిపించలేదు. దాదాపు పది రెట్ల తేడాతో ఎయిర్‌టెల్ ఘోరంగా వెనుకబడటం టెలికాం వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
ఎయిర్‌టెల్ సెల్ఫ్ గోల్..
ఎయిర్‌టెల్ పతనానికి కంపెనీ తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలే ప్రధాన కారణమనే చర్చ మొదలైంది. తక్కువ ధరలో ఎక్కువ వ్యాలిడిటీ ఇచ్చే పాపులర్ రూ.299 ప్రీపెయిడ్ ప్లాన్‌ను ఆగస్టులో ఎయిర్‌టెల్ ఉన్నట్లుండి క్యాన్సల్ చేసింది. బడ్జెట్ ధరలో రీఛార్జ్ చేసుకునే కోట్లాది మంది సామాన్య వినియోగదారులపై ఇది తీవ్ర ప్రభావం చూపింది. ప్లాన్ ధరలను పెంచే వ్యూహంతో ఎయిర్‌టెల్ వేసిన ఈ అడుగు బెడిసికొట్టడంతో.. అసంతృప్తి చెందిన కస్టమర్లు నేరుగా జియో వైపు తరలివెళ్లినట్లు స్పష్టమవుతోంది. ప్రస్తుతం మొత్తం మార్కెట్ వాటాలో 51.11 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లతో జియో తిరుగులేని అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. ఎయిర్‌టెల్ 49.42 కోట్లతో రేసులో వెనుకబడిపోతోంది. సాధారణ యూజర్లను కోల్పోతూ రెండో అతిపెద్ద సంస్థగా తన పట్టును నిలుపుకోవడానికి ఎయిర్‌టెల్ తీవ్రంగా ఆపసోపాలు పడుతోంది.


