తెలంగాణ

నేనేమీ తప్పుగా మాట్లాడలేదు, నా వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా-అనిరుధ్ రెడ్డి

రచన: NK•••5 నిమిషాల పఠనం

నియోజకవర్గాలకు నిధులు, పెండింగ్ బిల్లుల చెల్లింపుల విషయంలో ఎమ్మెల్యేలకు అన్యాయం జరుగుతోందని.. నిధులు, బిల్లుల కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధమే అంటూ సొంత పార్టీ ప్రభుత్వంపై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం రేపిన

Anirudh Reddy: నియోజకవర్గాలకు నిధులు, పెండింగ్ బిల్లుల చెల్లింపుల విషయంలో ఎమ్మెల్యేలకు అన్యాయం జరుగుతోందని.. నిధులు, బిల్లుల కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధమే అంటూ సొంత పార్టీ ప్రభుత్వంపై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆయన వ్యాఖ్యలు అధికార పార్టీలోనూ కలకలం సృష్టించాయి. అనిరుధ్ రెడ్డి వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ సీరియస్ అయ్యారన్న వార్తలు వస్తున్నాయి. దీంతో ఈ వ్యవహారంపై అనిరుధ్ రెడ్డి స్పందించారు. మరోసారి హాట్ కామెంట్స్ చేశారు.

డిప్రెషన్‌కి గురై మాట్లాడా

నేనేమీ తప్పుగా మాట్లాడలేదని అనిరుధ్ రెడ్డి తేల్చి చెప్పారు. అంతేకాదు తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అంశాలనే తాను ప్రస్తావించానని పేర్కొన్నారు. తాను కొంత డిప్రెషన్ కి గురై మాట్లాడినట్లు వెల్లడించారు. ఆ వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని, పీసీసీ నిర్ణయానికి కూడా కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు.

తెలంగాణ కాంట్రాక్టర్లను ఆదుకోవాలి

''ఒక డిప్రెస్డ్ స్టేజ్ లో నేను మాట్లాడాల్సి వచ్చింది. నేను ఏదైతే మాట్లాడానో దానిపై నిలబడతాను. ఒకసారి మాట్లాడిన తర్వాత.. లేదు తప్పైంది.. వెనక్కిపోతా అని అనను. నేను మూడుసార్లు అడుగుతాను తర్వాత తిరగబడతానని చెప్పా. నా బాధ ఎవరికి చెప్పుకుంటాను? నన్ను గెలిపించిన జడ్చర్ల ప్రజలకే కదా. నేనేమీ తప్పు మాట్లాడలేదు. తెలంగాణ కాంట్రాక్టర్లను ఆదుకోవాలని అన్నాను.

పీసీసీ ప్రెసిడెంట్ నిర్ణయానికి కట్టుబడి ఉంటా

రోడ్లు సగంలో ఆగిపోయాయి. పిల్లలు కిందపడి దెబ్బలు తగులుతున్నాయి. రోడ్లు సగం కంప్లీట్ అయి కాంట్రాక్టర్ వెళ్ళిపోయాడని చెప్పా. పీసీసీ ప్రెసిడెంట్ గానీ మా ఏఐసీసీ గానీ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటా. ఇప్పుడున్న జనరేషన్ డిఫరెంట్. పాత జనరేషన్ లీడర్స్ నాలుగు గోడల మధ్యలో అన్నీ మాట్లాడుకునేది. ఇప్పుడున్న జెన్ జీ జనరేషన్ ఓపెన్ గా పబ్లిక్ లో మాట్లాడతాం. జెన్ జీ అంటే ఏజ్ కాదు.. మన ఆలోచన.. ఇప్పుడున్న యువతకి ఏం కావాలి అనేది ఆలోచిస్తేనే మనం కూడా జెన్ జీ'' అని అనిరుధ్ రెడ్డి అన్నారు.

నాకు ఎలాంటి నోటీసులు రాలేదు

పీసీసీ క్రమశిక్షణ కమిటీ నోటీసుల వ్యవహారంపైనా అనిరుధ్ రెడ్డి స్పందించారు. తనకు ఎలాంటి నోటీసులు రాలేదన్నారు. ఒకవేళ నోటీసులు వస్తే కచ్చితంగా సమాధానం ఇస్తానన్నారు. ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు నిధులు రావడం లేదని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ కూడా అంగీకరించారని ఆయన తెలిపారు. ఎమ్మెల్యేల సమస్యలపై పీసీసీ చీఫ్ స్పందించాలని డిమాండ్ చేశారు.

నోటీసులు వస్తే కచ్చితంగా రిప్లయ్ ఇస్తా

''ఇలాంటి అంశాలను క్రమశిక్షణ కమిటీ చూసుకుంటుందని మహేశ్ గౌడ్ క్లియర్ గా చెప్పారు. నాకేమీ లెటర్ రాలేదు, నోటీసులూ రాలేదు. రిప్లయ్ ఇవ్వాల్సిన అవసరం నాకు ఇప్పుడు లేదు. ఒకవేళ నోటీసులు వస్తే కచ్చితంగా రిప్లయ్ ఇస్తాను. ఎమ్మెల్యేలకు నిధులు రావడం లేదని మహేశ్ గౌడ్ కూడా ఒప్పుకున్నారు. కానీ మంత్రులకు నిధులు రావడం లేదు అని మాత్రం ఆయన అనలేదు'' అని అనిరుధ్ రెడ్డి అన్నారు.

#Anirudh Reddy#Telangana#Jadcherla#Telangana Congress#Cm Revnath Reddy#Mahesh Kumar Goud#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి