తెలంగాణ

Telangana Politics: కామ్రేడ్స్ చెరోదారి.. గ్రాడ్యుయేట్ పోరులో కాంగ్రెస్‌కు ఊహించని షాక్ తప్పదా!

రచన: Mahesh••6 నిమిషాల పఠనం

Telangana Politics: తెలంగాణలో జరగబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సమరంలో అనూహ్య రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రెండు స్థానాలనూ క్లీన్‌స్వీప్ చేసి తమ సత్తా చాటాలని అధికార కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తుంటే.. మిత్రపక్షాలైన కమ్యూనిస్టుల వైఖరి ఇప్పుడు హస్తం పార్టీకి కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది.

Telangana Politics: తెలంగాణలో జరగబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సమరంలో అనూహ్య రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రెండు స్థానాలనూ క్లీన్‌స్వీప్ చేసి తమ సత్తా చాటాలని అధికార కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తుంటే.. మిత్రపక్షాలైన కమ్యూనిస్టుల వైఖరి ఇప్పుడు హస్తం పార్టీకి కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలో భాగస్వాములుగా ఉన్నప్పటికీ, రాష్ట్ర స్థాయికి వచ్చేసరికి కామ్రేడ్స్ చెరో దారి చూసుకుంటున్నారు. మొన్నటిదాకా కలిసి నడిచిన సీపీఎం హ్యాండ్ ఇవ్వడం, మరో మిత్రపక్షమైన సీపీఐ నాన్చుడు ధోరణి అవలంబిస్తుండటం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఆర్టీసీలో దోస్తీ.. ఎమ్మెల్సీలో కుస్తీ

ఇటీవల జరిగిన ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో కాంగ్రెస్, సీపీఎం అనుబంధ సంఘాలు కలిసి పనిచేసి విజయవంతమయ్యాయి. దీంతో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బరిలో కూడా కాంగ్రెస్ అభ్యర్థులకు సీపీఎం అండగా నిలుస్తుందని పార్టీ శ్రేణులు భావించాయి. కానీ సీన్ కట్ చేస్తే.. ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే సుత్తి కొడవలి పార్టీ రూట్ మార్చేసింది. కాంగ్రెస్‌తో సంబంధం లేకుండా సొంతంగా ఒక ప్రత్యేక ఫ్రంట్‌ను ఏర్పాటు చేసి, తమ అభ్యర్థిని కూడా అధికారికంగా ప్రకటించేసింది. దీంతో ఆర్టీసీలో ఉన్న దోస్తీ కాస్తా ఎమ్మెల్సీ పోరుకు వచ్చేసరికి పూర్తిగా బెడిసికొట్టిందని తేలిపోయింది. కాంగ్రెస్‌కు మద్దతిచ్చే ప్రసక్తే లేదని సీపీఎం తన నిర్ణయంతో కుండబద్దలు కొట్టేసింది.

కంకి కొడవలి లెక్కలేంటి?

సీపీఎం దారి స్పష్టమైనా.. అసెంబ్లీ ఎన్నికల నుంచి కాంగ్రెస్‌కు నమ్మకమైన మిత్రుడిగా ఉన్న సీపీఐ మాత్రం ఇంకా తన వైఖరిని తేల్చకుండా సస్పెన్స్ పెంచుతోంది. అధికారికంగా ఇప్పటివరకు ఎలాంటి మద్దతు ప్రకటించకపోవడం హస్తం పార్టీలో గుబులు రేపుతోంది. కాంగ్రెస్‌కు నేరుగా జై కొట్టకుండా సీపీఐ వ్యూహాత్మక మౌనం పాటిస్తుండటం వెనుక బలమైన కారణాలే ఉన్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తమకు ఇచ్చిన రాజకీయ హామీలు, పలు పెండింగ్ అంశాలను ముందుగా పరిష్కరించుకోవాలనే ఆలోచనలో పార్టీ రాష్ట్ర నాయకత్వం ఉన్నట్లు సమాచారం.

నవంబర్ 5న రేవంత్‌తో కీలక భేటీ..

ఈ సస్పెన్స్‌కు తెరదించేందుకు నవంబర్ 5వ తేదీ అత్యంత కీలకంగా మారనుంది. ఆ రోజు సీఎం రేవంత్ రెడ్డితో సీపీఐ ముఖ్య నేతలు ముఖాముఖి భేటీ కానున్నారు. తమకు ఇచ్చిన హామీల అమలు, ప్రభుత్వ పనితీరు, పెండింగ్ పనులపై రేవంత్‌తో చర్చించనున్నారు. ఇటీవల జరిగిన సీపీఐ అంతర్గత కార్యవర్గ సమావేశంలో ఒక జాతీయ నేత మాట్లాడుతూ.. "మిత్రపక్షంగా ఉన్నప్పటికీ ప్రజా వ్యతిరేక విధానాలను, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే విషయంలో రాజీ పడకూడదు.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతు అనేది పరిస్థితులను బట్టి సందర్భానుసారంగా తీసుకోవాలి" అని తేల్చిచెప్పినట్లు ప్రచారం జరుగుతోంది.

సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చే హామీలు, చర్చల ఫలితంపైనే సీపీఐ తుది నిర్ణయం ఆధారపడి ఉంటుంది. ఒకవేళ సీపీఐ కూడా కాంగ్రెస్‌కు దూరంగా ఉంటే అది ప్రభుత్వానికి రాజకీయంగా పెద్ద మైనస్ అవుతుందనడంలో సందేహం లేదు. మొత్తం మీద సీపీఎం ఇప్పటికే దారి చూసుకోగా.. సీపీఐ వేసే అడుగులు ఇప్పుడు రేవంత్ సర్కార్‌ను తీవ్ర ఉత్కంఠకు గురిచేస్తున్నాయి.

#Telangana Politics#Graduate MLC Elections#Congress#Revanth Reddy#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి