Komatireddy Venkat Reddy: కృష్ణా జలాల విషయంలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. అధికార పక్షాన్ని టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. మాజీ సీఎం కేసీఆర్‌పై మంత్రి కోమటిరెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. తెలంగాణలో కరవు పాపం కేసీఆర్‌దే అని అన్నారు. ఏపీలో అప్పటి సీఎం జగన్‌తో కేసీఆర్ కుమ్మక్కయ్యారని, అందుకే తెలంగాణకు రావాల్సిన నీటిని కోల్పోయామని మంత్రి కోమటిరెడ్డి చెప్పారు. కేసీఆర్ చేసిన పనితో కష్ట కాలంలో శ్రీశైలం నుంచి నీటి తరలించే పరిస్థితి లేకుండా పోయిందని వాపోయారు.
నాడు పోతిరెడ్డి పాడు నుంచి ఏపీ జల దోపిడీకి పాల్పడుతుంటే కేసీఆర్ సహకరించారని మంత్రి కోమటిరెడ్డి ఆరోపించారు. ఫలితంగా ఏపీ రోజుకు 10 టీఎంసీల నీటిని పోతిరెడ్డిపాడు ద్వారా తరలించుకుపోతోందన్నారు. ఒకవేళ అప్పుడే అడ్డుకుని ఉంటే ఇప్పుడు మనం కరవును సమర్థవంతంగా ఎదుర్కొని ఉండే వాళ్లమన్నారు.
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ ఎస్ఎల్ బీసీని పట్టించుకోలేదని మంత్రి కోమటిరెడ్డి చెప్పారు. దాని వల్లే ఇవాళ రాష్ట్రానికి శ్రీశైలం నుంచి నీటిని తీసుకెళ్లలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్.. ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌ను పూర్తి చేసి ఉంటే రోజుకు 10 టీఎంసీల నీరు తెలంగాణకు వచ్చేదన్నారు. ఎస్ఎల్‌బీసీ టన్నెల్ విషయంలో బాధ్యత వహిస్తూ తెలంగాణ ప్రజలకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు.
''కొత్త రాష్ట్రంలో పదేళ్లు తెలంగాణను పాలించిన కేసీఆర్ చేసిన ఘోరం వల్లే ఇవాళ తెలంగాణకు ఈ పరిస్థితి దాపురించింది. కరవు వచ్చినా మనం శ్రీశైలం నుంచి నీటిని తీసుకునే పరిస్థితి లేకుండా పోయింది. దీనికి కారణం కేసీఆర్. నాటి ఏపీ సీఎం జగన్‌తో కుమ్మక్కై రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ప్రారంభించేందుకు కేసీఆర్ అవకాశం ఇచ్చారు. దీంతో శ్రీశైలం నుంచి రోజూ 10 టీఎంసీల నీరు ఏపీ తీసుకుంటోంది. కేసీఆర్ చేసిన పాపం వల్లే ఇవాళ మనం నీళ్లు తీసుకోలేకపోతున్నాం. తెలంగాణ తన నీటి హక్కును కోల్పోయింది. నీళ్లను తీసుకెళ్లేలా ఆంధ్రా వాళ్లకు అవకాశం ఇస్తూ చేసిన తప్పిదానికి తెలంగాణ ప్రజలకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలి'' అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు.












