తెలంగాణ

Telangana Politics : కేసీఆర్‌పైనే రేవంత్ గురి.. కేటీఆర్, హరీశ్‌లను లైట్ తీసుకోవడం వెనుక అసలు స్కెచ్ ఇదే!

రచన: Mahesh6 నిమిషాల పఠనం

Telangana Politics : కాంగ్రెస్ ప్రభుత్వంపై విపక్షాలు దాడి చేస్తున్న వేళ, సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తున్న తీరు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. రోజూ రోడ్లపైకి వచ్చి పోరాడుతున్నది కేటీఆర్, హరీశ్ రావులే అయినప్పటికీ..

Telangana Politics : కాంగ్రెస్ ప్రభుత్వంపై విపక్షాలు దాడి చేస్తున్న వేళ, సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తున్న తీరు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. రోజూ రోడ్లపైకి వచ్చి పోరాడుతున్నది కేటీఆర్, హరీశ్ రావులే అయినప్పటికీ.. రేవంత్ మాత్రం వారిని పూర్తిగా పక్కనపెట్టి ఫామ్‌హౌస్‌లో సైలెంట్‌గా ఉంటున్న గులాబీ బాస్ కేసీఆర్‌నే పదే పదే తెరపైకి తెస్తున్నారనే వాదన రాజకీయ వర్గాల్లో ప్రముఖంగా వినిపిస్తోంది. అయితే దీని వెనుక ఒక వ్యూహాత్మకమైన మైండ్ గేమ్‌తో పాటు దీర్ఘకాలిక రాజకీయ ఎత్తుగడ దాగి ఉందన్న విశ్లేషణలు బలంగా వినిపిస్తున్నాయి.

రోడ్డుపై వాళ్లు.. మైండ్‌లో ఆయన

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి క్షేత్రస్థాయిలో పోరాటాలు చేస్తోంది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు మాత్రమే. మీడియా సమావేశాలు, ధర్నాలు, క్షేత్రస్థాయి పర్యటనలతో ప్రభుత్వాన్ని ఎండగట్టేందుకు ఈ ఇద్దరు నేతలు నిరంతరం శ్రమిస్తున్నారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగాలు గమనిస్తే, వీరిద్దరి విమర్శలకు కౌంటర్ ఇవ్వడానికి పెద్దగా ప్రాధాన్యం ఇచ్చినట్లు ఎక్కడ కనిపించడం లేదు. ఆయన ఎక్కడ మాట్లాడినా కేసీఆర్ పాలన, ఆయన నిర్ణయాలు, ఫామ్‌హౌస్ రాజకీయాల చుట్టూనే చర్చను తిప్పుతున్నారు. గులాబీ బాస్ ప్రత్యక్ష రాజకీయాలకు కాస్త దూరంగా, ఫామ్‌హౌస్ గడప దాటకుండా ఉంటున్నప్పటికీ.. సీఎం రేవంత్ మాత్రం ఆయనే తన రాజకీయ ప్రత్యర్థిగా చేసుకొని మాట్లాడుతున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

కేటీఆర్‌ను పవర్ ఫుల్ లీడర్ కాకుండా కట్టడి చేసే ఎత్తుగడ

రేవంత్ రెడ్డి కేసీఆర్‌ను హైలైట్ చేయడానికి అత్యంత కీలకమైన కారణం కేటీఆర్ ఇమేజ్ బిల్డింగ్‌కు చెక్ పెట్టడమేనని తెలుస్తోంది. ఒకవేళ కేటీఆర్ చేసే విమర్శలకు ఆయనకు సమాధానం ఇస్తూ పోతే.. సహజంగానే కేటీఆర్ స్థాయి ముఖ్యమంత్రి స్థాయికి సమానంగా ఎదుగుతుంది. బీఆర్ఎస్‌లో తదుపరి తిరుగులేని లీడర్‌గా ఆయన ప్రొజెక్ట్ అయ్యే అవకాశం దక్కుతుంది. ప్రభుత్వంతో సమానంగా కేటీఆర్ ఇమేజ్ పెరిగితే భవిష్యత్తులో అది కాంగ్రెస్‌కు రాజకీయంగా నష్టం కలిగిస్తుంది. అందుకే కేటీఆర్, హరీశ్‌లను లైట్ తీసుకుంటూ, కేవలం కేసీఆర్‌ను మాత్రమే ప్రత్యర్థిగా చూపిస్తూ.. బీఆర్ఎస్‌లో కేసీఆర్ తర్వాత ఎవరూ పవర్ ఫుల్ నేతలు కారనే సంకేతాన్ని పరోక్షంగా ప్రజల్లోకి పంపుతున్నారని విశ్లేషకులు అభిప్రాయడుతున్నారు.

బీఆర్ఎస్ కేడర్‌ను గందరగోళంలోకి నెట్టే మైండ్ గేమ్

కేసీఆర్‌ను ప్రధాన అజెండాగా మార్చడం ద్వారా క్షేత్రస్థాయిలో పోరాడుతున్న కేటీఆర్, హరీశ్‌ల కష్టాన్ని తక్కువ చేయాలనేది రేవంత్ వ్యూహంగా కనిపిస్తోంది. ఒకవైపు పార్టీని నిలబెట్టేందుకు కష్టపడుతున్న నాయకత్వాన్ని పట్టించుకోకుండా, ఎప్పుడూ కనిపించని అధినేతనే టార్గెట్ చేయడం ద్వారా గులాబీ కేడర్‌లో ఒకరకమైన నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయొచ్చని రేవంత్ భావిస్తున్నారు. "పార్టీలో మీరింకా సెకండ్ క్యాడర్ లీడర్లే.. అసలైన బాస్ కేసీఆరే" అనే భావనను పదే పదే గుర్తుచేస్తూ ఆ పార్టీ అంతర్గత నాయకత్వ ఎదుగుదలకు బ్రేకులు వేసే రాజకీయ చదరంగాన్ని రేవంత్ సమర్థంగా నడిపిస్తున్నారు.

ఈ వ్యూహంతో అటు కేసీఆర్ హయాంలోని తప్పులను ప్రజల్లో నిరంతరం సజీవంగా ఉంచుతూనే, ఇటు కేటీఆర్‌ను సమాన స్థాయి ప్రత్యర్థిగా ఎదగకుండా రేవంత్ రెడ్డి ఒకే దెబ్బకు రెండు పిట్టలను కొడుతున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

#Telangana Politics#Revanth Reddy#KCR#K Chandrashekar Rao#KTR#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి