వినాయక చవితి వచ్చిందంటే చాలు..రంగురంగుల తీరొక్క గణపయ్యలు గల్లీగల్లీలో దర్శనమిస్తుంటాయి.పండుగకు రెండు, మూడు నెలల ముందు నుంచే విగ్రహాల తయారీ ప్రారంభం అవుతుంది. పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టెంట్లలో విగ్రహాల తయారీని ప్రారంభిస్తారు. విగ్రహా తయారీలో ప్రత్యేక శ్రద్ధ పెడతారు.గతంలో పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వినియోగంతో విగ్రహాలు భారీ ఎత్తులో తయారుచేసేవారు.
ప్రస్తుతం పర్యావరణ హితమైన విగ్రహాల తయారీలో కార్మికులు దృష్టి సారించారు. మట్టి గణపయ్యల వాడకం సైతం పెరిగింది. మట్టితో తయారు చేసిన విగ్రహాలు బరువుగా ఉండటం మూలనా భారీ ఎత్తులో వీటిని తయారు చేయడం కష్టం. అందుకే ఇప్పుడు కూడా కొన్ని చోట్ల పీఓపీ ద్వారా విగ్రహాలు తయారీ చేస్తున్నారు. మట్టి గణపతితో పోలిస్తే ఈ విగ్రహాలు కనువిందు చేస్తుంటాయి. ప్రత్యేకంగా ఆకర్షిస్తుంటాయి.పీఓపీ ద్వారా చేసిన విగ్రహాల ఫినిషింగ్ బాగుంటుందని, అందుకే వినియోగదారులు ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారని తయారీ దారులు చెబుతున్నారు.
హైదరాబాద్ నగరంలో ఖైరతాబాద్ బడా గణేశ్ తర్వాత బాలాపూర్ గణేశ్ చాలా ఫేమస్.. ఖైరతాబాద్‌లో ఎన్నో ఏండ్లుగా 50 అడుగులకు పైగా విగ్రహాన్ని తయారీ చేసి ఆ తర్వాత భారీ క్రేన్ల సాయంతో హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేస్తుంటారు. ఇక బాలాపూర్ లడ్డూ ఫేమస్.. ఏకంగా రూ.లక్షల్లో వేలం పలుకుతుంటుంది. ప్రస్తుతం గల్లీగల్లీలో గణనాధులు కొలువుదీరాయి. ఇదిలాఉండగా, 24 క్యారెట్ల బంగారం, వజ్రాలతో తయారుచేసిన ఓ గణపతి విగ్రహం ఈ ఏడాది స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.
నగరంలోని బేగంబజార్ ఫీల్ ఖానాలోని ఓ జ్యువెలరీ షాపులో పంచలోహాలు, 24 క్యారెట్ల బంగారం, 3.83 లక్షల అమెరికన్ వజ్రాలతో 48 కేజీల భారీ గణపతి విగ్రహాన్ని తయారు చేయించారు. 8 మంది కళాకారులు 8 నెలల పాటు శ్రమించి దీన్ని రూపొందించారు. 11 రోజుల పూజల అనంతరం ఈ విగ్రహాన్ని యథావిధిగా ఉంచి, కేవలం మట్టి వినాయకుడిని మాత్రమే నిమజ్జనం చేస్తామని నిర్వాహకులు ఆధార్, నిఖితేశ్ తెలిపారు. బంగారం, వజ్రాలతో రూపుదిద్దుకున్న ఈ బొజ్జ గణపయ్య విగ్రహం అందరినీ ఆకర్షిస్తోంది.. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.








