తెలంగాణ

Erravalli: గులాబీ బాసుల దాకా విచారణ.. ఎర్రవల్లి కేసులో సిట్ స్పీడ్!

రచన: Mahesh6 నిమిషాల పఠనం

తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా ఎర్రవల్లి ఫాంహౌస్‌ చుట్టూ భగ్గుమన్నాయి. అసెంబ్లీ వద్ద స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను ఉద్దేశించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో రాజుకున్న అగ్గి.. చివరకు ఎర్రవల్లిలో పసుపు నీళ్లతో ‘శుద్ధి’ చేసే స్థాయికి చేరి పెను రాజకీయ తుఫానుగా మారింది.

Erravalli: తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా ఎర్రవల్లి ఫాంహౌస్‌ చుట్టూ భగ్గుమన్నాయి. అసెంబ్లీ వద్ద స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను ఉద్దేశించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో రాజుకున్న అగ్గి.. చివరకు ఎర్రవల్లిలో పసుపు నీళ్లతో ‘శుద్ధి’ చేసే స్థాయికి చేరి పెను రాజకీయ తుఫానుగా మారింది. ఈ ఘటనను ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకోవడం, విచారణ బాధ్యతలను హైదరాబాద్ జాయింట్ కమిషనర్ విజయ్ కుమార్‌కు అప్పగించడంతో వ్యవహారం పతాక స్థాయికి చేరింది. కేవలం కింది స్థాయి కార్యకర్తలతో ఈ వ్యవహారం ముగుస్తుందా? లేక విచారణ సెగ గులాబీ దళపతులకు కూడా తాకుతుందా? అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది.

పసుపు నీళ్ల వెనుక ‘మాస్టర్ మైండ్’ ఎవరు?

కాంగ్రెస్, దళిత సంఘాల కార్యకర్తల నిరసన అనంతరం ఎర్రవల్లి రోడ్డును పసుపు నీళ్లతో కడిగివేయడం దళితులను ఘోరంగా అవమానించడమేనని అధికార పార్టీ అస్త్రాలు ఎక్కుపెడుతుండగా, రాజకీయ కక్షతోనే దీన్ని వక్రీకరిస్తున్నారని బీఆర్ఎస్ ఎదురుదాడి చేస్తోంది. అయితే సిట్ రంగంలోకి దిగిన తర్వాత సీన్ ఒక్కసారిగా మారింది. పసుపు నీళ్లు చల్లిన స్థానిక కార్యకర్తలు ఎవరు?, ఈ కార్యక్రమం చేపట్టాలని వారికి పైనుంచి ఆదేశాలు ఇచ్చిందెవరు?, ఎర్రవల్లి ఫాంహౌస్‌ కేంద్రంగానే ఈ కుట్ర జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి విమర్శిస్తున్న నేపథ్యంలో, అసలు తెరవెనుక ఉన్న కీలక నేత పాత్ర ఏమిటి? అనే కోణాల్లో అధికారులు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు.

ఇదే సమయంలో గజ్వేల్ ఏసీపీ నరసింహులు బృందం వరదరాజుపూర్, ఎర్రవల్లి గ్రామాల్లో ప్రత్యక్ష సాక్షులు, వీడియో ఫుటేజీల ఆధారంగా రంగం సిద్ధం చేస్తోంది. ఆదేశాలు ఇచ్చిన పెద్దల పేర్లు బయటకు వస్తే మాత్రం గులాబీ పార్టీకి ఊహించని రాజకీయ దెబ్బ తగలడం ఖాయంగా కనిపిస్తోంది.

కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌లకు సిట్ నోటీసులు తప్పవా?

ఈ దర్యాప్తులో అత్యంత కీలకమైన అంశం ఫోన్ కాల్స్, కమ్యూనికేషన్ రికార్డులేనని తెలుస్తోంది. ఘటన జరిగిన సమయంలో కేసీఆర్‌కు ముందస్తు సమాచారం ఉందా? ఎవరికైనా నేరుగా ఫోన్ ద్వారా ఆదేశాలు అందాయా? అనే కోణాన్ని అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు. మరోవైపు ఉద్రిక్తతల నడుమ ఫాంహౌస్‌‌కు బయలుదేరిన కేటీఆర్, హరీశ్‌రావులను పోలీసులు అడ్డుకోవడం వెనుక కూడా అనేక ప్రశ్నలు ఉన్నాయి. ఆ సమయంలో స్థానిక నాయకత్వంతో వారి మధ్య ఎలాంటి సంభాషణలు జరిగాయన్న దానిపై ఆరా తీస్తున్నారు. ఆధారాలు పక్కాగా దొరికితే బీఆర్ఎస్ అగ్రనేతలను సైతం విచారణకు పిలిచే అవకాశాలు లేకపోలేదని పోలీసు వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం.

రివర్స్ ఎటాక్‌కు బీఆర్ఎస్ స్కెచ్

మరోవైపు అసెంబ్లీ పరిసరాల్లో మహిళా ప్రజాప్రతినిధుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు, పరిమితి దాటి చేసిన బలప్రయోగాన్ని బీఆర్ఎస్ న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్తోంది. సిట్ విచారణలో పోలీసుల అత్యుత్సాహం బయటపడితే, దాన్నే బలమైన ఆయుధంగా మలుచుకుని ప్రభుత్వంపై ఎదురుదాడికి దిగాలని గులాబీ నేతలు వ్యూహాలు రచిస్తున్నారు.

నిష్పాక్షికమైన, కఠిన వైఖరి కలిగిన అధికారిగా పేరున్న జేసీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో మొదలైన ఈ 'ఆధారాల వేట' ఎవరి మెడకు చుట్టుకోనుంది? ఈ ఎపిసోడ్ కాంగ్రెస్‌కు రాజకీయ లాభం చేకూరుస్తుందా లేక పోలీసుల తీరుతో బీఆర్ఎస్‌కే సానుభూతి దక్కుతుందా అన్నది తేలాలంటే సిట్ నివేదిక బయటకు వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

#Erravalli#Telangana Politics#Erravalli Farmhouse#SIT Investigation#KCR#KTR#Harish Rao#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి