బీఆర్ఎస్ సభ్యులు మాక్ అసెంబ్లీ నిర్వహించడంపై తాజాగా టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి, పార్టీ నాయకులకు, విపక్ష నాయకులకు, ఇతర పార్టీల నాయకులకు, మీడియా మిత్రులకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.వినాయక చవితి పండుగ సందర్బంగా సోమవారం గాంధీ భవన్‌లో టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రీల్ మాక్ అసెంబ్లీ పెట్టడం కాదు, దమ్ముంటే మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను ప్రతిపక్ష నాయకుడిని చేయాలని డిమాండ్ చేశారు. పండగ రోజున తప్పని పరిస్థితుల్లో రాజకీయాలు మాట్లాడాల్సి వస్తుందని, స్పీకర్‌ను కులం పేరుతో దూషించిన దుస్థితి రాష్ట్రంలో నెలకొన్నదని పేర్కొన్నారు. దళితుల పట్ల బీఆర్‌ఎస్ వైఖరి స్పష్టం అయ్యిందని, ఉద్దేశపూర్వకంగానే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మీద అనుచిత వ్యాఖ్యలు చేశారన్నారు.
ఉద్యమంలో దళిత కార్డును మాజీ సీఎం కేసీఆర్ ఎలా వాడారో అందరూ చూశారని, గద్దర్, అందేశ్రీని ఏ రకంగా అవమానించారో ప్రజలకు తెలుసు అని అన్నారు. కేసీఆర్ 2003లో ఇచ్చిన హామీలపై డాక్యుమెంట్ విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.గత బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ ఇచ్చిన హామీలపై శ్వేత పత్రం విడుదల చేయాలన్నారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో దళితులపై అత్యాచారాలు,దాడుల వివరాలు సైతం బయటపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
ఇక ‘దళిత బంధు’ ఎంతమందికి ఇచ్చారని ప్రశ్నించారు. హుజూరాబాద్ నియోజకవర్గ ఉపఎన్నిక కోసమే ‘దళిత బంధు’తీసుకొచ్చారని, అంబేద్కర్ విగ్రహం పెడితే సరిపోదు, ఆ మహాభావుని సలహాలు, విలువలు ఆచరణలో పెట్టాలని సూచించారు.దళితులు నడిచిన నేలను శుద్ధి చేయడం దారుణమని, దళిత జాతిని కేసీఆర్ అవమానించారని అందుకే కేసీఆర్ రాజకీయాన్ని శుద్ధి చేయాలన్నారు. ప్రజాస్వామ్య దేశంలో ఇంతకంటే దారుణం మరొకటి లేదని చెప్పారు.
దళితులకు అత్యున్నత పదవులు ఇచ్చి అధికార కాంగ్రెస్ పార్టీ గౌరవించిందన్నారు. రీల్ మాక్ అసెంబ్లీ పెట్టడం కాదని, మాజీ మంత్రి, బీసీ బిడ్డ అయిన తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను ప్రతిపక్ష నాయకుడిని చేయాలని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు. పదేళ్ల బిఆర్ఎస్ బీసీ, దళిత, మైనార్టీ వ్యతిరేక పాలనను ప్రజలు ఇంకా మరిచిపోలేదని, దళిత స్పీకర్‌ను అధ్యక్ష అని పిలవాల్సి వస్తుందని కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదని టీపీసీసీ చీఫ్ మహశ్ గౌడ్ సంచలన ఆరోపణలు చేశారు.












