తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌ను త్వరలోనే తప్పించనున్నారని మరోసారి జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల అధికార పార్టీలో నెలకొన్న పరిస్థితులు, కేబినెట్ నుంచి కొండా సురేఖను తప్పించడం, మరో నలుగురు జిల్లా స్థాయి నేతలకు షోకాజు నోటీసులు ఇవ్వడం..పదవుల కోసం కొందరు సీనియర్లు అధికారపార్టీనే టార్గెట్ చేయడం, పదే పదే నేతలు ఢిల్లీకి వస్తూ ఫిర్యాదులు చేస్తుండటంతో రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఏం చేస్తున్నారనే ప్రశ్న ఉత్పన్నం అయినట్టు తెలుస్తోంది.
నేతలు పార్టీ లైన్ దాటి మాట్లాడుతుంటే మీనాక్షి నటరాజన్ సరిగా హ్యండిల్ చేయలేకపోతున్నారనే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి అధిష్టానం వద్ద ఫిర్యాదు చేసినట్టు ప్రచారం జరుగుతోంది.దీనికి తోడు అసెంబ్లీలో సమావేశాలు జరుగుతున్న సమయంలో మాజీ మంత్రి కొండా సురేఖ హాజరుకాలేదు. కేబినెట్ నుంచి తప్పించాక ఆమె హైదరాబాద్‌లోనే ఉన్నా.. సెషన్స్‌కు హాజరుకాలేదు. దీనికి తోడు బీఆర్ఎస్ నేతలు సీఎం రేవంత్, మంత్రి పొంగులేటి సహా ఇతర మంత్రులపై చేస్తున్న ఆరోపణలపైనా ఆమె స్పందించలేదని,పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారని అధిష్టానానికి తెలిసింది.
ఈ క్రమంలోనే మీనాక్షి నటరాజన్ కొండా సురేఖకు కాల్ చేసి అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావాలని, పార్టీ లైన్ దాటి వ్యహరించొద్దని సూచించినట్టు తెలిసింది.అందుకు కొండా సురేఖ నుంచి సరైన సమాధానం కరువైంది.దీంతో ఆమెను బుజ్జగించేందుకు అధిష్టానం ఢిల్లీకి పిలిపించినట్టు తెలిసింది. బయటకు మాత్రం ఆమెకు పదవి ఇవ్వబోతున్నారని ప్రచారం జరిగింది. కొండా మ్యాటర్‌లోనూ మీనాక్షి పనితనం సరిగా లేదని పార్టీలో చర్చ జరుగుతన్నట్టు సమాచారం.
ఈ క్రమంలోనే ఆమెను తప్పించాలని సీఎం రేవంత్ అధిష్టానం వద్ద ప్రపోజల్ పెట్టినట్టు ఊహగానాలు వినిపిస్తున్నాయి. గతంలో దీపాదాస్ మున్షీ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, పార్టీ నేతలతో నేరుగా చర్చలు జరిపి అభయం ఇస్తున్నారని, తమను సంప్రదించడం లేదని సీఎం ఆరోపణలు చేయడం వల్లే ఆమెను ఇన్‌చార్జ్ పదవి నుంచి తప్పించి గతేడాది ఫిబ్రవరిలో మీనాక్షి నటరాజన్‌ను ఏఐసీసీ నియమించినట్టు వార్తలొచ్చాయి. అయితే, తనపై, తన సోదరుల అక్రమాలపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తున్నందున మీనాక్షి నటరాజన్‌ను తొలగించేందుకు సీఎం రేవంత్ కుట్ర పన్నారని ప్రచారం జరుగుతోంది.
ఈ క్రమంలోనే కొండా సురేఖ బర్తరఫ్ అంశంలో విమర్శలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీ.. మీనాక్షి నటరాజన్‌ను నేరుగా తొలగించకుండా ఉన్నత చదువుల పేరిట రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి పదవి నుంచి తప్పిస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. 10 నెలల పాటు మీనాక్షి నటరాజన్ ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్తుందన్న కారణం చూపుతూ తెలంగాణకు కొత్త కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్‌ను నియమించాలని ఏఐసీసీ ప్రణాళిక రచించినట్టు టాక్ వినిపిస్తోంది. కాగా, తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ రేసులో ముకుల్ వాస్నిక్, దిగ్విజయ్ సింగ్, శక్తిసింహ్ గోహిల్, అశోక్ గెహ్లాట్ ఉన్నట్టు తెలుస్తోంది.








