లండన్ వేదికగా పవిత్ర గంగా హారతి
గంగానది ఒడ్డున జరిగే హారతి లాగే...
థేమ్స్ తీరంలో ప్రత్యేక వేడుక..
దీపాలు, మంత్రోచ్ఛారణల మధ్య భక్తి పరిమళం
లండన్ నగరం..! ఆధునికతకు ప్రతీకగా నిలిచే మహానగరం. ఆ నగరం మధ్యగా నిశ్శబ్దంగా ప్రవహించే థేమ్స్ నది. సాధారణంగా అక్కడ కనిపించేది నగర జీవన సందడి. కానీ ఓ సాయంత్రం.. అదే నదీ తీరం భారతీయ ఆధ్యాత్మికతతో పులకించింది. గంగానది ఒడ్డున తరతరాలుగా కొనసాగుతున్న పవిత్ర గంగా హారతి స్ఫూర్తితో.. థేమ్స్ తీరంలో దీపాలు వెలిగాయి. మంత్రోచ్ఛారణలు వినిపించాయి. భక్తి గీతాలు మార్మోగాయి. భారతీయ సంస్కృతికి చెందిన ఓ అపురూపమైన ఆధ్యాత్మిక దృశ్యం లండన్ గడ్డపై ఆవిష్కృతమైంది.
గంగమ్మ తల్లికి చేసే హారతి.. థేమ్స్ తీరానికి ఎలా వచ్చింది?
చిన్మయ మిషన్ యూకే ఆధ్వర్యంలో ‘టోటలీ థేమ్స్’ ఉత్సవంతో కలిసి గంగా ఆరతి ఆన్ ద థేమ్స్: ఎ సెరిమనీ ఆఫ్ లైట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. చిన్మయ మిషన్ 75 ఏళ్ల సేవా ప్రయాణాన్ని పురస్కరించుకుని ఈ వేడుకను ఏర్పాటు చేశారు.
భారతదేశంలో గంగానదిని కేవలం ఓ నదిగా చూడరు. జీవాన్ని ప్రసాదించే తల్లిగా.. పవిత్రతకు ప్రతిరూపంగా.. ఆధ్యాత్మికతకు ప్రతీకగా కొలుస్తారు. గంగమ్మ తల్లికి కృతజ్ఞతగా నదీ తీరంలో దీపాలు వెలిగిస్తూ చేసే గంగా హారతి అందుకే భక్తుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది.
అదే భావనను థేమ్స్ తీరంలోనూ ప్రతిధ్వనింపజేశారు. గంగమ్మ తల్లి కోసం వెలిగే దీపాల వెనుక ఉన్న భక్తిని.. ప్రకృతి పట్ల కృతజ్ఞతను.. విశ్వమానవ స్ఫూర్తిని లండన్‌కు తీసుకెళ్లారు.
దీపాల వెలుగులో.. మంత్రోచ్ఛారణల మధ్య...
భారీ నూనె దీపాలు, ప్రార్థనలు, సంగీతం, మంత్రోచ్ఛారణలతో నిర్వహించిన ఈ హారతి.. అక్కడి వాతావరణాన్ని ఆధ్యాత్మికంగా మార్చేసింది. చారిత్రక ఓల్డ్ రాయల్ నావల్ కాలేజ్ నేపథ్యంగా.. థేమ్స్ నది తీరంలో వెలిగిన దీపాలు ఒక అందమైన దృశ్యాన్ని ఆవిష్కరించాయి.
హిందూ ఆధ్యాత్మిక సంస్థలు, సంఘాల ప్రతినిధులు, ఆధ్యాత్మిక వ్యక్తులతో పాటు బ్రిటన్‌లోని హిందూ, దక్షిణాసియా సమాజానికి చెందిన పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇది కేవలం ఒక మతపరమైన కార్యక్రమంగా కాకుండా.. భిన్న నేపథ్యాల ప్రజలను ప్రకృతికి కృతజ్ఞత చెప్పే ఒకే భావన కిందకు తీసుకొచ్చిన వేడుకగా నిలిచింది.
నదిలో దీపాలు వదలలేదు.. ఎందుకంటే?
గంగా హారతి అంటే నదిలో దీపాలను వదిలే దృశ్యం మనకు గుర్తొస్తుంది. కానీ థేమ్స్ విషయంలో నిర్వాహకులు మరో అడుగు ముందుకేశారు. హారతిలో ఉపయోగించిన దీపాలను నదిలో వదలకుండా.. పూర్తిగా నదీ తీరంపైనే ఉంచారు.
ఎలాంటి వస్తువులను థేమ్స్‌లో వేయలేదు. ఎలాంటి ద్రవాలను నదిలో పోయలేదు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్, వ్యర్థాలను తగ్గించేందుకు చర్యలు తీసుకున్నారు. ఎందుకంటే ఈ హారతి చెప్పే అసలు సందేశం ప్రకృతిని పూజించడం మాత్రమే కాదు.. ప్రకృతిని పరిరక్షించడం కూడా. ప్రకృతికి నమస్కరిస్తూ.. అదే ప్రకృతికి నష్టం చేయడం ఎలా సాధ్యం? అందుకే సంప్రదాయానికి గౌరవం ఇస్తూనే పర్యావరణ బాధ్యతను కూడా పాటించారు.
గంగ అంటే కేవలం నది కాదు.. జ్ఞాన ప్రవాహం కూడా!
చిన్మయ మిషన్ దృష్టిలో గంగా మరో గొప్ప అర్థాన్ని కూడా కలిగి ఉంది. అది జ్ఞాన ప్రవాహానికి ప్రతీక. చిన్మయ మిషన్ వ్యవస్థాపకుడు స్వామి చిన్మయానంద.. హిమాలయాల నుంచి వెలువడిన వేదాంత జ్ఞానాన్ని సామాన్యుల జీవితాలకు చేరువ చేయడానికి తన జీవితాన్ని అంకితం చేశారు. అందుకే మిషన్ 75 ఏళ్ల ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటున్న సమయంలో.. గంగా హారతిని జ్ఞానం, సేవ, కృతజ్ఞత సరిహద్దులు దాటి ప్రవహించడానికి ప్రతీకగా భావించారు.
అంటే.. గంగానది నుంచి థేమ్స్ వరకు వచ్చింది కేవలం ఒక ఆచారం కాదు. భారతీయ ఆధ్యాత్మికతలోని ఒక భావన.. ఒక జీవన సందేశం.
థేమ్స్ తీరంలో వినిపించిన సందేశం
ప్రకృతిని మనం ఎంతగా గౌరవిస్తున్నాం? మనకు జీవనాన్ని అందిస్తున్న నదులను ఎంతగా కాపాడుతున్నాం? ఈ ప్రశ్నలను కూడా గంగా హారతి గుర్తుచేసింది. ప్రార్థనలో చేతులు జోడించడం ఎంత ముఖ్యమో.. ప్రకృతి పరిరక్షణలో చేతులు కలపడం కూడా అంతే ముఖ్యమని ఈ కార్యక్రమం చాటిచెప్పింది.
1997 నుంచి థేమ్స్ నదిని కేంద్రంగా చేసుకుని కళలు, పర్యావరణం, వారసత్వం, విద్యకు సంబంధించిన కార్యక్రమాలను నిర్వహిస్తున్న ‘టోటలీ థేమ్స్’ ఉత్సవంలో తొలిసారిగా గంగా హారతిని భాగం చేశారు. దీనికి మంచి స్పందన రావడంతో భవిష్యత్తులో ఈ వేడుక మరింత విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
గంగ నుంచి థేమ్స్ వరకు.. వెలిగింది ఒకే వెలుగు
ఒక వైపు భారతదేశపు పవిత్ర గంగానది.. మరోవైపు బ్రిటన్ చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన థేమ్స్. రెండు దేశాలు.. రెండు నదులు.. రెండు భిన్నమైన సంస్కృతులు. కానీ ప్రకృతి పట్ల గౌరవం మాత్రం ఒక్కటే. గంగానది తీరంలో తరతరాలుగా వెలుగుతున్న హారతి దీపం.. ఇప్పుడు థేమ్స్ తీరంలోనూ వెలిగింది. ఆ వెలుగులో భక్తి ఉంది.. సంస్కృతి ఉంది.. కృతజ్ఞత ఉంది.. పర్యావరణ స్పృహ ఉంది.
గంగమ్మ తల్లికి వెలిగించిన ఆ దీపం.. చివరికి మనకు చెప్పిన సందేశం ఒక్కటే. ప్రకృతిని దేవతగా కొలవడం అంటే.. దానిని కాపాడటం కూడా.












