నల్గొండ జిల్లాలోని నకిరేకల్ చేనేత సహకార సంఘం వేదికగా దారుణమైన అక్రమాల పర్వం వెలుగులోకి వచ్చింది. నిత్యం మగ్గం నేసి, దారాలు వడికి చెమటోడ్చే అమాయక చేనేత కార్మికుల నోటికాడ కూడును సొసైటీలోని కొందరు పెద్దలు దారుణంగా దోచేస్తున్నారు. మగ్గానికి, నేత వృత్తికి ఎలాంటి సంబంధం లేని వ్యాపారులు సొసైటీని హస్తగతం చేసుకుని, ఏకంగా 200 మంది అర్హులైన నిజమైన చేనేత కార్మికులను కుట్రపూరితంగా రోడ్డున పడేసిన వైనం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.
చేనేత సహకార చట్టం-1964 ప్రకారం.. సొసైటీలో సభ్యుడిగా కొనసాగాలంటే ప్రత్యక్షంగా మగ్గంపై పనిచేస్తూ, నేత వృత్తినే ప్రధాన జీవనాధారంగా కలిగి ఉండాలి. కానీ నిత్యం మెడికల్ షాపు నడుపుకుంటూ లక్షలు గడించే వ్యాపారికి ఈ సొసైటీలో సభ్యత్వం ఎలా ఇస్తారని బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తరతరాలుగా చేనేతనే నమ్ముకున్న నిజమైన కార్మికులను పక్కనబెట్టి, తమ సొంత బంధువులు, బినామీలతో అక్రమ సభ్యత్వాలు నింపి అధికార పీఠాన్ని దక్కించుకున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు.
ప్రభుత్వం నుంచి చేనేత కార్మికులకు అందే నూలు, ముడిసరుకు, రిబేట్లు, సబ్సిడీ సొమ్మును ఈ బోగస్ ముఠా నొక్కేస్తోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2019లోనే హైకోర్టు ఆదేశాలు జారీ చేసినా, ఆ తర్వాత శాఖాపరమైన విచారణలు జరిగినా, అధికారులను సైతం బురిడీ కొట్టిస్తూ ఈ దగాకోరు వ్యవస్థ రాజ్యమేలుతోందని మండిపడుతున్నారు. ఈ క్రమంలో సొసైటీ పరిధిలోని పొషం నిర్మల సహా 8 మంది బాధితులు తమ న్యాయవాది ఏ.చంద్రవతి ద్వారా స్థానిక మెడికల్ వ్యాపారి చిలుకూరి లక్ష్మీనర్సయ్యకు గట్టి లీగల్ నోటీసు జారీ చేశారు.
సెప్టెంబరు 15న సొసైటీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో బాధితులు తమ పోరాటాన్ని ఉధృతం చేశారు. తాను నేసే మగ్గం ఎక్కడుందో, దుస్తులు నేసిన ఆధారాలు, నూలు పొందిన రికార్డులను 24 గంటల్లోగా బహిర్గతం చేయాలని లక్ష్మీనర్సయ్యకు అల్టిమేటం జారీ చేశారు. స్టేట్ కోఆపరేటివ్ ఎలక్షన్ అథారిటీ, ట్రిబ్యునల్, హైకోర్టులను ఆశ్రయించి బోగస్ రాయుళ్ల ఆటకట్టిస్తామని, 200 మంది అసలైన నేత కార్మికులకు న్యాయం జరిగే వరకు న్యాయపోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు.












