ఇండియాలోని అన్ని ప్రభుత్వ, ప్రయివేటు శాఖలు, కార్యాలయాల్లో లంచం లేనిదే పనికాదు అనేది ఎవరిని అడిగినా చెబుతున్నారు. ప్రభుత్వశాఖల్లో అయితే మరి ఘోరం.. వృద్ధులకు పెన్షన్ ధ్రువపత్రాలు ఇవ్వడానికి కూడా లంచాలు డిమాండ్ చేసిన ఘటనలు అనేకం ఉన్నాయి. శాఖ ఏదైనా డబ్బులు ముట్టజెప్పనిదే ఫైల్ కదలదు అనేది జగమెరిగిన సత్యం. అయితే, దేశంలో ఇప్పటివరకు ఏయే శాఖల్లో ఎంత అవినీతి జరిగిందో ఏసీబీ అధికారులు మాత్రమే లెక్కలు చెప్పేవారు. అదంతా అధికారికంగా వారికి చిక్కిన వారి వివరాలు మాత్రమే బహిర్గతం చేసేవారు. కానీ, ఏసీబీకి చిక్కకుండా లంచం డిమాండ్ చేసిన వారి వివరాలు, ఏ శాఖలో ఎంత అవినీతి జరుగుతుందో తెలుసుకోవడానికి ఒక ప్రత్యేక పోర్టల్ అందుబాటులోకి వచ్చింది.దానిని తయారు చేసింది కూడా ఓ భారతీయ విద్యార్థే కావడం గమనార్హం.
లంచాల రిస్కులో ఇండియా ప్రపంచవ్యాప్తంగా 82వ స్థానంలో ఉన్నట్టు తెలిసింది. ఈ క్రమంలోనే పనివిషయంలో అధికారులు లంచం డిమాండ్ చేశారా? ఎవరైనా చెల్లించారా? లేదా నిరాకరించారా? ఏ శాఖలో ఎక్కువగా లంచం డిమాండ్ చేస్తున్నారు? వంటి వివరాలతో భారతీయ విద్యార్థి ఏఐ కోడింగ్ సాయంతో ప్రత్యేకంగా ఓ వైబ్‌సైట్ బిల్డ్ చేశాడు. లంచాల నిరోధం, ప్రభుత్వ కార్యాలయాల్లో పారదర్శకతను పెంచేందుకే ‘మహారాజా అగ్రసేన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ’ విద్యార్థి ఆర్యన్ నిషాద్ ఒక వినూత్న పోర్టల్‌కు శ్రీకారం చుట్టాడు. bribes.fyi పేరిట ఈ వెబ్‌సైట్‌ను జులై 2న లాంచ్ చేశాడు.
ఈ వైబ్‌సైట్ చాలా సెక్యూర్.. ఏ పౌరుడైనా తన పేరు, వివరాలు బయటపెట్టకుండా లంచం డిమాండ్ చేసిన వారి వివరాలు, ప్రదేశం, తమకు ఎదురైన అనుభవాలను నివేదించవచ్చు. ప్రభుత్వ శాఖ పేరు, సిటీ, లంచం డిమాండ్, చెల్లించారా? లేదా నిరాకరించారా? అనే వివరాలను ఇక్కడ నమోదు చేయవచ్చు. సేకరించిన సమాచారాన్ని ప్రభుత్వ శాఖలు, నగరాలు, రాష్ట్రాల వారీగా ప్రజలందరూ ఇక్కడ సెర్చ్ చేసి తెలుసుకునే చాన్స్ ఉంది.
ఇండియాలోని 251 నగరాల నుంచి ఇప్పటివరకు 616 లంచం డిమాండ్ చేసిన నివేదికలు ఈ వెబ్‌సైట్‌లో నమోదయ్యాయి. అత్యధికంగా పోలీస్ శాఖకు సంబంధించి 337 ఫిర్యాదులు రాగా, ఆ తదుపరి స్థానాల్లో RTO, రెవెన్యూ శాఖలు ఉన్నాయి. నమోదు చేసిన నివేదికలలో 38% మంది లంచం ఇవ్వడానికి నిరాకరించినట్టు పేర్కొన్నారు. ఈ వైబ్‌సైట్‌లో ఎలాంటి యాడ్స్, రుసుములు (Paywall) లేకుండా ఉచితంగా పనిచేస్తుంది. సైట్ రన్ అవ్వడానికి అయ్యే సర్వర్ ఖర్చులను ‘ఆర్యన్’ స్వయంగా భరిస్తున్నట్టు తెలిసింది.










