ఆలేరు రాజకీయాల్లో భూవివాదం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలంలో కోట్ల రూపాయల విలువైన భూమికి సంబంధించి ఆలేరు కాంగ్రెస్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యపై బాధితులు సంచలన ఆరోపణలు చేస్తున్నారు. వారసత్వంగా తమకు వచ్చిన, సుమారు 37 ఏళ్ల క్రితం కొనుగోలు చేసిన భూమిని తమ నుంచి బలవంతంగా లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.
తమ భూమికి సంబంధించిన పత్రాలను అక్రమంగా సృష్టించి హక్కులు మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని.. శంకర్ నాయక్, చాడా భాస్కర్ రెడ్డి అనే వ్యక్తులను ముందుంచి తమపై ఒత్తిడి తీసుకొస్తున్నారని బాధితులు వాపోతున్నారు. అంతేకాదు.. పోలీసులను అడ్డుపెట్టుకుని భూమి నుంచి తమను ఖాళీ చేయించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ పోలీసు అధికారులను నిలదీశారు.
ఉదయాన్నే భూమి వద్దకు పోలీసులు చేరుకోవడంతో బాధితులు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీస్ డిపార్ట్‌మెంట్‌ను అడ్డుపెట్టుకుని భూమి కబ్జా చేస్తారా? ఎఫ్ఐఆర్ ఉంటే చూపించండి.. అంటూ వారు ప్రశ్నించారు. తమపై అక్రమ కేసులు బనాయించే ప్రయత్నం జరుగుతోందని, ఈ వ్యవహారంపై ముందుగానే సంబంధిత విభాగాలకు ఫిర్యాదు చేశామని బాధితులు తెలిపారు.
అయితే బాధితుల ఆరోపణలను డీఎస్పీ ఖండించారు. కేవలం ఒక కేసుకు సంబంధించి స్థల పరిశీలన, పంచనామా నిర్వహించేందుకే పోలీసులు అక్కడికి వచ్చారని స్పష్టం చేశారు. దీంతో ఈ భూవివాదంలో అసలు వాస్తవం ఏంటి? భూమి పత్రాలు నిజమైనవేనా? అక్రమంగా డాక్యుమెంట్లు సృష్టించారా? పోలీసుల పాత్రపై వస్తున్న ఆరోపణల్లో నిజమెంత? అన్న ప్రశ్నలు పొలిటికల్ సర్కిల్లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
బాధితుల ఆరోపణలు నిజమైతే వారికి న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఆరోపణలు నిరాధారమైతే వాటిని ఆధారాలతో ఖండించాల్సిన బాధ్యత ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపైనే ఉంటుంది. ఈ వ్యవహారంపై నిష్పక్షపాత విచారణ జరిగితేనే నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.. ఇక పూర్తి వివరాలు కిందనున్న వీడియోలో చూడవచ్చు..












