హైదరాబాద్ ప్రస్తుతం వేగంగా విస్తరిస్తున్న మహానగరం. ఉపాధి, వ్యాపార, విద్యా అవకాశాల కోసం ఎందరో నిత్యం ఈ నగరానికి తరలివస్తుంటారు. అందుకే హైదరాబాద్ పరిపాలన కేవలం జీహెచ్‌ఎంసీ పరిధికే పరిమితం కాలేదు. కాలక్రమేణా జనాభా పెరిగింది, నగర విస్తీర్ణం పెరిగింది, ప్రజల అవసరాలు కూడా మారాయి. కానీ, పట్టణ పరిపాలనకు ఆధారంగా ఉన్న చట్టం మాత్రం దశాబ్దాల నాటి పరిస్థితులకు అనుగుణంగానే కొనసాగుతోంది.
ఈ నేపథ్యంలో, మారుతున్న కాలానికి అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం పాలనా వ్యవస్థలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. 1955లో సుమారు 12 లక్షల మంది జనాభాను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన జీహెచ్ఎంసీ చట్టానికి 70 ఏళ్ల తర్వాత సవరణలు చేయడంతోపాటు.. ప్రస్తుతం సుమారు కోటీ 30 లక్షల మంది జనాభా అవసరాలకు అనుగుణంగా తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ.. అంటే క్యూర్ కోసం కొత్త చట్టాన్ని తీసుకొచ్చినట్టు ప్రభుత్వం చెబుతోంది.
మరోవైపు హైదరాబాద్ చుట్టుపక్కల పట్టణ ప్రాంతాల అభివృద్ధిని ఒకే దిశలో నడిపించేందుకు క్యూర్ పరిధిలో ప్రత్యేక పాలనా వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో అత్యున్నత స్థాయిలో సీఎం చైర్మన్‌గా అపెక్స్ గవర్నెన్స్ కౌన్సిల్ పనిచేయనుంది. ఈ కౌన్సిల్ కేవలం సమావేశాలకే పరిమితం కాకుండా.. క్యూర్ పరిధిలో పట్టణ అభివృద్ధికి సంబంధించిన విజన్ ఏంటి? భవిష్యత్ ప్రణాళిక ఎలా ఉండాలి? ఏ రంగాలకు ప్రాధాన్యత ఇవ్వాలి? పెట్టుబడులను ఎలా సమన్వయం చేయాలి? వంటి అంశాలపై దిశానిర్దేశం చేయనుంది. వివిధ శాఖలు, రంగాలకు సంబంధించిన విధానాలు, పథకాలను కూడా రూపొందించనుంది.
అయితే ఈ నిర్ణయాలు తీసుకోవడం ఒక్కటే కాదు.. వాటిని క్షేత్రస్థాయిలో అమలు చేయడానికి మరో కీలక వ్యవస్థను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. అదే ఎగ్జిక్యూటివ్ కమిటీ. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి దీనికి చైర్మన్‌గా ఉంటే.. హెచ్ఎండీఏ మెట్రోపాలిటన్ కమిషనర్ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. జీహెచ్ఎంసీతో పాటు ఇతర మున్సిపల్ కార్పొరేషన్ల కమిషనర్లు, పోలీసు కమిషనర్లు, నాలుగు జిల్లాల కలెక్టర్లు, విద్యుత్, జలమండలి, మెట్రో, ఆర్టీసీ, హైడ్రా వంటి కీలక విభాగాల ఉన్నతాధికారులు సైతం ఇందులో సభ్యులుగా ఉంటారు.
ఈ ఎగ్జిక్యూటివ్ కమిటీ ప్రతి మూడు నెలలకు ఒకసారి తప్పనిసరిగా సమావేశమై.. క్యూర్ పరిధిలో చేపట్టాల్సిన ముఖ్యమైన పనులను గుర్తించి.. వాటిని అపెక్స్ గవర్నెన్స్ కౌన్సిల్‌కు సిఫార్సు చేయాలి. మూడు మున్సిపల్ కార్పొరేషన్ల మధ్య సమన్వయం నుంచి.. రోడ్లు, నీరు, విద్యుత్, ప్రజా రవాణా, పోలీసింగ్, పట్టణ ప్రణాళిక వంటి కీలక అంశాల వరకు.. అన్ని శాఖలను ఒకే సమన్వయ వ్యవస్థలోకి తీసుకురావడమే ఈ కొత్త విధానం ప్రధాన ఉద్దేశంగా ప్రభుత్వం చెబుతోంది.
మొత్తంగా చూస్తే.. హైదరాబాద్‌ను చుట్టుపక్కల పట్టణ ప్రాంతాలతో కలిపి ఒక సమగ్ర అర్బన్ రీజియన్‌గా అభివృద్ధి చేయడమే క్యూర్ చట్టం వెనుక ఉన్న ప్రధాన ఆలోచన. మరి ఈ కొత్త వ్యవస్థ కాగితాలపై కాకుండా.. క్షేత్రస్థాయిలో ఎంత వేగంగా అమలవుతుంది? హైదరాబాద్ భవిష్యత్ పట్టణ ప్రణాళికను ఇది ఎంతవరకు మార్చగలుగుతుందనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.







