జ్వరం వచ్చిన వెంటనే చాలామందికి వచ్చే సందేహాలు రెండే.. అన్నం తినవచ్చా? స్నానం చేయవచ్చా? ఈ రెండింటిపై ఎన్నో అపోహలు ఉన్నాయి. కానీ వైద్య నిపుణులు చెబుతున్న విషయాలను పరిశీలిస్తే.. జ్వరం వచ్చినప్పుడు ఆహారం, నీరు, పరిశుభ్రత విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటిస్తే శరీరం కోలుకోవడానికి సహాయపడుతుంది.
సాధారణంగా శరీర ఉష్ణోగ్రత 100.4 డిగ్రీల ఫారెన్‌హీట్.. అంటే 38 డిగ్రీల సెల్సియస్ లేదా అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని జ్వరంగా పరిగణిస్తారు. జ్వరంతో పాటు నీరసం, చలి, తలనొప్పి, చెమటలు వంటి లక్షణాలు కనిపించవచ్చు. అయితే జ్వరం అనేది శరీరంలో జరుగుతున్న మార్పునకు సంకేతం అంటారు..
ఇక జ్వరం వచ్చిందని ఆహారం పూర్తిగా మానేయడం సరైన పద్ధతి కాదు. ఆకలి ఉంటే మెత్తగా ఉడికించిన అన్నం, పప్పు, కిచిడీ, జావ, సూప్ వంటి సులభంగా జీర్ణమయ్యే ఆహారాన్ని తక్కువ పరిమాణాల్లో తీసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఒకేసారి ఎక్కువగా తినడం కంటే.. ఆకలిని బట్టి కొద్దికొద్దిగా తీసుకోవడం మంచిదని.. అయితే బలవంతంగా తినాల్సిన అవసరం లేదని సూచిస్తున్నారు..
ఇక జ్వరం వచ్చినప్పుడు చెమటలు లేదా వాంతులు, విరేచనాలు ఉంటే శరీరంలో నీరు తగ్గే అవకాశం ఉంటుంది. అందుకే నీరు, సూప్, మజ్జిగ వంటి ద్రవాలను తరచుగా తీసుకోవాలి. డీహైడ్రేషన్ ఉన్నప్పుడు వైద్యుల సూచన మేరకు ఓఆర్ఎస్ ఉపయోగించవచ్చు. కొబ్బరినీళ్లు తీసుకోవచ్చు కానీ అవే చికిత్స అని భావించకూడదని పేర్కొంటున్నారు.
మరోవైపు జ్వరం వచ్చిందని స్నానం పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. శరీర పరిస్థితి అనుకూలంగా ఉంటే గోరువెచ్చని నీటితో త్వరగా స్నానం చేయవచ్చు. అయితే చల్లటి నీటితో స్నానం చేయడం, వణుకు వచ్చేంతగా శరీరాన్ని చల్లబరచడం మాత్రం మంచిది కాదని ఆరోగ్యనిపుణులు సూచిస్తున్నారు.. అలాగే తీవ్రమైన నీరసం, తలతిరగడం లేదా నిలబడలేని పరిస్థితి ఉంటే మాత్రం బాత్‌రూమ్‌లో స్నానం చేయడం ప్రమాదకరం. అలాంటప్పుడు గోరువెచ్చని నీటితో శరీరాన్ని మెల్లగా తుడుచుకోవడం ఉత్తమం అని చెబుతున్నారు.
అందుకే జ్వరం వచ్చినప్పుడు అన్నం పూర్తిగా మానేయడం కానీ.. స్నానం చేయకపోవడం కానీ అవసరం లేదు. తేలికపాటి పోషకాహారం, తగినంత ద్రవాలు, విశ్రాంతి, పరిశుభ్రతతో పాటు.. జ్వరానికి కారణాన్ని గుర్తించి సరైన చికిత్స తీసుకోవడమే ముఖ్యం. జ్వరం ఎక్కువగా ఉండటం, కొన్ని రోజులు కొనసాగడం లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తీవ్రమైన నీరసం, గందరగోళం వంటి లక్షణాలు ఉంటే ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని ఆరోగ్య నిపుణులు తెలియచేస్తున్నారు..
ముఖ్య గమనిక: ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఇది నిపుణుల లేదా వైద్యుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించిన ఎలాంటి నిర్ణయాలైనా తీసుకునే ముందు ఖచ్చితంగా మీ డాక్టర్‌ను సంప్రదించాల్సిందిగా మనవి!..











