Spirituality

Spirituality: వినాయకుడికి ఈ మూడు సమర్పణలు ఎందుకు అంత ప్రీతికరం?..

రచన: Venu4 నిమిషాల పఠనం

ఎర్ర మందారం ద్వారా శక్తిని.. గరిక ద్వారా వినయాన్ని.. తెల్ల జిల్లేడు ద్వారా పవిత్రతను గణనాథుడి పాదాల వద్ద ఉంచండి.

వినాయక చవితి వచ్చిందంటే చాలు.. ప్రతి ఇంటా గణనాథుడి నామస్మరణతో పాటు రకరకాల పూలతో అలంకరణ కూడా కనిపిస్తుంది.. అయితే గణపయ్యకు పూలు సమర్పించడం కేవలం అలంకరణ కోసం మాత్రమే కాదు.. ప్రతి పుష్పం, ప్రతి పత్రం వెనుక ఒక ఆధ్యాత్మిక సంకేతం దాగి ఉందని సనాతన ధర్మ సంప్రదాయం చెబుతోంది.

ఎర్ర మందారం, గరిక, తెల్ల జిల్లేడు.. ఈ మూడింటికీ గణపతి ఆరాధనలో ప్రత్యేక స్థానం ఉంది. ముందుగా ఎర్ర మందారం.. గణపతిని ఎరుపు వర్ణంతో అనుసంధానించే సంప్రదాయం ఉంది. యోగ పరంపరలో వినాయకుడు మూలాధార చక్రానికి అధిపతిగా భావించబడతాడు. ఎరుపు రంగు శక్తి, చైతన్యం, స్థిరత్వానికి ప్రతీకగా చెప్పబడుతుంది. అందుకే ఎర్ర మందారాన్ని గణనాథుడికి సమర్పించడం అంటే.. మనలోని అస్థిరతను తొలగించి, సంకల్పబలాన్ని పెంచుకోవాలనే అంతరార్థంతో స్వామిని ప్రార్థించడం అనే ఆధ్యాత్మిక భావన ఉందని అంటారు.

ఇక గరిక.. గణపతి పూజలో అత్యంత విశిష్టమైన సమర్పణ. సాధారణంగా 21 గరికలతో స్వామిని పూజించే ఆచారం ఉంది. అలాగే పుష్పాల కంటే కూడా గణపతికి గరిక అంటే చాలా ఇష్టమని చెబుతారు. మూడు లేదా ఐదు ఆకులు కలిపి ఉన్న 21 గరికల కట్టలతో స్వామివారిని పూజిస్తే ఎలాంటి కష్టాలైనా చిటికెలో తొలగిపోతాయనే నమ్మకం ఉంది. దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఆడంబరం అవసరం లేదని.. స్వచ్ఛమైన భక్తి, వినయం, ఆత్మసమర్పణే ముఖ్యమని గరిక సమర్పణ సూచిస్తుంది.

ఇక తెల్ల జిల్లేడు. కొన్ని సంప్రదాయాల్లో జిల్లేడు మొక్కను గణపతి ఆరాధనతో ప్రత్యేకంగా అనుసంధానిస్తారు. తెల్లని పుష్పం పవిత్రతకు, ప్రశాంతతకు ప్రతీకగా భావించబడుతుంది. అందుకే జిల్లేడు పూలు లేదా పత్రాలతో వినాయకుడిని పూజించడం ద్వారా మనసులోని కలతలను పక్కనపెట్టి.. శాంతి, శుభం, సద్బుద్ధిని కోరుకోవాలనే ఆధ్యాత్మిక సందేశం ఇందులో కనిపిస్తుంది.

అందుకే ఈ వినాయక చవితికి పూలను కేవలం అలంకరణగా కాకుండా.. వాటి వెనుక ఉన్న ఆధ్యాత్మిక భావాన్ని తెలుసుకుని సమర్పించండి. ఎర్ర మందారం ద్వారా శక్తిని.. గరిక ద్వారా వినయాన్ని.. తెల్ల జిల్లేడు ద్వారా పవిత్రతను గణనాథుడి పాదాల వద్ద ఉంచండి.

గమనిక: ఇక్కడ అందించిన వివరాలు కేవలం సాంప్రదాయ పురాణ విశ్వాసాలు మరియు ఆధ్యాత్మిక భావనల ఆధారంగా ఇవ్వబడ్డాయి. వీటిని కేవలం మతపరమైన విశ్వాసాల కోణంలోనే చూడాలి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత రంగ నిపుణులను సంప్రదించడం మంచిది.

#Spirituality#Lord Ganesha#three types#flowers#Red hibiscus#Bermuda grass#white crown flower
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి