TG Politics : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్లకు పైగా సమయం ఉన్నప్పటికీ.. రాజకీయ వర్గాల్లో అప్పుడే ఎన్నికల వేడి తారస్థాయికి చేరినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంగా ప్రధాన పార్టీలు ప్రజల నాడి పట్టుకునేందుకు చేపడుతున్న అంతర్గత సర్వేలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ప్రభుత్వం ఏర్పాటై వేయి రోజుల మైలురాయి దాటుతున్న వేళ.. అటు ప్రతిపక్ష బీఆర్ఎస్, ఇటు అధికార కాంగ్రెస్ పార్టీలు పోటాపోటీగా నియోజకవర్గాల్లో ఒకరు డిజిటల్ సర్వే నిర్వహిస్తే, మరొకరు సీక్రెట్‌గా గ్రౌండ్ రియాలిటీని శోధిస్తున్నాయి.
బీఆర్ఎస్ ‘హైటెక్’ సర్వే.. టార్గెట్ రేవంత్ సర్కారే
ఈ ముందస్తు రాజకీయ కసరత్తులో బీఆర్ఎస్ అధిష్టానం ఒక అడుగు ముందే ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా సమాచారం లీక్ కాకుండా ఉండేందుకు అత్యంత పకడ్బందీగా ‘ఆన్‌లైన్ లింకుల’ ద్వారా సర్వే నిర్వహిస్తోంది. జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో ప్రతి మండలానికి రాజకీయాలతో సంబంధం లేని ఒక ప్రత్యేక అబ్జర్వర్‌ను రంగంలోకి దించింది. జిల్లావ్యాప్తంగా దాదాపు 30 మందితో కూడిన ప్రత్యేక బృందాలు ఈ పనిలో నిమగ్నమయ్యాయి.
ఒక్కో మండలం నుంచి 50 మంది చొప్పున, ఒక్కో నియోజకవర్గంలో కనీసం 500 మంది ఓటర్ల నుంచి ఫీడ్‌బ్యాక్ సేకరిస్తున్నారు. ఈ సర్వేలో అడుగుతున్న 5 కీలక ప్రశ్నల్లో 3 ప్రశ్నలు కేవలం సీఎం రేవంత్ రెడ్డి పాలన, కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు తీరుపైనే ఉండటం విశేషం. అంతేకాకుండా ప్రతి మూడు నెలలకోసారి ఈ సర్వే రిపోర్టులను అప్‌డేట్ చేస్తూ.. క్షేత్రస్థాయిలో ప్రజల మూడ్ ఎలా మారుతుందో ఎప్పటికప్పుడు గులాబీ బాస్ ట్రాక్ చేస్తున్నారట.
కాంగ్రెస్ సిట్టింగులకు సర్వే సెగ..
మరోవైపు అధికార కాంగ్రెస్ పార్టీ సైతం తమ సొంత ఎమ్మెల్యేల పనితీరుపై రహస్యంగా సర్వేలు చేయిస్తోంది. రాబోయే ఎన్నికల్లో కేవలం ప్రజల్లో ఆదరణ, మంచి రిపోర్ట్ ఉన్నవారికే 'బి-ఫామ్' దక్కుతుందని అధిష్టానం ఇప్పటికే సంకేతాలు ఇచ్చిన నేపథ్యంలో ఈ సర్వే ఫలితాలు ఎమ్మెల్యేల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి.
తాజా సర్వేల్లో వెల్లడైన ప్రాథమిక వివరాల ప్రకారం.. ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యేల పనితీరుపై దాదాపు 40 శాతం మంది ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. మరో 50 శాతం మంది ఈసారి సిట్టింగులను మార్చి కొత్త అభ్యర్థులకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. కేవలం పనితీరు ఆధారంగానే టికెట్లు కేటాయిస్తామని పార్టీ తేల్చిచెప్పడంతో సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో గుబులు మొదలైంది.
అభ్యర్థుల పేర్లతోనే డైరెక్ట్ టెస్టింగ్
ఈ సర్వేల్లో మరో ఆసక్తికర అంశం ఏంటంటే.. కేవలం పార్టీల గురించే కాకుండా రాబోయే ఎన్నికల్లో నిలబెట్టే గెలుపు గుర్రాల పేర్లను కూడా ప్రస్తావిస్తూ ప్రజల అభిప్రాయాలను తీసుకుంటున్నారట. ఉదాహరణకు మహబూబాబాద్ నియోజకవర్గంలో మురళీ నాయక్, శంకర్ నాయక్, మాలోత్ కవిత వంటి నేతల్లో ఎవరిని బరిలోకి దింపితే విజయావకాశాలు మెరుగ్గా ఉంటాయనే సమీకరణాలపై అంచనాలు వేస్తున్నారు. పాత మాజీల కంటే సరికొత్త ముఖాలకు టికెట్లు ఇస్తేనే మెరుగైన ఫలితాలు వస్తాయన్న మెజారిటీ ఫీడ్‌బ్యాక్ పార్టీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ఎన్నికలకు ఇంకా సుదీర్ఘ సమయం ఉన్నప్పటికీ, మహబూబాబాద్ అడ్డాగా కాంగ్రెస్-బీఆర్ఎస్ పార్టీల మధ్య సాగుతున్న ఈ సైలెంట్ సర్వే వార్ రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ సమీకరణాలను ఏ విధంగా మార్చబోతోందో వేచిచూడాల్సిందే.








