దునియా

Xi Jinping : ‘‘బలవంతుడిదే రాజ్యం అంటే కుదరదు..’’ బ్రిక్స్ వేదికగా అమెరికాకు జిన్‌పింగ్ వార్నింగ్!

రచన: Mahesh5 నిమిషాల పఠనం

Xi Jinping : అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాల్లో పెత్తనం చెలాయిస్తున్న అగ్రరాజ్యాల ధోరణిపై చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ బ్రిక్స్ వేదికగా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. న్యూఢిల్లీలో ముగిసిన బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు వేదికపై ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు ప్రపంచ దౌత్య వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

Xi Jinping : అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాల్లో పెత్తనం చెలాయిస్తున్న అగ్రరాజ్యాల ధోరణిపై చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ బ్రిక్స్ వేదికగా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. న్యూఢిల్లీలో ముగిసిన బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు వేదికపై ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు ప్రపంచ దౌత్య వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. అంతర్జాతీయ క్రమాన్ని ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థతో పోల్చుతూ.. నియమ నిబంధనలు లేని ప్రపంచం సిగ్నల్స్ లేని నాలుగు రోడ్ల కూడలి లాంటిదని, అటువంటి చోట భారీ ప్రమాదాలు, తీవ్ర గందరగోళం తప్పవని హెచ్చరించారు.

బలవంతుడిదే రాజ్యం అంటే నడవదు

పాశ్చాత్య దేశాలు, ప్రత్యేకించి అమెరికా అనుసరిస్తున్న ఏకపక్ష ఆధిపత్య పోకడలను జిన్‌పింగ్ పరోక్షంగా ఎండగడుతూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆధునిక ప్రపంచంలో ‘బలవంతుడిదే రాజ్యం’ అనే ఆటవిక భావన ఇక ఎంతమాత్రం చెల్లదని కుండబద్దలు కొట్టారు. ఒక దేశం ఎంత పెద్దది? ఎంత సంపన్నమైనది? ఎంత సైనిక బలం ఉంది? అనే అంశాలతో సంబంధం లేకుండా.. అంతర్జాతీయ వేదికపై ప్రతి దేశానికీ సమానమైన హక్కు, సమానమైన వాటా ఉండాలని స్పష్టం చేశారు. అంతర్జాతీయ నియమావళిని ఏ ఒక్క దేశమో తమ స్వప్రయోజనాల కోసం నిర్దేశించకూడదని, అన్ని దేశాలు కలిసే నిబంధనలను తయారు చేయాలని పిలుపునిచ్చారు.

గ్లోబల్ సౌత్ ఐక్యతకు సరికొత్త అధ్యాయం

అభివృద్ధి చెందుతున్న, పేద దేశాలైన ‘గ్లోబల్ సౌత్’ దేశాలన్నీ ఒక్కతాటిపైకి రావాల్సిన చారిత్రక సమయం ఆసన్నమైందని జిన్‌పింగ్ పేర్కొన్నారు. గ్లోబల్ సౌత్ కలయికలో సరికొత్త అధ్యాయం లిఖించేందుకు బ్రిక్స్ కూటమి శక్తివంతమైన వారధిగా నిలవాలని ఆకాంక్షించారు. ప్రపంచ సరఫరా గొలుసులు కొందరి గుత్తాధిపత్యంలో నలిగిపోకుండా కాపాడటంతో పాటు, సమగ్ర మార్కెట్ వ్యవస్థను కాపాడుకోవడానికి భాగస్వామ్య దేశాలు పరస్పరం సహకరించుకోవాలని పిలుపునిచ్చారు.

5 సూత్రాల వ్యూహం..

అంతర్జాతీయ వ్యవస్థను సమూలంగా బలోపేతం చేసేందుకు జిన్‌పింగ్ ఈ సందర్భంగా ఐదు సూత్రాల ప్రణాళికను బ్రిక్స్ ముందుంచారు. అవి.. వాణిజ్య విస్తరణ, ప్రపంచ తయారీ రంగం (మ్యానుఫ్యాక్చరింగ్) పరిరక్షణ, పెట్టుబడుల ప్రవాహం, సాంకేతిక సహకారం, ఉమ్మడి మార్కెట్ అనుసంధానం. వీటితో పాటు ఐక్యరాజ్యసమితి ప్రాధాన్యతను ఎవరూ తగ్గించలేరని, ప్రపంచ వ్యవహారాల్లో ఐరాస నిర్ణయాధికారానికి అన్ని దేశాలు కట్టుబడి ఉండాలని జిన్‌పింగ్ గుర్తుచేశారు. నిబంధనలు అందరికీ ఒకేలా వర్తించినప్పుడే ప్రపంచానికి భద్రత లభిస్తుందని, బడా దేశాలు తమ ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తే గ్లోబల్ వ్యవస్థే కుప్పకూలుతుందని ఢిల్లీ వేదికగా ఆయన చేసిన వ్యాఖ్యలు సరికొత్త చర్చకు దారితీశాయి.

#Xi Jinping#BRICS#BRICS Summit#China President Xi Jinping#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి