Nandus World: సోషల్ మీడియాలో వేలల్లో లైకులు, లక్షల్లో ఫాలోవర్లు ఉంటే చాలు.. కళ్లు మూసుకుని నమ్మేస్తున్న అమాయకత్వాన్ని కొందరు పక్కాగా క్యాష్ చేసుకుంటున్నారు. విదేశాలకు వెళ్లాలి, డాలర్లు సంపాదించాలి, జీవితాన్ని మార్చుకోవాలన్న నిరుద్యోగుల ఆశలను ఆసరాగా చేసుకుని యూట్యూబ్ వేదికగా భారీ మోసానికి తెరలేపిన వైనం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది. యూకే కేంద్రంగా 'నందుస్ వరల్డ్' పేరుతో యూట్యూబ్ వీడియోలు చేస్తూ పాపులర్ అయిన తెలుగు ఇన్‌ఫ్లుయెన్సర్ రమానందన చుట్టూ ఇప్పుడు పోలీసుల ఉచ్చు బిగుస్తోంది.
లక్షల్లో వసూళ్లు.. చివరికి హ్యాండ్
తనకున్న సోషల్ మీడియా క్రేజ్‌ను ఉపయోగించి లండన్‌లో ఉద్యోగాలు, వీసాలు ఇప్పిస్తామంటూ ఆమె పక్కా ప్లాన్‌తో వల విసిరినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆమె చెప్పిన మాటలను నిజమని నమ్మి పలువురు బాధితులు లక్షల రూపాయలను ఆమె కుటుంబానికి చెందిన కన్సల్టెన్సీకి ముట్టజెప్పారు. కట్ చేస్తే.. చేతికి డబ్బులు అందాక ఆమె అసలు రంగు బయటపడింది. ఉద్యోగం రాలేదు, వీసా ఊసే లేదు, చివరకు ఫోన్ చేస్తే రెస్పాన్స్ కరువైంది. దీంతో తాము మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసుల గడప తొక్కారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పీఎస్‌లో ఓ బాధితుడు ఇచ్చిన కంప్లైంట్‌తో ఈ దందా మొదటిసారి బయటపడింది.
లుకౌట్ నోటీసులు.. హైదరాబాద్‌లో అదుపులోకి
కేసు ఫైల్ కాగానే రమానందన విదేశాలకు జంప్ కావడంతో పోలీసులు ఆమెపై ‘లుకౌట్ నోటీసులు’ జారీ చేశారు. ఇటీవల ఆమె హైదరాబాద్‌కు చేరుకోగానే సమాచారం అందుకున్న ఇబ్రహీంపట్నం పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారణకు నోటీసులు అందజేశారు. దీంతో లాయర్లతో కలిసి పోలీస్ స్టేషన్‌కు వచ్చిన రమానందనను సీఐ సుబ్రహ్మణ్యం దాదాపు మూడు గంటల పాటు విచారించారు. అయితే ఈ విచారణలో ఆమె మొత్తం నెపాన్ని తన భర్తపైకి నెట్టేసే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. తనకేమీ తెలియదని, లావాదేవీలన్నీ తన భర్తే చూసుకున్నారని తప్పించుకునే సమాధానాలు ఇచ్చారు. స్టేషన్ నుంచి బయటకు వచ్చాక మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. తనపై తప్పుడు వార్తలు రాస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు.
అద్దంకిలోనూ అదే తరహా మోసం
ఒక వైపు ఇబ్రహీంపట్నం రచ్చ కొనసాగుతుండగానే ప్రకాశం జిల్లా అద్దంకిలో మరో బాధితుడు తెరపైకి వచ్చారు. పెరయ్యపాలెంకు చెందిన శ్రీనివాసరావు అనే వ్యక్తి తన కోడలికి లండన్‌లో ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి రమానందన కుటుంబం ఏకంగా రూ.10 లక్షలకు పైగా వసూలు చేసి చేతులెత్తేసిందని అద్దంకి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అద్దంకి పోలీసులు సైతం కేసు నమోదు చేసి, రమానందనకు సెక్షన్ 353 BNSS కింద నోటీసులు జారీ చేశారు.
వరుస కేసులతో ఇరుక్కున్న రమానందనను సెప్టెంబర్ 16న ఇబ్రహీంపట్నం పోలీసులు, సెప్టెంబర్ 17న అద్దంకి పోలీసులు విచారించనున్నారు. ఎంతమంది దగ్గర ఎన్ని కోట్లు కొల్లగొట్టారు? ఆ డబ్బంతా ఎక్కడికి మళ్లించారు? ఈ ఫ్రాడ్ వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. అందమైన వీడియోలు, విదేశీ లైఫ్‌స్టైల్ చూసి గుడ్డిగా నమ్మితే నిలువునా మునిగిపోతామని ఈ ఘటన మరోసారి హెచ్చరిస్తోంది.








