Indiramma Houses Scheme: సొంతింటి కలను సాకారం చేసుకునేందుకు ఎదురుచూస్తున్న పేద, మధ్యతరగతి వర్గాలకు తెలంగాణ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఎల్‌ఐజీ గృహాల లబ్ధిదారులకు శాంక్షన్ లెటర్లను ఈ వారంలోనే అందజేయనున్నట్లు తెలంగాణ హౌసింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ పి.వి.గౌతం తాజాగా స్పష్టం చేశారు. దీంతో దరఖాస్తు చేసుకుని ఎదురుచూస్తున్న వేలాది కుటుంబాల్లో ఆనందం వెల్లివిరిసింది.
5,521 మందికే గ్రీన్ సిగ్నల్!
ఇళ్ల కేటాయింపుల ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు క్షేత్రస్థాయి పరిశీలనను పకడ్బందీగా పూర్తి చేశారు. పారదర్శక పద్ధతిలో నిర్వహించిన కంప్యూటరైజ్డ్ లాటరీ ద్వారా తొలుత 7,340 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. అయితే ఎంపికైన ప్రతి ఒక్కరికీ ఇళ్లు ఇవ్వకుండా.. అధికారులు స్వయంగా రంగంలోకి దిగి క్షేత్రస్థాయిలో విచారణ జరిపారు.
ఇప్పటివరకు 6,643 మంది ఇళ్లను, వారి ఆర్థిక స్థితిగతులను నేరుగా పరిశీలించగా.. అందులో అర్హత కలిగిన 5,521 మందిని మాత్రమే ఫైనల్ లబ్ధిదారులుగా నిర్ధారించారు. మిగిలిన దరఖాస్తుల స్క్రూటినీ ప్రక్రియ కూడా వేగంగా ముగింపు దశకు చేరుకుందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ నేరుగా ప్రభుత్వ అనుమతి పత్రాలు అందుతాయని అధికారులు స్పష్టం చేశారు.
దళారులను నమ్మితే నిలువునా మునుగుతారు..
ఇదే సమయంలో హౌసింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ పి.వి.గౌతం దరఖాస్తుదారులకు అత్యంత కీలకమైన హెచ్చరిక జారీ చేశారు. ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుల్లో ఎలాంటి పైరవీలకు, మధ్యవర్తుల ప్రమేయానికి తావులేదని కుండబద్దలు కొట్టారు. లాటరీ నుంచి గ్రౌండ్ లెవల్ వెరిఫికేషన్ వరకు ప్రతీ దశను ప్రభుత్వ యంత్రాంగం నిక్కచ్చిగా పూర్తి చేసిందని గుర్తుచేశారు.
‘‘ప్రభుత్వ ఇళ్లు ఇప్పిస్తామంటూ వచ్చే దళారులను, బ్రోకర్లను అస్సలు నమ్మకండి.. ఎవరికీ ఒక్క రూపాయి కూడా లంచంగా ఇవ్వొద్దు’’ అని వైస్ ఛైర్మన్ స్పష్టంగా చెప్పారు. ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే వెంటనే అధికారులకు లేదా పోలీసులకు కంప్లైంట్ చేయాలని సూచించారు. అర్హత ఉన్న ప్రతి పేదవాడికి ఎవరి సిఫారసు లేకుండానే పారదర్శకంగా పక్కా ఇళ్లు అందుతాయని చెప్పారు.







