ఏపీ

Tirupati: శ్రీవారి దర్శనానికి వెళ్తే ఇదేం పరిస్థితి బాబోయ్!!..

రచన: Venu5 నిమిషాల పఠనం

అపరిశుభ్రంగా ఉన్న రెండు హోటళ్లను సీజ్ చేశారు. కపిలతీర్థం సమీపంలోని హోటళ్లలోనూ తనిఖీలు నిర్వహించగా.. పారిశుద్ధ్య లోపాలు, మురుగునీటి కాలువల్లో వ్యర్థాలు వేయడం, కాలువల ప్రవాహానికి అడ్డంకులు కల్పించడం వంటి సమస్యలు గుర్తించారు.

తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చుకుని తిరుపతికి వస్తారు. గంటల తరబడి ప్రయాణం చేసి, భారీ రద్దీలో క్యూలైన్లలో నిలబడి, ఎన్నో ఇబ్బందులను దాటుకుని కలియుగ దైవం దర్శనం చేసుకోవాలని ఆశపడతారు. కానీ తిరుపతిలో కాలు పెట్టింది మొదలు.. భక్తులకు అడుగడుగునా మరో సమస్య ఎదురవుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

ముఖ్యంగా బ్రహ్మోత్సవాల వేళ భక్తుల రద్దీని ఆసరాగా చేసుకుని కొందరు వ్యాపారులు అధిక ధరలకు వస్తువులు విక్రయిస్తున్నారనే ఫిర్యాదులు అధికారుల దృష్టికి వచ్చాయి. గరిష్ఠ చిల్లర ధర అంటేనే ప్యాకెట్‌పై ముద్రించిన ఎంఆర్పీ. కానీ తిరుపతిలోని కొన్ని దుకాణాల్లో ఆ ధరకు తిలోదకాలు ఇస్తున్న పరిస్థితులు బయటపడ్డాయి. బస్టాండ్‌లోని ఓ దుకాణంలో రూ.20గా ఉన్న నీటి బాటిల్‌కు ఏకంగా రూ.30 వసూలు చేసినట్లు అధికారులు గుర్తించారు.

అడిగిన ధర చెల్లిస్తేనే బాటిల్ ఇస్తామని చెప్పడంతో నగరపాలక సిబ్బంది ఆ మొత్తాన్ని చెల్లించి వెళ్లిపోయారు. ఆ తర్వాత రంగంలోకి దిగిన నగరపాలక, తూనికలు–కొలతలు, ఆహార భద్రతాధికారులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. బస్టాండ్ పరిసరాల్లో తనిఖీ చేసిన ఆరు దుకాణాల్లోనూ అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు గుర్తించి, ఆధారాలతో సహా వ్యాపారులను హెచ్చరించారు. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులను దోచుకుంటే సహించేది లేదని అధికారులు స్పష్టం చేశారు.

ఈ క్రమంలో నాసిరకం వస్తువులు అంటగట్టడం, ఒక్కో వస్తువుపై రూ.5 నుంచి రూ.10 వరకు అదనంగా వసూలు చేయడం వంటి ఫిర్యాదులపైనా దృష్టి సారించారు. ఇక ధరల దోపిడీతో పాటు ఆహార నాణ్యత, పారిశుద్ధ్యంపైనా అధికారులు దృష్టి పెట్టారు. బ్రహ్మోత్సవాలకు వేలాదిగా తరలివచ్చే భక్తులకు పరిశుభ్రమైన ఆహారం అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, నగరపాలక కమిషనర్ ఆదేశించారు. దీంతో వైద్య, పశువైద్య, ఆహార భద్రత, తూనికలు, కొలతల శాఖల అధికారులు బస్టాండ్, పరిసర ప్రాంతాల్లోని హోటళ్లను తనిఖీ చేశారు.

అపరిశుభ్రంగా ఉన్న రెండు హోటళ్లను సీజ్ చేశారు. కపిలతీర్థం సమీపంలోని హోటళ్లలోనూ తనిఖీలు నిర్వహించగా.. పారిశుద్ధ్య లోపాలు, మురుగునీటి కాలువల్లో వ్యర్థాలు వేయడం, కాలువల ప్రవాహానికి అడ్డంకులు కల్పించడం వంటి సమస్యలు గుర్తించారు. కొన్ని చోట్ల ఎలుకలు, బొద్దింకలు సంచరిస్తున్నట్లు గుర్తించి జరిమానాలు, నోటీసులు జారీ చేశారు. సుమారు 500 కిలోల ఆహార వ్యర్థాలను స్వాధీనం చేసుకుని డంపింగ్ యార్డుకు తరలించారు.

శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఆధ్యాత్మిక ప్రశాంతతతో పాటు కనీస సౌకర్యాలు, న్యాయమైన ధరలు, పరిశుభ్రమైన ఆహారం అందించడం అధికారుల బాధ్యత. బ్రహ్మోత్సవాల వేళ భక్తుల రద్దీని అవకాశంగా మార్చుకుని అధిక ధరలు వసూలు చేసే వారిపై చర్యలు ఇలాగే కొనసాగించాలని భక్తులు కోరుతున్నారు.

#Tirupati#chittoor#exorbitant#prices#goods#bus-stand#Lord Venkateshwara
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి