ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఒక వైపు అతివృష్టి... మరొక వైపు అనావృష్టి.. ఒక చోట ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లు కుండపోత వర్షాలు, ముంచెత్తుతున్న వరదలు... వేరొక చోట చుక్క నీరు లేక నెర్రలు బారిన నేలలు, ఎండిపోతున్న పంటలు. పర్యావరణ సమతుల్యత దెబ్బతిని, మానవ తప్పిదాల వల్ల భూమి వేడెక్కి వాతావరణం విపరీతంగా మారిపోతోంది. ఈ వాతావరణ అత్యవసర పరిస్థితిని అధిగమించకపోతే, రాబోయే తరాలకు తీవ్ర ఆహార, నీటి ఎద్దడి తప్పదనే ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి..
మరోవైపు వినాయక చవితి పర్వదినాన భాగ్యనగరాన్ని వరుణుడు పలకరించాడు. తెల్లవారుజామున ఒక్కసారిగా దట్టమైన మేఘాలు కమ్ముకుని, పలు ప్రాంతాల్లో వర్షం భారీగా కురవడంతో హైదరాబాద్ లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉదయం నుంచే చల్లటి ఈదురుగాలులతో పాటు కురిసిన వర్షంతో నగర ప్రజలకు ఉక్కపోత నుంచి కాస్త ఉపశమనం లభించింది.
అయితే మరోవైపు భారీ వర్షంతో పలు ప్రాంతాల్లో రహదారులపై నీరు నిలిచి వాహనదారులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, బేగంపేట్, ఫిల్మ్‌నగర్, మాదాపూర్, మణికొండ, షేక్‌పేట్, మియాపూర్, ఎల్బీనగర్, దిల్‌సుఖ్‌నగర్, కోఠి, అబిడ్స్, లక్డీకాపూల్, నాంపల్లి, సికింద్రాబాద్, నాగోల్, ఉప్పల్, హయత్‌నగర్‌తో పాటు నగరంలోని పలు ప్రాంతాల్లో వర్ష ప్రభావం కనిపించింది.
ఇప్పటికే నగర పరిసరాల్లోని కొన్ని ప్రాంతాల్లో 40 నుంచి 50 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైనట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇక ఈ వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరడంతో పాటు కొన్ని ప్రధాన రహదారులపై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఉదయం కార్యాలయాలకు, ఇతర పనులకు వెళ్లే సమయంలో వర్షం కురవడంతో వాహనదారులు అప్రమత్తంగా ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
మరోవైపు వినాయక చవితి సందర్భంగా నగరంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గణేశ్ మండపాల వద్ద కూడా వర్షం ప్రభావం కనిపించింది. నిర్వాహకులు మండపాల్లోకి వర్షపు నీరు చేరకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తెలంగాణలో రానున్న రోజుల్లోనూ అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే సూచించింది. హైదరాబాద్‌లో కూడా మేఘావృత వాతావరణంతో పాటు వర్షపు జల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
ఈ నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప లోతట్టు ప్రాంతాలు, నీరు నిలిచిన రహదారుల వైపు వెళ్లకుండా ప్రజలు జాగ్రత్తగా ఉండటం మంచిదని, ముఖ్యంగా వినాయక మండపాలకు వెళ్లే భక్తులు వాతావరణ పరిస్థితులను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మొత్తానికి తెలవారు జామున కురిసిన భారీ వర్షం మాత్రం పలు ప్రాంతాల్లో జనజీవనాన్ని ప్రభావితం చేసింది..








