కృత్రిమ మేధ (AI) అభివృద్ధి వేగం, దాని భద్రతపై అంతర్జాతీయ టెక్నాలజీ ప్రపంచంలో జరుగుతున్న తీవ్రమైన చర్చలో మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల భాగమయ్యారు. సూపర్‌ఇంటెలిజెన్స్ రూపకల్పనలో మానవ నియంత్రణ, మానవాళి శ్రేయస్సే అత్యంత ప్రాథమిక సూత్రాలుగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో ఇప్పటికే ఎలాన్ మస్క్, శామ్ ఆల్ట్‌మన్ వంటి టెక్ దిగ్గజాలు వ్యక్తం చేసిన ఆందోళనలకు ఆయన తన పూర్తి మద్దతు ప్రకటిస్తూ సోషల్ మీడియా వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు.
సత్య నాదెళ్ల ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ.. ‘మనం నిర్మిస్తున్న ఏఐ మానవాళికి ఉపయోగపడకపోయినా, అది మానవ పర్యవేక్షణ, నియంత్రణలో లేకపోయినా అలాంటి సాంకేతికతను అభివృద్ధి చేయడం పూర్తిగా అనవసరం’ అని కుండబద్దలు కొట్టారు. సూపర్‌ఇంటెలిజెన్స్ సాధనలో భద్రతా ప్రమాణాలను రూపొందించడానికి ఆచితూచి అడుగులు వేయాల్సిన అవసరాన్ని ఆయన సమర్థించారు. భద్రతా సూత్రాలను ఆచరణలో పెట్టేందుకు 'ఎంబెడెడ్ ఎవాల్యుయేటర్లు' (వ్యవస్థలోనే అంతర్భాగంగా ఉండే మదింపుదారులు) వంటి ఆధునిక పద్ధతులను స్వాగతిస్తున్నట్లు తెలిపారు.
ఇటీవల ఆంత్రోపిక్ సీఈఓ డారియో అమోదీ ఏఐ సామర్థ్యాల అభివృద్ధి వేగాన్ని తగ్గించాలని, లేదంటే మనుషుల ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ వాదనకు ఓపెన్‌ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్, ఎక్స్‌ఏఐ అధినేత ఎలాన్ మస్క్‌లు మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. ఇప్పుడు సత్య నాదెళ్ల కూడా వీరితో గొంతు కలపడంతో ఏఐ నిబంధనలపై స్పష్టత వస్తోంది. తమ మైక్రోసాఫ్ట్ ఎంఏఐ (MAI) మోడళ్ల కోసం ప్రత్యేక ప్రవర్తనా నియమావళిని (Code of Conduct) తీసుకొచ్చి ప్రజల అభిప్రాయ సేకరణకు పెడతామని ఆయన ఈ సందర్భంగా సూచనప్రాయంగా వెల్లడించారు.
ఏఐ వల్ల లభించే ప్రయోజనాలు కేవలం కొన్ని కార్పొరేట్ సంస్థలకే పరిమితం కాకుండా సమాజంలోని అందరికీ సమంగా అందాలని నాదెళ్ల అభిప్రాయపడ్డారు. ప్రతి సంస్థ తమ సొంత ఏఐ మోడళ్లను నిర్మించుకునే స్వేచ్ఛ ఉండాలని, ఏ ఒక్క ఏఐ ప్రొవైడర్‌పైనా ఆధారపడే పరిస్థితి రాకూడదని ఆకాంక్షించారు. ప్రస్తుతం ఏఐ అభివృద్ధి వేగాన్ని తగ్గించడంపై పరిశ్రమ స్థాయిలో కచ్చితమైన ఒప్పందాలు జరగకపోయినప్పటికీ, ప్రపంచ టెక్ దిగ్గజాల మధ్య సాగుతున్న ఈ చర్చలు భవిష్యత్తు సురక్షిత ఏఐకి బాటలు వేస్తాయని భావిస్తున్నారు.









