శంషాబాద్‌లో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ప్రయివేటు ట్రావెల్ బస్సు అదుపు తప్పి హోటల్‌లోకి దూసుకెళ్లినట్టు సమాచారం. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. 10 మందికి పైగా గాయాలు అయినట్టు తెలుస్తోంది. స్థానికుల కథనం ప్రకారం.. శంషాబాద్ - బెంగళూరు జాతీయ రహదారి మీద హైదరాబాద్ నుంచి ప్రయాణిస్తున్న ఓ కంటైనర్ లారీ అకస్మాత్తుగా అదుపుతప్పి డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది.
అధికవేగమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.ఈ ప్రమాదంలో లారీ బోల్తా పడగా.. అదే సమయంలో ఎదురుగా వస్తున్న ప్రయివేటు ట్రావెల్స్ బస్సు ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయింది. అదుపుతప్పిన బస్సు రోడ్డు పక్కన నిలిపిన పలు వాహనాలు, ఓ ద్విచక్రవాహనాన్ని ఢీకొని పక్కనే ఉన్న హోటల్‌లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో హోటల్‌లో ఒక్కసారిగా భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అక్కడి నుంచి దూరంగా పరుగులు తీశారు.
అనంతరం స్థానికులు వెంటనే స్పందించి మంటలను ఆర్పివేయడంతో పెను ప్రమాదం తప్పింది. మంటలు ఎగసిపడిన సమయంలో బస్సులో ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం.ఒకవేళ ఆ మంటలు బస్సుకు వ్యాపించి ఉంటే ఘోరమైన ప్రమాదం జరిగేది. కాగా, ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా.. 10 మందికి పైగా ప్రయాణికులు, స్థానికులకు గాయాలయ్యాయి. వారిలో మరో ఇద్దరి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రమాదానికి సంబంధించిన సమాచారం అందుకున్న శంషాబాద్ పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన వ్యక్తి వివరాలు సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకునిి డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. ప్రస్తుతం ప్రమాదం జరిగిన చోట సహాయక చర్యలు కొనసాగుతున్నట్టు తెలుస్తోంది.









