వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షాలు తెలిపారు. ‘విఘ్నాలను తొలగించి.. విజయాలను అందించే విఘ్నేశ్వరుని ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆకాంక్షిస్తూ, పవిత్రమైన "వినాయక చవితి" సందర్భంగా ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు.
ఆదిదేవుడైన గణనాథుని కరుణాకటాక్షాలతో ప్రతి ఇంటా సుఖశాంతులు, ఆనందం, ఐశ్వర్యం వెల్లివిరియాలని, ప్రతి కుటుంబం ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలి. సమాజంలో సౌభ్రాతృత్వం, సద్భావన, మానవతా విలువలు మరింత పరిఢవిల్లాలి. సకల సంకల్పాలకు విఘ్నాలు తొలగించి, మన అడుగులకు విజయబాటలు వేయాలని.. జ్ఞానాన్ని, ధైర్యాన్ని, సత్ప్రవర్తనను ప్రసాదించాలని ఆదిపూజ్యుడైన ఆ విఘ్నేశ్వరుడిని ప్రార్థిద్దాం. వినాయక నవరాత్రి ఉత్సవాలు అత్యంత శోభాయమానంగా, భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలి’ అంటూ సీఎంవో కార్యాలయం సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది.
ఇదిలాఉండగా, రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా గణేశ్ మండపాల నిర్వాహకులు, కీలక శాఖల అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే.ఈ గణేశ నవరాత్రులు చాలా ప్రశాంతంగా జరగాలని, ఎలాంటి శాంతిభద్రతా సమస్యలు రాకుండా చూడాలని పోలీసులను ఆదేశించారు. హైదరాబాద్ నగరం ప్రశాంతంగా ఉంటేనే పెట్టుబడులు వస్తాయని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
గణేశ్ మండప నిర్వాహకులు ఏదైనా సమస్యల ఉంటే పోలీసులు, అధికారులతో సమన్వయం చేసుకుని ప్రశాంత వాతావరణంలో పండుగను జరుపుకోవాలని కీలక ఆదేశాలు ఇచ్చారు.ఇక నేడు ఖైరతాబాద్ బడా గణేశ్ దర్శనం కోసం సీఎం రేవంత్ రానున్నారని సమాచారం. ముందుగా గవర్నర్ శివప్రతాప్ శుక్లా చేతుల మీదుగా పూజాకార్యక్రమం పూర్తయ్యాక భక్తులకు దర్శనార్థం అనుమతి ఇస్తారని తెలుస్తోంది.











