ప్రేమ వివాహానికి సాయం చేశాడనే కారణంతో ఓ యువకుడిపై అమ్మాయి కుటుంబ సభ్యులు, బంధువులు దాడి చేసి దారుణంగా హతమార్చారు.ఈ ఘటన హైదరాబాద్‌లోని లాలాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకోగా..ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే.. కార్తీక్ (40) అనే వ్యక్తి లాలాగూడలో నివాసం ఉంటున్నాడు. స్థానికంగా పని చేసుకుంటూ కుటుంబంతో కలిసి జీవనం సాగిస్తున్నాడు.
అయితే, నాలుగేళ్ల కిందట ఓ యువతి ప్రేమపెళ్లికి కార్తీక్ సహకారం అందించాడు. దాంతో అప్పటి నుంచి యువతి కుటుంబ సభ్యులు, బంధువులు కార్తీక్ మీద కక్షపెంచుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే పండుగ నేపథ్యంలో వినాయక మండపం ఏర్పాటు చేస్తుండగా కార్తీక్‌తో యువతి తరపు బంధువుల గొడవకు దిగినట్టు సమాచారం. అది కాస్త తీవ్రతరం కావడంతో ఇరువర్గాల మధ్య తీవ్ర ఘర్షణకు దారితీసింది.
ప్లాన్ ప్రకారమే యువతి తరఫు బంధువులు, 10 మంది స్నేహితులతో కలిసి కార్తీక్ మీద యువతి అన్నదమ్ములు దాడి చేసినట్టు సమాచారం. అంతటితో ఆగకుండా కార్తీక్ గొంతు కోసి పరార్ అయినట్టు తెలిసింది.అయితే, రక్తపు మడుగులో ఉన్న కార్తీక్‌ను స్థానికులు, స్నేహితులు గాంధీ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్టు సమాచారం.
హత్యకు గంట ముందు కూడా బస్తీలో గొడవపై సమాచారం రావడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరువర్గాలకు సర్దిచెప్పి వెళ్లినట్లు తెలిసింది. కాసేపటికే మళ్లీ గొడవ కావడం, కార్తీక్ మీద హత్యాయత్నం జరగడంతో వెంటనే పోలీసులు అక్కడకు చేరుకున్నారు. కార్తీక్ మృతి చెందినట్టు వైద్యులు తెలపడంతో నిందితులను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నం అయ్యారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు. కాగా, కార్తీక్ మృతి చెందిన విషయం తెలిసి అతని కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని బాధిత కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు.











