Telangana Cabinet Expansion : తెలంగాణ కాంగ్రెస్ వర్గాల్లో మంత్రివర్గ విస్తరణ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతూ హైటెన్షన్ పుట్టిస్తోంది. ప్రస్తుతం కేబినెట్ విస్తరణ లేదని టీపీసీసీ చీఫ్ స్పష్టమైన ప్రకటన చేసినప్పటికీ, పదవులు ఆశిస్తున్న నేతల్లో మాత్రం వేడి ఏమాత్రం తగ్గడం లేదు. అధిష్టానం వద్ద తమకున్న పరపతిని ఉపయోగించి ఎలాగైనా ఈసారి మంత్రి పీఠం దక్కించుకోవాలని ఆశావహులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఈ గందరగోళానికి చెక్ పడాలంటే ఇప్పుడు స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే రంగంలోకి దిగి క్లారిటీ ఇవ్వాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు.
ఢిల్లీ స్థాయిలో పైరవీలు.. ఎవరి ధీమా వారిదే
మంత్రివర్గంలో స్థానం కోసం పోటీపడుతున్న నాయకుల జాబితా రోజురోజుకూ పెరుగుతోంది. ఒకవైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తనకు హైకమాండ్ నుంచి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ వచ్చిందని, మంత్రి పదవి ఖాయమనే పూర్తి ధీమాతో ఉన్నారు. మరోవైపు ఇటీవల మంత్రి పదవి కోల్పోయిన స్థానాన్ని భర్తీ చేస్తే ఆ స్థానం తనకే దక్కేలా సీనియర్ నాయకురాలు విజయశాంతి ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పుతున్నట్లు హస్తం పార్టీలో జోరుగా వినిపిస్తోంది. ఆ ఖాళీ తనకే దక్కుతుందని ఆమె గట్టి నమ్మకంతో లాబీయింగ్ కొనసాగిస్తున్నారట. వీరితో పాటు సామాజిక సమీకరణాల లెక్కలతో బీసీ, ఎస్టీ వర్గాలకు చెందిన కీలక నేతలు కూడా తమకే మంత్రిగా అవకాశం ఇవ్వాలంటూ గట్టిగా పట్టుబడుతున్నారని సమాచారం.
ఇప్పుడే సరైన సమయమా?
పార్టీ శ్రేణుల్లో మాత్రం మరో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న తరుణంలో, కేబినెట్ విస్తరణ చేయాలనుకుంటే ఇప్పుడే పూర్తి చేయడం అన్నివిధాలా శ్రేయస్కరమనే వాదన బలంగా వినిపిస్తోంది. కొత్తగా మంత్రులుగా బాధ్యతలు తీసుకునే వారికి ప్రజల్లోకి వెళ్లి పనిచేయడానికి తగినంత సమయం దొరుకుతుందని, చివరి నిమిషంలో చేస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.
రేవంత్ రెడ్డి నోరు విప్పితేనే శాంతించేనా?
టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ మంత్రి వర్గ విస్తరణపై ఇచ్చిన క్లారిటీని పక్కనపెట్టి ఎవరికి వారు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తుండటంతో కేడర్‌లో తీవ్ర అయోమయం నెలకొంది. అందుకే ఈ సస్పెన్స్‌కు తెరదించాల్సిన బాధ్యత ఇప్పుడు సీఎంపైనే ఉందంటున్నారు. ఒకవేళ విస్తరణ ఉంటే ఎప్పుడు ఉంటుంది? లేదా ఇప్పట్లో లేదనుకుంటే ఆ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా తేల్చి చెబితేనే ఆశావహులు శాంతించే అవకాశం ఉంది. లేదంటే ఈ లాబీయింగ్ రాజకీయాలు పార్టీ అంతర్గత వ్యవహారాలను మరింత వేడెక్కించడం ఖాయంగా కనిపిస్తోంది.










