తెలంగాణ

Telangana BJP : తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ vs బీఆర్ఎస్ వార్.. పత్తాలేని బీజేపీ లీడర్లు!

రచన: Mahesh5 నిమిషాల పఠనం

Telangana BJP : తెలంగాణ అసెంబ్లీ వేదికగా అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మధ్య సాగిన మాటల యుద్ధం రాష్ట్రాన్ని కుదిపేసింది. సభ లోపల, బయట ఇరు పార్టీల నేతలు మాటల తూటాలు, పోటాపోటీ సవాళ్లు ప్రజాక్షేత్రంలో తీవ్ర చర్చకు దారితీశాయి.

Telangana BJP : తెలంగాణ అసెంబ్లీ వేదికగా అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మధ్య సాగిన మాటల యుద్ధం రాష్ట్రాన్ని కుదిపేసింది. సభ లోపల, బయట ఇరు పార్టీల నేతలు మాటల తూటాలు, పోటాపోటీ సవాళ్లు ప్రజాక్షేత్రంలో తీవ్ర చర్చకు దారితీశాయి. రేవంత్ వర్సెస్ గులాబీ నాయకులు అన్నట్లుగా సాగిన ఈ హై-వోల్టేజ్ పొలిటికల్ డ్రామాతో రాష్ట్రంలోని ప్రధాన వార్తలన్నీ ఈ రెండు పార్టీల చుట్టూనే తిరిగాయి. అయితే తెలంగాణలో తామే ప్రత్యామ్నాయం అని నిత్యం గళమెత్తే బీజేపీ పార్టీ మాత్రం ఈ హోరాహోరీ పోరులో కనీసం కనిపించకుండా సైడ్ అయిపోవడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

కాంగ్రెస్, గులాబీ రచ్చ.. మూగబోయిన కమలనాథులు

అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా వ్యవహరించి మీడియా ఫోకస్‌ను, ప్రజల దృష్టిని పూర్తిగా తమవైపే తిప్పుకున్నాయి. ప్రజా సమస్యలపై రచ్చ లేపడం, పరస్పర విమర్శలతో మైలేజ్ సాధించడంలో ఈ రెండు పార్టీలు దూకుడు ప్రదర్శించాయి. కానీ జనాల సమస్యలపై సర్కార్‌ను గట్టిగా నిలదీసి తన బలాన్ని నిరూపించుకోవాల్సిన బీజేపీ శాసనసభాపక్షం మాత్రం ఈ సువర్ణావకాశాన్ని చేజేతులా జారవిడుచుకుంది. సభలో ప్రధాన ప్రతిపక్ష పాత్రను బీఆర్ఎస్ ఎగరేసుకుపోతుంటే, బీజేపీ ఎమ్మెల్యేలు కనీస ప్రతిఘటన కూడా ఇవ్వలేక చోద్యం చూశారన్న విమర్శలు స్వయంగా ఆ పార్టీ శ్రేణుల నుంచే వ్యక్తమవుతున్నాయి.

గ్రూపు రాజకీయాల కుమ్ములాట.. డైలమాలో హైకమాండ్

కాషాయం పార్టీ ఇంతలా స్తబ్దుగా మారిపోవడానికి పార్టీలోని అంతర్గత కుమ్ములాటలు, గ్రూపు విభేదాలే ప్రధాన కారణమని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. కీలకమైన అసెంబ్లీ వేదికను వాడుకోవడంలో నాయకుల మధ్య కనీస సమన్వయం కొరవడిందని సొంత పార్టీ నాయకులే విమర్శిస్తున్నారు. అగ్రనేతలు ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా వ్యవహరిస్తుండటంతో, కేడర్‌లో తీవ్ర గందరగోళం నెలకొంది. రాష్ట్రంలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ముఖాముఖి పోరుగా రాజకీయాలు మారుతున్న వేళ, తాము ఏ వైఖరి తీసుకోవాలి? ఎవరిని టార్గెట్ చేయాలి? అనే విషయంలో కమలం పార్టీ నేతల్లో తీవ్ర డైలమా స్పష్టంగా కనిపించింది.

ప్రత్యామ్నాయ నినాదానికి గండి పడ్డట్టేనా?

తెలంగాణలో అధికారం సాధిస్తామంటూ దూకుడుగా ముందుకెళ్లిన కమలదళం, అసెంబ్లీ వేదికగా ఇలా చతికిలపడటం ఆ పార్టీ భవిష్యత్తుకు ప్రమాదకర సంకేతమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ నువ్వా - నేనా అంటూ తలపడుతున్న టైంలో కాషాయ దళం కనీస పోటీ కూడా ఇవ్వలేకపోతే, ప్రజల మైండ్‌సెట్‌లో ఆ పార్టీ వెనుకబడిపోయే ప్రమాదం ఉంది. గ్రూపు తగాదాలను పక్కనపెట్టి వెంటనే తేరుకోకపోతే.. రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ మరింత అప్రస్తుతంగా మారే ప్రమాదం లేకపోలేదనే కామెంట్స్ గట్టిగా వినిపిస్తున్నాయి.

#Telangana BJP#Telangana Politics#BJP#Congress#BRS#Telangana Assembly#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి